చరిత్ర సృష్టించిన అభిషేక్‌ శర్మ.. స్టార్‌ ఆటగాడి రికార్డు బద్దలు

సియా కప్‌ 2025లో (Asia cup 2025) టీమిండియా ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (Abhishek Sharma) విధ్వంసకాండ​ కొనసాగుతోంది. ఈ టోర్నీలో తొలి మ్యాచ్‌ నుంచే చెలరేగిపోతున్న అతను..


ఇవాళ (సెప్టెంబర్‌ 26) శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లోనూ (India vs Sri Lanka) మెరుపులు కొనసాగించాడు. ఈ మ్యాచ్‌లో అభిషేక్‌ 31 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 61 పరుగులు చేశాడు.

ఈ టోర్నీలో అభిషేక్‌కు ఇది వరుసగా మూడో హాఫ్‌ సెంచరీ. అంతకుముందు బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌పై కూడా హాఫ్‌ సెంచరీలు చేశాడు. తొలి మ్యాచ్‌ నుంచి వరుసగా 30 (16), 31 (13), 38 (15), 74 (39), 75 (37), 61 (31) స్కోర్లు చేసిన అభిషేక్‌.. 6 మ్యాచ్‌ల్లో మొత్తంగా 309 పరుగులు (204.63 స్ట్రయిక్‌రేట్‌తో, 51.50 సగటున, 3 హాఫ్‌ సెంచరీలు, 31 ఫోర్లు, 19 సిక్సర్లు) చేశాడు. ఈ టోర్నీలో అభిషేక్‌ మరో మ్యాచ్‌ (ఫైనల్‌) కూడా ఆడాల్సి ఉంది.

ఈ క్రమంలో అభిషేక్‌ ఓ ఆల్‌టైమ్‌ రికార్డును సెట్‌ చేశాడు. టీ20 ఫార్మాట్‌లో జరిగే ఆసియా కప్‌ చరిత్రలో ఓ సింగిల్‌ ఎడిషన్‌లో 300 పరుగుల మార్కును తాకిన తొలి బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. గతంలో ఎవ్వరూ ఈ మార్కును తాకలేదు. అభిషేక్‌కు ముందు టీ20 ఆసియా కప్‌ చరిత్రలో అత్యధిక పరుగులు (సింగిల్‌ ఎడిషన్‌) చేసిన రికార్డు పాకిస్తాన్‌ స్టార్‌ ఆటగాడు మొహమ్మద్‌ రిజ్వాన్‌ (281) పేరిట ఉండేది.

రోహిత్‌ శర్మ సరసన
ప్రస్తుత ఎడిషన్‌లో వరుసగా 7 ఇన్నింగ్స్‌ల్లో 30 ప్లస్‌ స్కోర్లు చేసిన అభిషేక్‌ మరో రికార్డును కూడా సమం చేశాడు. టీ20ల్లో భారత్‌ తరఫున అత్యధిక సార్లు వరుసగా 30 ప్లస్‌ స్కోర్లు చేసిన బ్యాటర్‌గా రోహిత్‌ శర్మ (Rohit Sharma) సరసన చేరాడు. రోహిత్‌ కూడా అంతర్జాతీయ టీ20ల్లో వరుసగా 7 ఇన్నింగ్స్‌ల్లో 30 ప్లస్‌ స్కోర్లు చేశాడు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. శ్రీలంకతో జరుగుతున్న నామమాత్రపు మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న టీమిండియా 13 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది. అభిషేక్‌ (61), శుభ్‌మన్‌ గిల్‌ (4), సూర్యకుమార్‌ యాదవ్‌ (12) ఔట్‌ కాగా.. తిలక్‌ వర్మ (27), సంజూ శాంసన్‌ (22) క్రీజ్‌లో ఉన్నారు. కాగా, ఈ టోర్నీలో భారత్‌, పాకిస్తాన్‌ ఇదివరకే ఫైనల్‌కు చేరాయి. ఇవాళ జరుగుతున్నది నామమాత్రపు మ్యాచ్‌. సెప్టెంబర్‌ 28న ఫైనల్‌ జరుగుతుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.