ఉద్యోగుల సమస్యలన్నిటిని పరిష్కరించడంతో పాటు మరింత మేలు చేస్తామని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తమను పట్టించుకోవడం లేదని ప్రభుత్వ ఉద్యోగ వర్గాలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నాయి.
ఏడాదిన్నరగా ఇవ్వాల్సిన నాలుగు డీఏలు ఇవ్వలేదు. వేతన సవరణ సంఘం ప్రకటించలేదు. ఐఆర్ కూడా ఇవ్వకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికే తమ అసంతృప్తిని నిరసనల ద్వారా వ్యక్తం చేసినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఇప్పుడు సమ్మెకు దిగారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
విద్యుత్ సంస్థలు ఏపీ జెన్‌కో ఎండీ, ట్రాన్స్‌కో, ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లలో సమ్మె సైరన్ మోగింది. అక్టోబర్ 15వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు ఏపీ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ప్రకటించింది. ఈ మేరకు డిస్కమ్‌లకు నోటీసులు ఇచ్చింది. సీఎండీలకు ఈ మెయిల్ ద్వారా నిరవధిక సమ్మెనోటీసులను పంపించినట్లు జేఏసీ ప్రతినిధులు తెలిపారు. సమ్మెకు వెళ్లే ముందు ఏపీలోని పలు ప్రాంతాల్లో నిరసనలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
ఉద్యమ కార్యాచరణ
సమ్మెకు వెళ్లే ముందు అక్టోబర్ 6వ తేదీన విశాఖపట్టణంలోని ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం వద్ద ధర్నా
అక్టోబర్ 8వ తేదీన తిరుపతిలోని ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం ఎదుట నిరసన ధర్నా
అక్టోబర్ 13న చలో విజయవాడ పేరుతో భారీ ఆందోళన
అక్టోబర్ 14న అన్ని సంస్థల్లో వర్క్ టు రూల్ అమలు చేసి పనిగంటల వరకే కార్యాలయాల్లో విధులు
పై కార్యాచరణకు ప్రభుత్వం స్పందించి ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే సమ్మెకు అక్టోబర్ 15వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని విద్యుత్ ఉద్యోగులు తెలిపారు. యాజమాన్యాలు స్పందించి చర్చలకు పిలిచి సమస్యలను పరిష్కరించపోతే అక్టోబర్ 15వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. అన్ని సంస్థల్లోనూ వివిధ విభాగాల్లో ఉన్న దాదాపు 33,582 మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటారని జేఎసీ తెలిపింది.






























