అందుకే తమలపాకు మంచిదట

ఇంట్లో జరిగే పూజలు, శుభకార్యాలకు, ముత్తైదువులకు వాయనమివ్వడానికి.. పూలు పండ్లతో పాటు ఎక్కువగా ఉపయోగించేది తమలపాకులే. ఇలా శుభప్రదంగా వాడే తమలపాకులు కొన్ని రకాల అనారోగ్యాల్నీ దూరం చేస్తాయంటున్నారు నిపుణులు. ఇందుకు వీటిలోని ఔషధ గుణాలే కారణమట! మరి, అవేంటో తెలుసుకుందాం రండి.


⚛ కొంతమంది తమలపాకులను రోజూ నములుతుంటారు. దీనివల్ల శరీరంలో కొన్ని రకాల ఆరోగ్య సమస్యలుంటే తొలగిపోతాయట. పెద్ద కప్పు నీటిలో కొన్ని తమలపాకులు వేసి నీళ్లు సగమయ్యేంత వరకు మరిగించాలి. ఈ నీటిని తాగడం వల్ల కూడా పలు ప్రయోజనాలు పొందచ్చట.

⚛ ఇవి నోటి దుర్వాసనను దూరం చేస్తాయట. అలాగే చిగుళ్ల నుంచి వచ్చే బ్లీడింగ్‌ని ఆపి.. దంతాలను దృఢపరిచే గుణం తమలపాకులకు ఉందంటున్నారు నిపుణులు.

⚛ చర్మంపై అలర్జీ, దురద.. మొదలైన సమస్యలను కూడా తమలపాకులు దూరం చేస్తాయట. వీటిలో ఉండే యాంటీసెప్టిక్‌ గుణాలే ఇందుకు కారణం.

⚛ బాలింతల రొమ్ముల్లో పాలు గడ్డకట్టుకుపోవడం వల్ల భరించలేని నొప్పి వస్తుంది. ఈ సమయంలో తమలపాకులను కొద్దిగా వేడి చేసి ఛాతీ పైన ఉంచితే ఉపశమనం కలుగుతుంది.

⚛ గాయాలు మానడానికి తమలపాకుల్ని ఉపయోగిస్తారు. కొన్ని తమలపాకుల నుంచి తీసిన రసాన్ని గాయంపై రాసి.. దానిపై మరో తమలపాకును ఉంచి కట్టు కట్టాలి. ఫలితంగా గాయం మానే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.

⚛ తమలపాకుల్ని నమిలి, ఆ రసాన్ని మింగడం వల్ల జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. అందుకే భోజనం చేశాక తాంబూలం వేసుకోవడం మంచిదంటారు.

⚛ వెన్నునొప్పితో బాధపడేవారు.. తమలపాకులకు కొద్దిగా నూనె రాసి వెన్నునొప్పి ఉన్నచోట మర్దన చేస్తే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుందంటున్నారు నిపుణులు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.