రాగల 3 గంటల్లో ఏపీలో పలుచోట్ల భారీ వర్షాలు.. విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక

విజయనగరం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రాగల మూడు గంటల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.


రాగల 3 గంటల్లో విజయనగరం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలోనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద నిలబడరాదని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు. అవసరం అయితేనే తప్ప బయటకు రావద్దని అన్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

రాబోయే 4 రోజుల పాటు వర్షాలు..

రాబోయే నాలుగు రోజులు ఆంధ్రప్రదేశ్‌లోని పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తా, బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని వెల్లడించింది. భారత వాతావరణ శాఖ చెబుతున్న దాని ప్రకారం.. ఉత్తర అండమాన్ పరిసర ప్రాంతాలలో ఈరోజు (మంగళవారం) ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుంది.

1వ తేదీ నాటికి అది మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారుతుంది. 2వ తేదీ నాటికి పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి వాయుగుండంగా మారుతుంది. 3వ తేదీ నాటికి దక్షిణ ఒరిస్సా, ఉత్తర కోస్తా జిల్లాల మధ్య తీరం దాటే ఆవకాశం ఉంది. అల్లూరి, పార్వతీపురం, కాకినాడ, యానం, ఈస్ట్, వెస్ట్ గోదావరి, నెల్లూరు, తిరుపతి జిల్లాలలో రాబోయే 24 గంటల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.