గుండెపోటు తర్వాత మొదటి 90 రోజుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. వైద్యుల సూచనలివే

గుండెపోటు అనేది శారీరకంగా, మానసికంగా జీవితాన్ని మార్చేసే ఆరోగ్య ప్రమాదం. అందుకే అది రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.


ఒకవేళ హార్ట్ ఎటాక్ వచ్చినా.. అధునాతన చికిత్సలు మనుగడ రేటును గణనీయంగా మెరుగుపరుస్తున్నాయి. అయినప్పటికీ గుండెపోటు చికిత్స తర్వాత కొన్నాళ్లు కచ్చితంగా జాగ్రత్తలు (Heart Health After Heart Attack) తీసుకోవాలి. లేదంటే మరోసారి వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా మొదటి 90 రోజులు(90 Days After Heart Attack) పూర్తిగా కోలుకోవడానికి సమయాన్ని కేటాయించాలి. దీనివల్ల భవిష్యత్తులో గుండె సంబంధిత ఇబ్బందులు రాకుండా ఉంటాయని చెప్తున్నారు కార్డియోవాస్కులర్ సర్జరీ స్పెషలిస్ట్ డాక్టర్ ముఖేష్ గోయల్.

మొదటిసారి గుండెపోటు వచ్చిన తర్వాత మళ్లీ రెండోసారి అటాక్ అయ్యే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు నిపుణులు. కాబట్టి మొదటి 90 రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. లేదంటే అరిథ్మియాస్, హార్ట్ ఫెయిల్యూర్ లేదా మరోసారి గుండెపోటు వచ్చే ప్రమాదాలు ఎక్కువ అవుతాయి. ప్రపంచ హృదయ దినోత్సవం (World Heart Day) సందర్భంగా గుండెపోటు తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో.. ఫాలో అవ్వాల్సిన లైఫ్​స్టైల్ ఏంటో.. డాక్టర్ ముఖేష్ ఇస్తోన్న సూచనలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

90 రోజులు ఎందుకు ముఖ్యమైనవంటే..

గుండెపోటు తర్వాత 90 రోజులను ది గోల్డెన్ విండో అంటారు. ఈ 90 రోజుల వ్యవధిలో పునరావాసంలో పాల్గొని.. జీవనశైలి మార్పులు చేసుకోవాల్సి ఉంది. ఆ సమయంలో చేసే మార్పులే.. రోగులలో గుండెపోటు మళ్లీ వచ్చే ప్రమాదాన్ని 25–30% తగ్గిస్తాయి. శరీరం బలహీనమైన గుండె కణజాలాలను నయం చేయగలుగుతుంది. ఆ సమయంలో భావోద్వేగపరంగా కొన్నిసార్లు భయపడతారు. నిరాశకు గురవుతారు. ఆందోళన చెందుతారు. వాటిని అధిగమించడానికి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి.. 90 రోజుల్లో చేయాల్సిన మార్పులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూసేద్దాం.

ఫాలో-అప్స్

ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే రికవరీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. కార్డియాలజిస్ట్తో తరచుగా ఫాలో-అప్ అవ్వాలి. దీనివల్ల రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలు, హార్ట్​బీట్ సమస్యలను ట్రాక్ చేస్తారు. అలాగే వైద్యులు సూచించిన మందులు సరిగ్గా తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. వాటిని మిస్ అయితే ప్రాణాంతకం అవుతుంది. అలాగే రెగ్యులర్​గా రక్తంలో చక్కెరను చెక్ చేసుకోవాలి. వీటిని డాక్టర్​కి అప్​డేట్ చేయాలి. ఇలా చేయడం వల్ల త్వరగా రికవరీ అవ్వడానికి హెల్ప్ అవుతుంది.

కార్డియాక్ రీహాబ్

గుండె కోలుకోవడానికి కార్డియాక్ రీహాబ్ అవసరం. ఈ రీహాబ్​లో భాగంగా గుండె ఆరోగ్యానికై వ్యాయామం, కౌన్సెలింగ్ ఇస్తూ సూచనలు చేస్తారు. ఇది వైద్యపరంగా పర్యవేక్షించే ఓ సెషన్. ఇది 12 వారాల పాటు ఉంటుంది. ఆ సమయంలో హృదయనాళ ఆరోగ్యాన్ని మెరుగుపడుతుంది. తీసుకునే ఆహారం నుంచి ఒత్తిడి నిర్వహణపై సలహాలు ఇస్తారు. దీనివల్ల రికవరీ త్వరగా ఉంటుంది. అయితే ఈ తరహా రీహాబ్స్​ ఇండియాలో తక్కువగా ఉన్నాయి. అందుబాటులో ఉండేవారు వెళ్తే మాత్రం చాలామంచిది.

పోషకాహారం

గుండె కోలుకోవడంలో ఆహారం ముఖ్యమైన భాగం. మొదటి 90 రోజులు గుండె ఆరోగ్యానికి తగిన ఆహారాన్ని తీసుకోవాలి. దీనిలో భాగంగా వైద్యులు DASH (డైటరీ అప్రోచెస్ టు స్టాప్ హైపర్టెన్షన్) లేదా బ్యాలెన్స్డ్ డైట్ సూచిస్తారు. దీనిలో భాగంగా తాజాగా వండిన వంటలు, కూరగాయలు, తృణధాన్యాలు, చేపలు, పప్పులు, నట్స్, లీన్ ప్రోటీన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆలివ్ నూనె, సీడ్స్, అవకాడోలు హెల్తీ ఫ్యాట్స్​తో నిండి ఉండి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఉప్పు, చక్కెర, ప్రాసెస్ చేసిన ఫుడ్స్ తగ్గించాలి. పోర్షన్ కంట్రోల్​ కూడా ఉండాలి.

శారీరక శ్రమ

వైద్యుని పర్యవేక్షణలో క్రమం తప్పకుండా శారీరక వ్యాయామాన్ని చేయాలి. మొదటి కొన్ని వారాల్లో మెట్లపైకి, కిందకి దిగడం, నెమ్మదిగా నడవడం వంటివి చేయాలి. వైద్యపరంగా ఆమోదించిన గుండె కండరాలను బలపరిచే వ్యాయామాలు చేయాలి. అయితే ఎక్కువగా స్టైస్ తీసుకోకుండా నెమ్మదిగా వీటిని చేస్తూ ఉండాలి. ఛాతీలో నొప్పి, అలసట, నీరసంగా అనిపించినా గ్యాప్ తీసుకోవాలి.

మానసిక శ్రేయస్సు

గుండెపోటు వచ్చినవారు మానసిక ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టాలి. డిప్రెషన్ నుంచి శరీరాన్ని కోలుకునేలా చేయాలి. కౌన్సెలింగ్ లేదా థెరపీ తీసుకోవాలి. ఫ్యామిలీ సపోర్ట్ అవసరం. ధ్యానం, లోతైన శ్వాసలు తీసుకోవడం, యోగా వంటివి మంచి ఫలితాలు ఇస్తాయి. ఆందోళనను తగ్గిస్తాయి.

లైఫ్​స్టైల్ మార్పులు

గుండె ఆరోగ్యానికి కొన్ని అలవాట్లను రీసెట్ చేసుకోవాలి. ధూమపానం మానేయాలి. ఆల్కహాల్ తగ్గించాలి. పూర్తిగా మానేసినా మంచిదే. బరువు తగ్గాలి. తగినంత నిద్రపోవడం కూడా కీలకమే. ఒత్తిడి కలిగించే అంశాలకు దూరంగా ఉండాలి. మొదటి కొన్ని వారాల్లో ఎక్కువ దూరం ప్రయాణించకపోవడమే మంచిది.

90 రోజులు వీటిని ఫాలో అయిన తర్వాత కూడా వీటిని కంటిన్యూ చేస్తే మంచిది. దీనివల్ల గుండెపై ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆరోగ్యంగా ఉండగలుగుతారు. కాబట్టి వైద్యుల సూచనల మేరకు వీటిని ఫాలో అవ్వాలి.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్ను సంప్రదించాలి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.