చెక్‌బౌన్స్ కేసుల్లో సుప్రీంకోర్టు తాజా మార్గదర్శకాలు
చెక్ బౌన్స్ కేసులో నిందితులు తమ వాంగ్మూలం నమోదుకు ముందే చెక్‌లోని మొత్తాన్ని చెల్లిస్తే ఎటువంటి జరిమానా విధించకుండా ట్రయల్‌కోర్టు న్యాయాధికారి ఆ కేసు కొట్టేయవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఒకవేళ నిందితుడు తన వాంగ్మూలం నమోదు తర్వాత (విచారణ కోర్టు తీర్పునకు ముందే) చెక్‌లోని మొత్తాన్ని చెల్లిస్తే.. న్యాయాధికారి, చెక్‌లో పేర్కొన్న మొత్తం మీద 5 శాతాన్ని న్యాయసేవల ప్రాధికార సంస్థకు లేదా సంబంధిత సంస్థకు చెల్లించాలని ఆదేశిస్తూ కేసును ముగించవచ్చని తెలిపింది. చెక్ బౌన్స్ కేసు సెషన్స్ కోర్టు లేదా హైకోర్టు వరకు వస్తే.. న్యాయమూర్తి చెక్‌లోని మొత్తం మీద అదనంగా 7.5ు చెల్లింపునకు ఆదేశించవచ్చని, సుప్రీంకోర్టుకు ఆ కేసు వస్తే అదనంగా 10ు చెల్లింపునకు ఆదేశించి కేసును కొట్టేయవచ్చని తెలిపింది. దేశంలోని ప్రధాన నగరాల జిల్లా కోర్టుల్లో చెక్ బౌన్స్ కేసులు భారీగా పేరుకుపోతున్న నేపథ్యంలో, వాటి పరిష్కారానికి సుప్రీంకోర్టు శుక్రవారం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.
ప్రస్తుతం చెక్‌బౌన్స్ కేసులను నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ (ఎన్ఐ) యాక్ట్‌లోని 15ఏళ్ల నాటి నిబంధనలకు అనుగుణంగా విచారిస్తున్నారు. వీటిలో సవరణలు చేస్తూ జస్టిస్ మన్మోహన్, జస్టిస్ ఎన్వీ అంజారియాల సుప్రీంకోర్టు ధర్మాసనం తాజా మార్గదర్శకాలను వెలువరించింది. చెక్‌బౌన్స్ కేసులు భారీగా పేరుకుపోతుండటంపై దర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్ఐ చట్టంలోని సెక్షన్ 138 కింద నమోదైన (చెక్‌బౌన్స్) కేసుల్లో నిందితుడికి సమన్లు జారీ చేసే ప్రక్రియ కూడా కేసులు పెండింగులో ఉండటానికి ఓ ప్రధాన కారణమవుతోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీనికి పరిష్కారంగా దస్తీ సమన్లను కూడా ఇక మీదట అనుమతించాలని ఆదేశాలు జారీ చేసింది.
































