వినువీధికి.. వెలుగుల తోరణం

విజయవాడ దసరా ఉత్సవాల్లో పిల్లలు, పెద్దలను అమితంగా ఆకట్టుకున్నదేమైనా ఉందంటే అది డ్రోన్‌ షోనే. షో జరుగుతున్నంతసేపు కళ్లార్పకుండా ఆసక్తిగా చూస్తూ ఉండిపోతున్నారు. ఇంతలా ఆకట్టుకున్న డ్రోన్‌ల పనితీరు తెలుసుకుందామా.. డ్రోన్‌ షో డిజైన్‌ చేయడం అనేది సాంకేతికత, కళ, క్రియేటివిటీ కలయిక. ఎగరవేయడం మాత్రమే కాదు.. అద్భుతమైన విజువల్‌ అనుభూతిని సృష్టించాల్సి ఉంటుంది. ముందుగా థీమ్‌ను ఎంపిక చేసుకొని, ఎన్ని నిమిషాల వ్యవధి, ప్రదర్శన స్థలం, ప్రేక్షకుల సంఖ్య, వాతావరణం లాంటివి పరిగణలోకి తీసుకుంటారు. డిజైనింగ్‌ మొత్తం దిల్లీ నుంచే జరుగుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. 3డీ గ్రాఫిక్స్‌ సాఫ్ట్‌వేర్‌(బ్లెండర్, మాయా)కంప్యూటర్‌లో షోలో కనిపించాల్సిన వంపులు, ఆబ్జెక్ట్స్, మూమెంట్స్‌ రూపొందిస్తారు. తర్వాత 3డీ మోడల్స్‌ డ్రోన్ల మోషన్‌కు మారుస్తారు. ప్రతి డ్రోన్‌ ఎప్పుడు ఎక్కడ ఉండాలో ఖచ్చితంగా ప్లాన్‌ చేసుకుంటారు. ఒకదానికొకటి ఢీకొనకుండా ప్లాన్‌ చేస్తారు. షోను బట్టి డ్రోన్ల సంఖ్యను నిర్ణయిస్తారు. ఉదాహరణకు చిన్న షోకు 50-100, పెద్ద షోకు 500 డ్రోన్లు ఉపయోగిస్తారు. ప్రతి డ్రోన్‌కు ప్రత్యేక ఐడీ ఇస్తారు. జీపీఎస్, ఎల్‌ఈడీ లైట్లు, ఫ్లైట్‌ కంట్రోలర్స్‌ ఉంటాయి. ముఖ్యంగా ప్రభుత్వ అనుమతులు తీసుకుంటారు. ఫ్లైట్‌ నో ఫ్లై జోన్లు, ఎమెర్జెన్సీ ప్లాన్, ఫైర్‌ సేఫ్టీ వంటి జాగ్రత్తలు తీసుకుంటారు. ముందుగా సన్నాహక షోలు నిర్వహించాక, అన్ని డ్రోన్లు సింక్‌ అయిన తర్వాత షో మొదలు పెడతారు.


👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.