రాజమహేంద్రవరం-తిరుపతి విమాన సర్వీసు ప్రారంభం

రాజమహేంద్రవరం నుంచి తిరుపతికి విమాన సర్వీసును పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు (Rammohan Naidu) ప్రారంభించారు. దిల్లీలోని రాజీవ్‌గాంధీ భవన్‌ నుంచి ఎంపీ పురందేశ్వరితో కలిసి వర్చువల్‌గా ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాజమహేంద్రవరం విమానాశ్రయంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్‌, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్‌, బుచ్చయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ దేవీ నవరాత్రుల్లో తిరుపతికి విమాన సర్వీసులు ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. టికెట్‌ ధర మొదటి 35 సీట్లకు రూ.1999, తర్వాత 35 సీట్లకు రూ.4000 మూడు నెలలపాటు అందుబాటులో ఉంటుందన్నారు. దిల్లీ, ముంబయికి ప్రారంభించిన విమాన సర్వీసులు నిండుగా నడుస్తున్నాయని చెప్పారు. భవిష్యత్తులో షిర్డీ, వారణాసి, కొచ్చి తదితర ప్రాంతాలకు సర్వీసులు ప్రారంభిస్తామన్నారు.

పురందేశ్వరి మాట్లాడుతూ తిరుపతికి విమాన సర్వీసును ప్రారంభించుకోవడం శుభపరిణామమని చెప్పారు. రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టు నుంచి పలు ప్రాంతాలకు కనెక్టివిటీ పెరుగుతోందన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి ఇది ఎంతో దోహదపడుతుందని చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని సర్వీసులు ప్రారంభించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.

అలయన్స్‌ ఎయిర్‌ విమానయాన సంస్థ ఈ విమాన సర్వీసులను నడపనుంది. దీని ద్వారా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల వాసులకు ఆకాశయానం ద్వారా ఆధ్యాత్మిక యాత్ర దగ్గరకానుంది. రెండో తేదీ నుంచి షెడ్యూల్‌ ప్రకారం ఈ సర్వీసు అందుబాటులోకి రానుంది. మంగళ, గురు, శనివారాల్లో అలయన్స్‌ ఎయిర్‌ విమానయాన సంస్థ దీన్ని నడపనుంది.

బాలయోగి జీవితం ఎన్నో తరాలకు ఆదర్శం: రామ్మోహన్ నాయుడు

దివంగత లోక్‌సభ స్పీకర్‌ జీఎంసీ బాలయోగి జయంతి సందర్భంగా రామ్మోహన్‌నాయుడు నివాళులర్పించారు. పాత పార్లమెంట్‌ భవనం సెంట్రల్‌ హాల్‌లో బాలయోగి చిత్రపటం వద్ద ఆయన అంజలి ఘటించారు. బాలయోగి జీవితం ఎన్నో తరాలకు ఆదర్శమని చెప్పారు. కోనసీమ గడ్డ నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో లోక్‌సభ స్పీకర్‌గా ఆయన పనిచేసి తెలుగువారి కీర్తిని ఎల్లలు దాటించారన్నారు. ఆయన సేవలు దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సానా సతీశ్‌, మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.