మహిళకు ఉచిత ప్రయాణం పథకానికి ఆదరణ పెరుగుతోంది. ఆర్టీసీ బస్సులు మహిళలతో కిక్కిరిసి పోతున్నాయి. అలాగే విద్యార్థులు, ఉద్యోగులు సైతం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు.
వీరికి ప్రభుత్వం నిర్దారించిన గుర్తింపు కార్డులతో ఉచిత ప్రయాణానికి అనుమతిస్తున్నారు. అయితే, ఇక నుంచి ఉచిత ప్రయాణ లబ్దిదారులకు కొత్తగా ఐడీ కార్డులు ఇవ్వాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ మేరకు కసరత్తు చేస్తోంది. వీటిని తీసుకురావటం ద్వారా ఇక ఆధార్ కార్డులతో అవసరం లేకుండా, ప్రభుత్వం జారీ చేసే వాటినే ప్రామాణికంగా తీసుకోనున్నారు.
తెలంగాణ ఆర్టీసీ తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. కొత్తగా స్మార్ట్ కార్డులను వినియోగం లోకి తీసుకురావాలని డిసైడ్ అయింది. తొలి దశలో ఆర్టీసీ విద్యార్థుల బస్ పాసులను స్మార్ట్ కార్డుల రూపంలోకి మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. ఇతర రాష్ట్రాల్లో అమల్లో ఉన్న స్మార్ట్ కార్డుల విధానాన్ని అధికారులు అధ్యయనం చేస్తున్నారు. పూర్తిగా ప్రయాణీకుల సమాచారం తో ఈ కార్డులను తయారు చేయనున్నారు. విద్యార్థుల తర్వాత మహాలక్ష్మి పథకం కింద ఉచితంగా ప్రయాణిస్తున్న మహిళలకు ఈ స్మార్ట్‌కార్డులను జారీ చేసేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రంలో విద్యార్థుల బస్‌పాస్ ల సంఖ్య ఐదు లక్షలకు పైగా ఉంది. ప్రస్తుతం ఈ బస్ పాస్ లకు సంబంధిత బస్ పాస్ కౌంటర్లకు వెళ్లి రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇందు కోసం దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో అమలవుతున్న స్మార్ట్ కార్డుల వ్యవస్థ తీరు తెన్నులను సైతం సంస్థ ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. ఈ విధానాన్ని జంట నగరాల్లో ప్రవేశ పెడితే.. ఎదురయ్యే సవాళ్లను వారు అంచనా వేస్తున్నారు. స్మార్ట్ కార్డు విధానం అందు బాటులోకి వస్తే ఆధార్, ఇతర చిరునామా ధృవీకరణ కార్డుల అవసరం ప్రయాణికులకు ఉండదు. వీటిని డిజిటల్ పద్దతి ద్వారా రెన్యువల్ చేసుకోనే అవకాశం ఉంది.
మొబైల్ రీఛార్జీ చేసుకున్నంత సులువుగా స్మార్ట్ కార్డు బస్ పాస్‌ను రెన్యువల్చేసుకునే అవకాశం ఉందని అర్టీసీ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం బెంగళూరు, ముంబయి, లక్నో నగరాల్లోని బస్సుల్లో స్మార్ట్‌కార్డు విధానాల్లో ఎలాంటి ఫీచర్లు అమలు చేస్తున్నారనే అంశం పైన అధికారులు అధ్యయనం చేస్తున్నారు. ఈ కార్డులు అందుబాటులోకి తెస్తే.. ఇక ఉచిత ప్రయాణానికి ఆధార్ అవసరం ఉండదని అధికారులు చెబుతున్నారు.
































