MGBS బస్టాండ్‌ తాత్కాలిక మూసివేత..! ఏ బస్సు ఏ రూట్లో వెళ్తుందంటే..?

హైదరాబాద్ MGBS బస్టాండ్‌ను శుక్రవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో పెద్ద ఎత్తున వరద చుట్టుముట్టింది. దీంతో అప్రమత్తమైన అధికారులు, సిబ్బంది ప్రయాణికులను తాళ్ల సాయంతో బయటకు పంపించారు. మూసీ వరద నీరు MGBSలోకి వచ్చిన సమయంలో సుమారు 3 వేల మంది ప్రయాణికులు బస్టాండ్‌లో ఉన్నారు. ఈ క్రమంలో MGBS బస్టాండ్‌ను తాత్కాలికంగా మూసి వేస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ట్వీట్‌ చేశారు..

హైదరాబాద్‌ MGBSను మూసీ వరద చుట్టుముట్టిన నేపథ్యంలో ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ కీలక ప్రకటన వెలువరించారు. మూసీ న‌దికి భారీ వ‌ర‌ద నేప‌థ్యంలో ఎంబీజీఎస్ ప్రాంగ‌ణంలోకి వ‌ర‌ద నీరు చేరింది. దీంతో ఎంజీబీఎస్ బ‌స్ స్టేష‌న్ నుంచి బ‌స్సుల రాక‌పోక‌ల‌ను టీజీఎస్ఆర్టీసీ తాత్కాలికంగా నిలిపివేసింది. ఎంబీజీఎస్ నుంచి బ‌య‌లుదేరే బ‌స్సుల‌ను హైద‌రాబాద్ లోని వివిధ ప్రాంతాల నుంచి సంస్థ న‌డుపుతోందని సజ్జనార్‌ సోషల్ మీడియా వేదికగా ఎక్స్ ఖాతాలో ట్వీట్‌ చేశారు. ఏయే బస్సులు ఎటునుంచి వెళ్తాయో ఆయన ట్వీట్‌లో వివరించారు.


ఏ బస్సు ఏయే రూట్లలో నడుస్తాయంటే..

  • ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ వైపునకు వెళ్లే స‌ర్వీసులు జేబీఎస్ నుంచి న‌డుస్తున్నాయి.
  • వరంగల్, హన్మకొండ వైపున‌కు వెళ్లేవి ఉప్పల్ క్రాస్ రోడ్స్ నుంచి వెళ్తున్నాయి.
  • సూర్యాపేట‌, న‌ల్లగొండ, విజ‌య‌వాడ వైపున‌కు బ‌స్సులు ఎల్బీన‌గ‌ర్ నుంచి న‌డుస్తున్నాయి.
  • మ‌హ‌బూబ్‌న‌గ‌ర్, క‌ర్నూల్, బెంగ‌ళూరు వైపున‌కు వెళ్లే స‌ర్వీసులు ఆరాంఘర్ నుంచి వెళ్తున్నాయి.
  • మూసీ వ‌ర‌ద‌నీరు చేరిన నేప‌థ్యంలో ఎంజీబీఎస్ కు ప్రయాణికులు ఎవ‌రూ రావొద్దని టీజీఎస్ఆర్టీసీ విజ్ఞప్తి చేస్తోంది. ఎంబీజీఎస్ నుంచి న‌డిచే బ‌స్సుల‌ను ఇత‌ర ప్రాంతాల నుంచి తిప్పుతున్నామ‌ని, ఆయా మార్గాల ద్వారా త‌మ గమ్యస్థానాల‌కు చేరుకోవాల‌ని పేర్కొంది. వివ‌రాల‌కు టీజీఎస్ఆర్టీసీ కాల్ సెంట‌ర్ నంబ‌ర్లు 040-69440000, 040-23450033 సంప్రదించాల‌ని సూచించింది.
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.