రష్యాతో బంధం కాలపరీక్షలకు తట్టుకొని బలపడిందని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఆయన ఉత్తర్‌ప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధానగర్ (Gautam Buddha Nagar)లో మొదలైన ట్రేడ్‌షో (International Trade Show)లో జరిగిన సభలో మాట్లాడారు.
ఈ వాణిజ్య ప్రదర్శనకు కూడా మాస్కో భాగస్వామిగా వ్యవహరిస్తోందన్నారు. దేశ స్వయంసమృద్ధిలో ఉత్తరప్రదేశ్ పాత్రను ఆయన కొనియాడారు. భారత్‌లో తయారయ్యే మొబైల్ ఫోన్లలో అత్యధికం ఇక్కడినుంచే వస్తున్నాయన్నారు. సెమీకండక్టర్ రంగంలోను భారత్ స్వయంసమృద్ధి సాధించాలని పేర్కొన్నారు. భారత్‌లోనే చిప్ నుంచి షిప్ వరకు అన్నీ తయారుచేయాలని తాము కోరుకుంటున్నట్లు వెల్లడించారు. పన్నుల తగ్గింపు కొనసాగుతుందన్నారు.
”భారత్‌లో తయారయ్యే మొబైల్ ఫోన్లలో 55 శాతం యూపీ నుంచే వస్తున్నాయి. సెమీకండక్టర్ రంగంలో కూడా ఈ రాష్ట్రం బలోపేతమైంది. ఇతర దేశాలపై ఆధారపడటం తగ్గించుకోవాలని మన దళాలు భావిస్తున్నాయి. మనం బలమైన రక్షణ రంగాన్ని అభివృద్ధి చేసుకొంటున్నాం. రష్యా సాయంతో ఇక్కడ ఏర్పాటుచేసిన ఫ్యాక్టరీలో ఏకే-203 రైఫిల్స్ ఉత్పత్తి మొదలుపెడతాము. యూపీలో డిఫెన్స్ కారిడార్‌ను నిర్మిస్తున్నారు.
జీఎస్టీలో మార్పులు నిర్మాణాత్మక సంస్కరణలు. అవి భారత వృద్ధికి రెక్కలు తొడుగుతాయి. జీఎస్టీ రిజిస్ట్రేషన్ సరళంగా మారింది. పన్ను వివాదాలు గణనీయంగా తగ్గాయి. ఎంఎస్‌ఎంఈలకు వేగంగా రీఫండ్స్ లభిస్తున్నాయి.
































