తొక్కిసలాట ఘటన.. టీవీకే చీఫ్‌ విజయ్‌ కీలక నిర్ణయం

టీవీకే పార్టీ చీఫ్‌, సినీ నటుడు విజయ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను చేపట్టిన రాష్ట్రవ్యాప్త పర్యటనలు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ చేపట్టిన రాష్ట్ర వ్యాప్త పర్యటనలను రెండు వారాల పాటు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కరూర్‌ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో టీవీకే పార్టీ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.


ఇటీవల విజయ్‌ ప్రచార సభలో తొక్కిసలాట (Karur stampede) జరిగి 41మంది మృతిచెందిన ఘటన తీవ్ర విషాదం నింపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీవీకే ‘ఎక్స్‌’ వేదికగా ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘తొక్కిసలాట ఘటనలో ఆత్మీయులను కోల్పోయిన బాధ, దుఃఖం నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో వచ్చే రెండు వారాల పాటు బహిరంగ సభ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాం. పర్యటనలకు సంబంధించిన కొత్త షెడ్యూల్‌ను తర్వాత ప్రకటిస్తామని మా నేత ఆమోదంతో తెలియపరుస్తున్నాం’’ అని పార్టీ హెడ్‌క్వార్టర్స్‌ సెక్రటేరియట్‌ ప్రకటించింది.

ఇప్పటికే ఈ తొక్కిసలాట ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు టీవీకే పార్టీ కరూర్‌ పశ్చిమ జిల్లా కార్యదర్శి మథియాళన్‌, సౌత్‌ సిటీ కోశాధికారి పౌన్‌రాజ్‌లను అరెస్టు చేసి విచారిస్తున్న విషయం తెలిసిందే. నిన్న ఓ ఎమోషనల్‌ వీడియోను సైతం విజయ్‌ విడుదల చేశారు. ‘‘ఇలాంటి బాధాకరమైన పరిస్థితి ఎప్పుడూ ఎదురుకాలేదు’ అన్నారు. ఈ విషాదం తర్వాత తాను కరూర్‌ను ఎందుకు సందర్శించలేదో వివరిస్తూ.. ‘‘నేను కరూర్‌కి వెళ్లలేదు ఎందుకంటే.. అది అసాధారణ పరిస్థితికి దారితీస్తుంది. త్వరలోనే బాధిత కుటుంబాలను కలుస్తా’ అని తెలిపారు. అదే సమయంలో ఎంకే స్టాలిన్‌ సారథ్యంలోని డీఎంకే ప్రభుత్వానికి సైతం బలమైన సందేశం పంపారు. ‘‘సీఎం సార్‌.. మీకు ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచన ఉంటే.. మీరు నన్నేదైనా చేయండి. పార్టీ కార్యకర్తల్ని మాత్రం టచ్‌ చేయొద్దు’’ అని పేర్కొన్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.