రివ్యూ: ఇడ్లీ కొట్టు; నటీనటులు: ధనుష్, నిత్యా మీనన్, అరుణ్ విజయ్, షాలిని పాండే, సత్యరాజ్, రాజ్‌కిరణ్ తదితరులు; నిర్మాణం: ఆకాష్ బాస్కరన్, ధనుష్, దర్శకత్వం: ధనుష్; విడుదల: 01-10-2025
‘ఓజీ’ సినిమాతోనే బాక్సాఫీస్ దగ్గర దసరా జోరు మొదలైంది. ఆ సందడిని మరింత పెంచేలా కన్నడ నుంచి… తమిళం నుంచి పండగ సినిమాలొస్తున్నాయి. అందులో భాగంగా వచ్చిన చిత్రమే ‘ఇడ్లీ కొట్టు’. ధనుష్ కథానాయకుడిగా నటిస్తూ, స్వీయ నిర్మాణంలో తెరకెక్కించారు. పెద్దగా హడావుడి లేకుండానే సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఎలా ఉంది? ఎలాంటి వినోదాన్ని పంచింది?
కథేంటంటే..
శివ కేశవులు (రాజ్‌కిరణ్) ఇడ్లీ కొట్టు అంటే ఆ ఊళ్లో ఫేమస్. ఎంతో ఇష్టంగా, మనసు పెట్టి చేసే ఆ కొట్లో ఇడ్లీలు ఎంతో రుచికరం. శివ కేశవులు కొడుకే మురళి (ధనుష్). కొత్తతరం కుర్రాడు కదా, తన తండ్రి నడుపుతున్న కొట్టుని కాస్త ఫ్రాంచైజీలా మార్చేసి, అదే పేరుతో ఇతర చోట్ల కూడా హోటల్స్‌ని ఏర్పాటు చేసి డబ్బు సంపాదించాలని ఆశపడతాడు. కానీ, తన చేతులతో చేయని ఇడ్లీలను తన పేరుతో అమ్మడానికి ససేమిరా ఇష్టపడడు శివకేశవులు. దాంతో మురళి ఉన్నతమైన జీవితం అంటూ కన్నవాళ్లని, ఉన్న ఊరుని వదిలి పట్నం బాట పడతాడు. (idli kottu movie review telugu) అలా మొదలైన అతని పరుగు బ్యాంకాక్‌కి చేరుతుంది. పనుల్లో పడి కన్నవాళ్లని కూడా పట్టించుకోడు. బ్యాంకాక్‌లోనే తన బిజినెస్‌లో పార్ట్‌నర్ అయిన విష్ణువర్ధన్ (సత్యరాజ్) కూతురు మీరా (షాలిని పాండే)తో పెళ్లి నిశ్చయమవుతుంది. మరికొన్ని రోజుల్లో పెళ్లి అనగా మురళి తండ్రి శివ కేశవులు చనిపోతాడు. తండ్రి చివరి చూపు కోసం వచ్చిన మురళి తిరిగి బ్యాంకాక్ వెళ్లాడా లేదా?శివకేశవులు చనిపోయాక ఆయన ఇడ్లీ కొట్టు ఏమైంది?మురళికీ, కల్యాణి (నిత్య మేనన్)కీ మధ్య సంబంధం ఏమిటి?మీరాతో అతని పెళ్లి జరిగిందా? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
సొంతూరుకి వెళ్లామంటే అక్కడ కనిపించే ప్రతి చెట్టు, కొట్టు, బడి, గుడి, తారసపడే వ్యక్తులు, పలకరింపులు… ఇలా ప్రతిదీ ఓ కథ చెబుతానంటుంది. ప్రతి జ్ఞాపకం ఓ సినిమానే. ధనుష్ కూడా తాను పుట్టి పెరిగిన ఊరికి వెళ్లినప్పుడు మెదిలిన జ్ఞాపకాలు… అక్కడి ఒక సాధారణ ఇడ్లీ కొట్టు స్ఫూర్తితోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు ఆరంభంలోనే ప్రకటించాడు. నిజ జీవిత పాత్రలు, సంఘటనల నుంచి వచ్చిన ఈ కథతో వెంటనే కనెక్ట్ అయిపోతారు. ముఖ్యంగా ఉన్న ఊరునీ, కన్నవాళ్లనీ వదిలి పరుగులు పెడుతున్న ప్రతి ఒక్కరికీ తెరపై తమ జీవితాన్ని చూసుకున్నట్టే అనిపిస్తుంది. మనవైన మూలాల్ని ఆవిష్కరించే ఇలాంటి కథలకు ప్రేక్షకుల్ని కనెక్ట్ చేయడం సులభమే కావొచ్చు కానీ, ఆ కథని రెండున్నర గంటలపాటు అంతే ఆసక్తికరంగా నడిపించడంలోనే అసలైన సవాళ్లు ఉంటాయి. ఈ విషయంలో ధనుష్ ప్రథమార్ధం వరకూ విజయవంతమయ్యారు. సెకండాఫ్‌లో ఆయన కథని మరో దారి పట్టించినట్టు అనిపిస్తుంది. దాదాపు సన్నివేశాలు ఆకాశ్ (అరుణ్ విజయ్) ఈగో చుట్టూనే సాగడంతో అదొక కథ, ఇదొక కథ అన్న భావన కలుగుతుంది. మళ్లీ పతాక సన్నివేశాలతో అసలైన ఇడ్లీ కొట్టు కథలోకి వచ్చేసినట్టు అనిపిస్తుంది.
ఆరంభ సన్నివేశాలతోనే ధనుష్ సొంతూరుకి తీసుకెళ్లి కూర్చోబెట్టాడు. శివ కేశవులు చనిపోవడంతో కథ ఆసక్తికరంగా మారుతుంది. తండ్రి నడిపిన ఇడ్లీ కొట్టుని మురళి ఏం చేశాడు? దానిపై ఓ నిర్ణయానికొచ్చాక అతను ఎలాంటి పాట్లు పడ్డాడు? శివ కేశవులు చేసినంత రుచిగా ఇడ్లీలు చేయడం ఎలా సాధ్యమైందనే విషయాలు సినిమాకి కీలకం. ఇండియాకి ఆకాశ్ రాక నుంచి అతని ఈగో చుట్టూనే కథ సాగుతూ ఉంటుంది. ప్రథమార్ధం తరహాలో భావోద్వేగాలు తగ్గడంతో ద్వితీయార్ధం పట్టు తప్పింది. ఇడ్లీ కొట్టుని మళ్లీ కొత్తగా నిర్మించుకోవాల్సి రావడం, ఆ సంఘటనని ఫ్లాష్‌బ్యాక్‌లో తల్లిదండ్రులతో ముడిపెట్టడం తరహా సన్నివేశాలు మళ్లీ సినిమాని అసలైన కథలోకి తీసుకొచ్చినట్టు అనిపిస్తాయి. ఉన్న ఊరు, కన్న తల్లిదండ్రులతో ముడిపడిన ఈ తరహా కథల్ని ఒకొక్కరు ఒక్కో శైలిలో ఆవిష్కరించారు. ‘ఇడ్లీ కొట్టు’తో ధనుష్ చేసిన ఆ ప్రయత్నం చాలావరకూ ఆకట్టుకుంటుంది.
ఎవరెలా చేశారంటే..
కథానాయకుడు ధనుష్ (Dhanush idly kadai) నటన ఆకట్టుకుంటుంది. మురళి పాత్రలో ఒదిగిపోయారు. టీనేజ్ యువకుడిగా కొన్ని సన్నివేశాల్లో కనిపించిన ఆయన, ఆ తర్వాత కార్పొరేట్ అవతారంలోనూ, పల్లెటూరి యువకుడిగానూ చాలా సహజంగా నటించారు. పల్లెటూరి యువతి కల్యాణి పాత్రలో నిత్యమేనన్ అత్యంత సహజంగా కనిపించారు. ట్రెండీగా కనిపించే మీరా పాత్రని షాలినీపాండే పోషించారు. పతాక సన్నివేశాల్లో ఆమె పాత్ర కీలకం. శివ కేశవులుగా రాజ్‌కిరణ్ మంచి పాత్రని పోషించారు. తల్లి పాత్రలో గీతా కైలాసం కనిపిస్తారు. అరుణ్ విజయ్, సత్యరాజ్ పాత్రలు కథలో కీలకం. తండ్రీ కొడుకులుగా ఆ ఇద్దరి నటన ఆకట్టుకుంటుంది. (idli kottu movie review telugu) పార్తీబన్, సముద్రఖని పాత్రలకీ ప్రాధాన్యం ఉంది. సాంకేతిక విభాగాల్లో జి.వి.ప్రకాశ్ కుమార్ సంగీతానికి ఎక్కువ మార్కులు పడతాయి. కిరణ్ కౌశిక్ విజువల్స్ కట్టిపడేస్తాయి. చిన్న చిన్న జ్ఞాపకాల స్ఫూర్తితో ధనుష్ ఈ కథని రాసుకున్న విధానం మెప్పించినా, దాన్ని తెరపైకి తీసుకొచ్చే క్రమంలోనే ఇంకొన్ని కసరత్తులు చేయాల్సిందనే భావన కలిగిస్తుంది సినిమా.
- బలాలు
- + కథలో సహజత్వం
- + కొన్ని భావోద్వేగాలు
- + నటీనటులు
- బలహీనతలు
- – కొత్తదనం లేని కథనం
- – ద్వితీయార్ధం
- చివరిగా: సొంతూరిని గుర్తు చేసే… ఇడ్లీ కొట్టు
- గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
































