మరో కొత్త నెల ప్రారంభమైంది. అక్టోబర్ వచ్చేసింది. ప్రతి నెల కొన్ని నిబంధనలు మారుతుంటాయి. ఈ రోజు నుంచి కొన్ని కొత్త నిబంధనలు అమల్లోకి రాబోతున్నాయి. ఈ మార్పులు మీ దైనందిన జీవితాన్ని నేరుగా ప్రభావితం చేయనున్నాయి. ఆ కొత్త నిబంధనల గురించి కాస్త తెలుసుకుందాం (New rules from October).
1)గ్యాస్ సిలిండర్ ధరలు (Gas Cylinder Prices):
ప్రతి నెల చమురు కంపెనీలు గ్యాస్ సిలిండర్ల ధరలను సవరిస్తుంటాయి. ఇంట్లో వాడుకునే సిలిండర్ ధరలు చాలా కాలం నుంచి స్థిరంగానే ఉన్నాయి. ఈ నెలలో కూడా వాటి ధరల విషయంలో మార్పు లేదు. అయితే 19 కిలోల వాణిజ్య సిలిండర్లపై మాత్రం చమురు కంపెనీలు రూ.15 పెంచాయి.
2) రైల్వే టిక్కెట్ బుకింగ్ (IRCTC Aadhaar rule):
ఆన్లైన్ రిజర్వేషన్లు ప్రారంభమైన మొదటి 15 నిమిషాల్లో పూర్తి ఆధార్ ధృవీకరణ ఉన్నవారు మాత్రమే టిక్కెట్లను బుక్ చేసుకోగలరు. ఇప్పటివరకు ఈ నియమం తత్కాల్ టిక్కెట్లకు మాత్రమే వర్తించేది.
3) యూపీఐ అభ్యర్థనలు (UPI Rules):
ఇక నుంచి యూపీఐ యాప్ ద్వారా నేరుగా డబ్బులను అభ్యర్థించడం కుదరదు. మోసాన్ని నివారించడానికి ఈ కొత్త నిబంధనను తీసుకొచ్చారు.
4)యూపీఐ చెల్లింపు పరిమితి (UPI Limit):
నేటి నుంచి యూపీఐను ఉపయోగించి ఒకేసారి రూ.5 లక్షల వరకు పంపవచ్చు. గతంలో ఈ పరిమితి 1 లక్ష రూపాయలు మాత్రమే.
5)పెన్షన్ స్కీమ్ (NPS):
జాతీయ పెన్షన్ వ్యవస్థ కనీస నెలసరి డిపాజిట్ నేటి నుంచి రూ. 1,000గా ఉండనుంది. ఇప్పటివరకు రూ. 500 గా ఉండేది.
6)ఆన్లైన్ గేమింగ్ (Online Gaming Act):
నేటి నుంచి అన్ని ఆన్లైన్ గేమింగ్ కంపెనీలు ప్రభుత్వ లైసెన్స్ పొందడం తప్పనిసరి. రియల్ మనీ గేమింగ్‌లో పాల్గొనడానికి కనీసం 18 సంవత్సరాల వయసు నిండి ఉండాలి.

































