స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే సర్పంచ్ అభ్యర్థి ఎంత ఖర్చు చేయాలి? ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు ఇంత.

తెలంగాణలో స్థానిక సంస్థల షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. అక్టోబర్ 9 నుంచి నామినేషన్లు మెుదలుకానున్నాయి. అయితే స్థానిక ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చు పరిమితిని ఎన్నికల సంఘం తెలిపింది.


పరిమితికి మించి వ్యయం చేసినా.., 45 రోజుల్లోపు ఖర్చుల వివరాలను సమర్పించకపోయినా ఈసీ చర్యలు తీసుకుంటుంది. నిబంధనలు పాటించకపోతే మూడేళ్లపాటు పంచాయతీ రాజ్ ఎన్నికల్లో పోటీకి అనర్హులు అవుతారు. ఒకవేళ గెలిచినా.. పదవిని కోల్పోయే అవకాశం ఉంది. తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టం-2018లోని సెక్షన్‌ 238 కింద పలు నిబంధనలు ఉన్నాయి.

అభ్యర్థుల ఖర్చుల వివరాలు

5000 అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీల్లో సర్పంచి అభ్యర్థి రూ.2.50 లక్షలు, వార్డు సభ్యుడుగా పోటీ చేసే వ్యక్తి రూ.50 వేలలోపు ఖర్చు చేయాలి. ఒకవేళ 5000 కంటే తక్కువ జనాభా ఉంటే సర్పంచి అభ్యర్థికి రూ.1.50 లక్షలు, వార్డు సభ్యుడిగా పోటీ చేసే అభ్యర్థి రూ.30 వేలులోపు ఖర్చు ఉండాలి.

ఇక జడ్పీటీసీ అభ్యర్థి రూ.4 లక్షలు, ఎంపీటీసీ అభ్యర్థి రూ.1.50 లక్షల వ్యయ పరిమితి ఉంది. రాజకీయ పార్టీలు చేసే ఖర్చు కూడా అభ్యర్థికే జమ అవుతుందని గుర్తుంచుకోవాలి. అయితే అభ్యర్థి అని కాకుండా పార్టీ తరఫున పోటీ చేసే వారందరి కోసం నార్మల్ క్యాంపెయిన్ చేసే ఖర్చులను అభ్యర్థులు ఖాతాల్లో చూపాల్సిన అవసరం లేదు.

ఫలితతాలు వెల్లడైన తేదీ నుంచి 45 రోజుల్లోపు ఎన్నికల వ్యయ తుది నివేదికను సంబంధిత అధికారికి సమర్పించాల్సి ఉంటుంది. వార్డు, సర్పంచ్, ఎంపీటీసీ అభ్యర్థులు ఎంపీడీఓకు.. జడ్పీటీసీ అభ్యర్థి జడ్పీ సీఈఓకు అందజేయాలి.

ఎన్నికల నిర్వహణకు నిధులు విడుదల

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ రూ.325 కోట్లు విడుదల చేసింది. ఇందులో రూ.150 కోట్లు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు ఖర్చు చేయగా, రూ.175 కోట్లు గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లు, వార్డు సభ్యుల ఎన్నికలకు కేటాయించారు. ఎన్నికల సామగ్రి, వాహనాల అద్దె, ప్రయాణ భత్యాలు, కార్యాలయ నిర్వహణ, శిక్షణ కార్యకలాపాల ఖర్చులను ఈ నిధులు కవర్ చేస్తాయి.

తహశీల్దార్లు నివేదిక సమర్పించాలి

రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్లకు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కఠినంగా అమలు చేసేలా తహశీల్దార్లను నోడల్ అధికారులుగా నియమించాలని సూచించింది. తహశీల్దార్లు తమ మండలాల్లో కోడ్ అమలును ప్రతిరోజూ పర్యవేక్షించాలి. జిల్లా స్థాయి అధికారులకు, అదనపు కలెక్టర్లకు నివేదికలను సమర్పించాలి. ఎన్నికల నిబంధనల అమలులో నిర్లక్ష్యం వహించిన తహశీల్దార్లపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని కమిషన్ హెచ్చరించింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.