ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో భారీ రవాణా ప్రాజెక్ట్ రాబోతోంది. ఇప్పటికే కోల్‌కతా-చెన్నై జాతీయ రహదారి–16 (NH-16) రాష్ట్రం మీదుగా నడుస్తుండగా, దీనికి సమాంతరంగా ఒక కొత్త హైస్పీడ్ గ్రీన్‌ఫీల్డ్ కారిడార్ నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. సరకు రవాణా, వేగవంతమైన ప్రయాణానికి ప్రత్యేకంగా అనువైన ఈ ప్రాజెక్ట్ దేశంలో ఉత్తర, దక్షిణ ప్రాంతాల అనుసంధానానికి కీలకంగా మారనుంది.
ప్రస్తుతం NH-16లో వాహన రద్దీ పెరగడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కొన్నిచోట్ల ఇది నాలుగు వరుసలుగా, మరికొన్ని చోట్ల ఆరు వరుసలుగా మాత్రమే ఉండటంతో వాహనాలు వేగంగా కదలలేకపోతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ (MoRTH) కొత్త కారిడార్‌పై ఎలైన్‌మెంట్ కసరత్తును ప్రారంభించింది.
ఈ హైస్పీడ్ కారిడార్ ఖరగ్‌పూర్ నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా చెన్నై వరకు దీనిని నిర్మించనున్నారు. ఈ మార్గం ప్రకాశం, నెల్లూరు జిల్లాల మీదుగా కొనసాగి చెన్నై చేరుతుంది. అమరావతి అవుటర్ రింగ్ రోడ్‌తో అనుసంధానం కావడంతో రాష్ట్ర రాజధాని రవాణా రంగంలో ప్రధాన కేంద్రంగా మారనుంది. రాజధానిలో ఏర్పడుతున్న కొత్త సంస్థలు, పెరుగుతున్న వాహన రాకపోకలను దృష్టిలో ఉంచుకుంటే, ఈ హైస్పీడ్ కారిడార్ ప్రాజెక్ట్ రాష్ట్రానికి గేమ్‌చేంజర్‌గా మారనుంది.
ఇక మూలపేట పోర్టు నుంచి విశాఖపట్నం వరకు 165 కిలోమీటర్ల గ్రీన్‌ఫీల్డ్ కోస్టల్ కారిడార్ ప్రణాళికలో ఉంది. 6 లేదా 8 వరుసల రహదారిగా నిర్మించేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఇప్పటికే DPR సిద్ధం చేస్తోంది. దీని అంచనా వ్యయం సుమారు రూ.8,300 కోట్లు. ఈ కోస్టల్ కారిడార్‌ను హైస్పీడ్ కారిడార్‌లో భాగం చేయాలనే ఆలోచన కేంద్రానికి ఉన్నా, తాజా ప్రణాళికల్లో మార్పులు వస్తున్నాయి. సముద్రతీరం కాకుండా, లోపల వైపు కొత్త ఎలైన్‌మెంట్ పైనే మోర్త్ దృష్టి సారించింది.
దిల్లీలో మోర్త్ ఉన్నతాధికారులు ఎలైన్‌మెంట్ల తయారీని సమీక్షిస్తున్నారు. మరో నెలలో స్పష్టత రానుంది. తర్వాత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరిపి, వారి సమ్మతి తీసుకుని తుది రూపురేఖలు ఖరారు చేస్తారు. అప్పటికి భూసేకరణ అవసరాలు, మొత్తం వ్యయం, ప్రాజెక్ట్ నిర్మాణ సమయానికి సంబంధించి పూర్తి సమాచారం వెలువడనుంది.
ఈ హైస్పీడ్ కారిడార్ అమలులోకి వస్తే వాహనదారులకు పెద్ద ఊరట లభించడమే కాకుండా, కొత్త ప్రాంతాల అభివృద్ధికి కూడా తోడ్పడనుంది. అమరావతి చుట్టూ నిర్మిస్తున్న అవుటర్ రింగ్ రోడ్ ఏకకాలంలో ఏడు జాతీయ రహదారులను కలుపుతూ రాష్ట్ర రవాణా వ్యవస్థను కొత్త దశలోకి తీసుకువెళ్తుంది. ఉత్తర, దక్షిణ భారతదేశాన్ని అనుసంధానించే ఈ కొత్త రహదారి, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక గుర్తింపుని తీసుకురానుంది.
కేంద్రం నిర్మించబోతున్న ఈ కొత్త ప్రాజెక్ట్ ద్వారా పరిశ్రమలు, లాజిస్టిక్స్, వాణిజ్య రంగం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. సరకు రవాణాకు సమయం తగ్గి, రవాణా వ్యయాలు కూడా తగ్గుతాయి. అనేక ప్రాంతాలు కొత్త రహదారి ద్వారా అనుసంధానమవడంతో స్థానిక ఆర్థిక వ్యవస్థలు చురుకుగా మారతాయి. భవిష్యత్తులో ఈ కారిడార్ రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించే ప్రధాన బలంగా మారనుంది.































