శ్రీశైలానికి ఎలివేటెడ్‌ కారిడారే!

తెలంగాణ నుంచి శ్రీశైలం మీదుగా ఆంధ్రప్రదేశ్‌ వెళ్లేందుకు ‘మార్గం’ సులభతరం కానుంది. ఈ రహదారిలో ప్రస్తుతం ఉన్న ఇబ్బందులను తొలగిస్తూ రిజర్వ్‌ ఫారెస్ట్‌ ప్రాంతంలో ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మించనున్నారు. ఈ దారి అలైన్‌మెంట్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కేంద్రానికి 6 ప్రతిపాదనలను పంపగా.. ఎలివేటెడ్‌ కారిడారే ఉత్తమమని ప్రాథమికంగా నిర్ణయించింది. ఇంతవరకూ బాగానే ఉన్నా ఈ ప్రాజెక్టు ఆర్థికంగా అంత లాభదాయకం కాదని ఈ నెల 9న ఢిల్లీలో జరిగిన భేటీలో అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇదే విషయాన్ని కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయగా.. ప్రాజెక్టు నిర్మాణాల విషయంలో అన్నిసార్లూ ఆర్థిక అంశాలనే చూడకూడదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ కారిడార్‌ నిర్మాణంతో శ్రీశైలం పుణ్యక్షేత్రానికి మార్గం సులభతరం కావడంతో పాటు ఏపీ వెళ్లేందుకు ఎంతగానో దోహదపడుతుందని, రెండు రాష్ట్రాల మధ్య వాణిజ్య, వ్యాపార లావాదేవీలు మరింత పెరుగుతాయని కూడా తెలిపింది. శ్రీశైలం మార్గంలో కారిడార్‌ అవసరం కాబట్టి ప్రాజెక్టు ఖర్చులో సగం వాటాను భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. కాగా, ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి రూ.7,700 కోట్లు ఖర్చవుతుందని సమగ్ర నివేదికలో పేర్కొన్నారు. ఆ మొత్తంలో 50శాతం వాటా ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇందులోనూ 33 శాతం అంటే సుమారు రూ.2,541 కోట్లను నేరుగా ఇవ్వనున్నట్టు సమాచారం. మిగిలిన 17 శాతానికి సంబంధించి ప్రాజెక్టు నిర్మాణ సామగ్రి, తదితరాలకుఉండే పన్నులను రద్దు చేస్తామని చెప్పినట్లు తెలిసింది. ఈ అంశంపై కేంద్ర, రాష్ట్రాల మధ్య చర్చలు జరగనున్నాయి. త్వరలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పించాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఎలివేటెడ్‌ కారిడార్‌ ఖర్చులో సగం భరించేందుకు సిద్ధమైనట్టు తెలిసింది. త్వరలోనే కేంద్రం ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నాయని అధికారికవర్గాల సమాచారం.


54 కిలోమీటర్లతో కారిడార్‌..

శ్రీశైలం మార్గానికి సంబంధించి కేంద్రానికి అందించిన 6 రకాల అలైన్‌మెంట్లలో రహదారి స్వరూపంతో పాటు ఏ విధానానికి ఎన్ని నిధులు అవసరమవుతాయనే పూర్తి వివరాలను పేర్కొన్నారు. టోల్‌ప్లాజ్‌లు, బైపా్‌సలు, గ్రామాలు ఉన్న చోట నిర్మించతలపెట్టిన ర్యాంపులు, ఘాట్‌ రోడ్‌లో చేపట్టే రోడ్డు నిర్మాణాల అంశాలను కూడా పొందుపర్చారు. ఈ ఎలివేటెడ్‌ కారిడార్‌ను ఇంజనీరింగ్‌, ప్రొక్యూర్‌మెంట్‌, కన్‌స్ట్రక్షన్‌ (ఈపీసీ) విధానంలో చేపట్టాలని పేర్కొన్నారు. నివేదికను పరిశీలించి, కేంద్రం ఆమోదం తెలిపితే.. వెంటనే సమగ్ర ప్రాజెక్టు నివేదికను (డీపీఆర్‌)ను ఖరారు చేసి, 2025-26 ఆర్థిక సంవత్సరంలో పనులు ప్రారంభించే అవకాశం ఉంది. కాగా కొత్త అలైన్‌మెంట్ల ప్రకారం ఈ మార్గం మన్ననూర్‌ చెక్‌పోస్టుకు కొంచెం ముందు బ్రాహ్మణపల్లి నుంచి ప్రారంభమై.. ఈగలపెంట తర్వాత ముగుస్తుంది. ఈ మధ్యలో మన్ననూరు, వట్టర్‌పల్లి దగ్గర రెండు బైపా్‌సలను, ఆ తర్వాత ఒకచోట టోల్‌ప్లాజా, రెస్ట్‌ ఏరియాలను ఏర్పాటు చేయనున్నారు. ఘాట్‌ రోడ్డు దగ్గర ప్రత్యేకంగా నిర్మాణాలుంటాయి. మన్ననూరు చెక్‌పోస్ట్‌ నుంచి పాతాళగంగ వరకు నిర్మించే ఈ కారిడార్‌ పొడవు 54 కిలోమీటర్లు ఉండనుంది. ఈ రహదారి పూర్తయి, అందుబాటులోకి వస్తే హైదరాబాద్‌-శ్రీశైలంతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లేందుకు ప్రయాణ సమయం, దూరం కూడా తగ్గనుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.