అక్టోబర్ 1 నుంచి పోస్టాఫీసు స్పీడ్ పోస్ట్ సేవల్లో కీలక మార్పులు రానున్నాయి. ఇప్పటి వరకు డెలివరీ సమయంలో సంతకం తీసుకునే విధానానికి బదులుగా, ఇకపై వన్-టైమ్ పాస్వర్డ్ (OTP) తప్పనిసరి కానుంది.
పార్శిల్‌ను అందుకునేవారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని డెలివరీ సిబ్బందికి చెబితేనే పార్శిల్‌ను అందజేస్తారు. ఈ కొత్త విధానం ద్వారా పార్శిళ్లు సరైన వ్యక్తులకు చేరుతున్నాయో లేదో నిర్ధారించుకోవచ్చు. తెలంగాణ పోస్టల్ సర్కిల్ లోని 6,000కు పైగా పోస్టాఫీసుల్లో ఈ కొత్త సేవలు అందుబాటులోకి రానున్నాయి. భద్రత, విశ్వసనీయత, కస్టమర్ సౌలభ్యం కోసం ఈ మార్పులు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
కొత్త టారిఫ్ రేట్లు:
13 ఏళ్ల విరామం తర్వాత, అంటే 2012లో సవరించిన ధరలను మళ్లీ ఇప్పుడు మార్చారు. ఈ కొత్త టారిఫ్‌లు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. ఇక కొత్తదారాలను పరిశీలిస్తే.. 50 గ్రాముల వరకు రూ.19, 50-250 గ్రాముల మధ్య రూ.24, 250-500 గ్రాముల మధ్య రూ.28, అలాగే సుదూర ప్రాంతాలకు (200 నుండి 2,000 కి.మీ)లకు 50 గ్రాముల రూ.47 వరకు వాసులు చేయనున్నారు. ఇక ఈ స్పీడ్ పోస్ట్ సేవలకు జీఎస్టీ వర్తిస్తుంది. అయితే, విద్యార్థుల సౌలభ్యం కోసం మంత్రిత్వ శాఖ స్పీడ్ పోస్ట్ టారిఫ్‌పై 10% తగ్గింపును ప్రకటించింది. అలాగే, కొత్తగా ఎక్కువ మొత్తంలో సేవలు వినియోగించుకునే కస్టమర్లకు 5% ప్రత్యేక తగ్గింపు ఉంటుందని పోస్టల్ అధికారులు తెలిపారు.
గతంలో బాగా ప్రాచుర్యం పొందిన పోస్ట్‌కార్డులు, ఇన్‌ల్యాండ్ లెటర్ల వాడకం ఇప్పుడు బాగా తగ్గిపోయింది. డిజిటల్ కమ్యూనికేషన్ మార్గాల కారణంగా ప్రజలు భౌతిక ఉత్తరాలకు బదులుగా ఆన్లైన్ సేవలను ఇష్టపడుతున్నారు. అలాగే, అత్యవసర సందేశాలను పంపడానికి ఒకప్పుడు ఉపయోగించిన టెలిగ్రామ్ సేవలను అడ్వాన్స్ టెక్నాలజీ కారణంగా 2013లో దేశవ్యాప్తంగా శాశ్వతంగా నిలిపివేశారు.
































