భారతీయులపై మరో బాంబ్ పేల్చిన డొనాల్డ్ ట్రంప్.. కలలు ఆవిరి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. రోజురోజుకూ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇవి పలు దేశాలపై ప్రభావం చూపిస్తున్నాయి.


ఇప్పటివరకు దిగుమతి సుంకాలు భారీగా పెంచి.. ఆయా దేశాల వాణిజ్యంపై దెబ్బకొట్టిన ట్రంప్.. ఇప్పుడు మరో షాకింగ్ ప్రకటన చేశారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. ముఖ్యంగా.. అమెరికాలోని కంపెనీల్లో పని చేసే వారికి పెద్ద సమస్యే తలెత్తనుంది. ట్రంప్.. H1B వీసా వార్షిక రుసుమును సడెన్‌గా లక్ష డాలర్లకు (భారత కరెన్సీలో రూ. 88 లక్షలకుపైనే) పెంచారు. దీనికి సంబంధించి.. కార్యనిర్వాహక ఉత్తర్తుపైనా సంతకం చేశారు.

ఇక్కడ అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న కంపెనీలు.. విదేశాల్లోని నిపుణుల్ని నియమించుకునేందుకు.. H1B వీసా జారీ చేస్తుంటాయి. దీని కోసం ఇక మీదట ఏడాదికి రూ. 88 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో.. ఐటీ/టెక్ రంగంపై ఎలాంటి ప్రభావం పడుతుందోనన్న ఆందోళనల మధ్య.. ఆయా కంపెనీలు ఇప్పటికే అప్రమత్తం అయ్యాయి. ఇప్పుడు టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్, మెటా వంటి సంస్థలు.. తమ ఉద్యోగులకు అత్యవసర అడ్వైజరీ జారీ చేశాయి. ఇదే బాటలో అమెజాన్, జేపీ మోర్గాన్ కూడా ఉద్యోగులకు మెయిల్స్ చేసినట్లు తెలుస్తోంది.

>> మైక్రోసాఫ్ట్ ఈ మేరకు ఉద్యోగులకు ఇంటర్నల్ మెయిల్ చేసింది. ఇక్కడ ఇతర దేశాల్లో ఉన్న H1B, H4 వీసాదారులు అంతా సెప్టెంబర్ 21 లోపు అమెరికాకు తిరిగి రావాలని స్పష్టం చేసింది. ఈ మేరకు రాయిటర్స్ ఒక కథనం వెల్లడించింది. ఇంకా.. అమెరికాలోని తమ ఉద్యోగులు వీలైనంత వరకు విదేశీ ప్రయాణాలు చేయొద్దని పేర్కొంది. మైక్రోసాఫ్ట్ అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మైక్రోసాఫ్ట్ బాటలోనే మెటా కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ట్రంప్ నిర్ణయంపై పూర్తి స్పష్టత వచ్చే వరకు .. కనీసం 2 వారాల పాటు అమెరికాలో ఉన్న తమ ఉద్యోగులు ఎక్కడికీ వెళ్లొద్దని పేర్కొంది. ఇతర దేశాల్లోని H1B, H4 వీసాదారులు కూడా 24 గంటల్లోగా అమెరికాకు వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని వెల్లడించింది.

>> అమెరికాలో H1B వీసాలు పొందే వారిల్లో అత్యధికంగా భారతీయులు ఉన్నారు. దాదాపు 71 శాతం వరకు వీరే ఉన్నారని తెలుస్తోంది. టీసీఎస్, ఇన్ఫోసిస్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ ఇలా దిగ్గజ టెక్ కంపెనీలు.. ఎక్కువగా మన దేశం నుంచే నిపుణుల్ని తీసుకుంటున్నాయి. ఇదివరకు లాటరీ పద్ధతిలో వీసాలు ఇచ్చేవారు. ఇప్పుడు రుసుములు భారీగా పెరిగిన క్రమంలో వీసాలు ఇచ్చేందుకు వెనుకడుగు వేసే అవకాశం ఉంటుంది. దీంతో అమెరికాకు వెళ్లాలనుకునే విద్యార్థులు, ఎంట్రీ లెవెల్ నిపుణులపై తీవ్ర ప్రభావం పడనుంది.

అక్కడి కొన్ని కంపెనీలు.. H1B వీసాను దుర్వినియోగం చేస్తున్నట్లు ట్రంప్ సర్కార్ భావిస్తోంది. వేరే దేశాల నుంచి తక్కువ జీతాలు ఇస్తూ నిపుణుల్ని తెచ్చి.. అమెరికాలోని ఉద్యోగాల్ని వారికి ఇస్తున్నట్లు ఆరోపిస్తోంది. కొత్త విధానంతో ఇప్పుడు అత్యంత నిపుణులైన వారే అమెరికాలోకి ప్రవేశిస్తారని.. తక్కువ జీతాలకు పనిచేసే అవకాశమే ఉండదని బలంగా నమ్ముతున్నారు ట్రంప్. దీంతో అమెరికన్లకే ఎక్కువ ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పొచ్చు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.