అమెరికా షట్‌డౌన్‌.. ఆరేళ్లలో తొలిసారి

కీలకమైన బిల్లులకు ఆమోదం లభించకపోవడంతో అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్‌ను ఎదుర్కొంటోంది (US government shut down). ఆరేళ్ల తర్వాత తొలిసారి ఇలా జరిగింది. అర్ధరాత్రి గడువుకు ముందే రెండు నిధుల బిల్లులను సెనెట్‌ ఆమోదించకపోవడంతో అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్‌లోకి వెళ్లింది. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం మొదలుకాగానే(భారత కాలమానం ప్రకారం ఉదయం 9.30కి) ఈ ప్రక్రియ ప్రారంభమైంది.


తమ డిమాండ్లు నెరవేర్చని రిపబ్లికన్ స్టాపేజ్ ఫండింగ్ బిల్లును డెమోక్రాట్లు అడ్డుకోవడంతో ఈ షట్‌డౌన్ మొదలైంది. దీంతో అత్యవసరం కాని సేవల కార్యకలాపాలు నిలిచిపోతాయి. అమెరికా (USA)లో లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. దాదాపు 7,50,000 మందిని పని ప్రదేశంలో రిపోర్టు చేయవద్దంటారు. మిలిటరీ, ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ వంటి విభాగాల్లోని లక్షల మంది సిబ్బంది మాత్రం అత్యవసర సేవలు కొనసాగించాల్సి ఉంటుంది. వీరితో సెలవుల్లో కూడా పని చేయించుకొని చెక్‌ ఇవ్వని పరిస్థితి ఉంటుంది. షట్‌డౌన్‌ ముగిశాకే.. వారికి పాత వేతనాల చెల్లింపులు జరుగుతాయి. కొన్ని కాంట్రాక్టుల్లో ఈ చెల్లింపులకు ఎలాంటి హామీలు ఉండవని తెలిపింది.

ఏ విభాగాలపై ప్రభావం..

సోషల్‌ సెక్యూరిటీ, మెడికేర్‌ లబ్ధిదారులపై దీని ప్రభావం ఉండదు. వీరికి సంబంధించిన ప్రయోజనాలను కాంగ్రెస్‌ ప్రత్యేక చట్టం రూపంలో ఆమోదం తెలుపుతుంది. వీటికి వార్షిక చెల్లింపులు అవసరం లేదు. కానీ, సోషల్‌ సెక్యూరిటీ ఆఫీస్‌లు అందించే ప్రయోజనాలు పరిమితంగా ఉంటాయి. నేషనల్‌ పార్క్‌ సర్వీసులు మూతపడతాయి. 2013లో వందలకొద్దీ పార్కులు, మ్యూజియంలు, ఇతర ప్రదేశాలను మూసేశారు.

ఈ మూసివేత (Shutdown) వల్ల వెంటనే ఆర్థిక ప్రభావం పడకపోయినా.. దీర్ఘకాలంగా కొనసాగితే మాత్రం ఆర్థిక వృద్ధి మందగిస్తుంది. మార్కెట్లకు అంతరాయం కలిగిస్తుంది. ఇవన్నీ ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. అయితే 2018లో జరిగిన షట్‌డౌన్‌తో ఈసారి కాస్త తీవ్రత ఎక్కువగా ఉండొచ్చని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ షట్‌డౌన్‌లో ఉన్న ప్రతివారం ఆర్థిక వృద్ధిలో 0.1 నుంచి 0.2 పాయింట్లు తగ్గొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం చట్టసభ సభ్యుల్లో రాజీ సూచనలు కనిపించడం లేదు. అమెరికాలో షట్‌డౌన్‌ మొదలైతే ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేము. 1981 నుంచి అమెరికా ప్రభుత్వం 15 సార్లు మూతపడింది. 2018-19 మధ్య దాదాపు 35 రోజుల పాటు మూతపడగా.. నాడు ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నారు. అమెరికా చరిత్రలోనే అది సుదీర్ఘమైన షట్‌డౌన్‌.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.