నిద్ర లేవగానే ఫోన్ చెక్ చేస్తున్నారా?

ఉదయం నిద్ర లేవగానే మొబైల్‌ చెక్‌ చేసుకోవడం చాలామందికి అలవాటు. ఈ క్రమంలో అలారం ఆఫ్‌ చేయడానికనో లేదంటే రాత్రి నుంచి ఏయే నోటిఫికేషన్లు వచ్చాయన్న ఆతృతతోనో ఫోన్లో లీనమైపోతుంటారు. మరి, మీకూ ఈ అలవాటుందా? అయితే వెంటనే మానుకోమంటున్నారు నిపుణులు.


ఈ సమస్యలు!

⚛ నిద్ర లేవగానే మొబైల్‌లో నెట్‌ ఆన్‌ చేస్తాం. దాంతో నోటిఫికేషన్లు వెల్లువలా వచ్చేస్తాయి. వాటిలో పాజిటివ్‌ సమాచారమే కాదు.. నెగెటివ్‌ సమాచారమూ ఉంటుంది. ఇవి చూశాక ఒత్తిడి, ఆందోళనలు తలెత్తడం సహజమే! వీటి ప్రభావం ఇటు వ్యక్తిగత పనుల పైనే కాదు.. ఆఫీస్‌ బాధ్యతల పైనా పడుతుందంటున్నారు నిపుణులు.

⚛ ఉదయాన్నే ఫోన్‌ చూడడం వల్ల జీవ గడియారం పైనా ప్రతికూల ప్రభావం పడుతుందంటున్నారు నిపుణులు. తద్వారా నిద్రలేమి సమస్య తలెత్తుతుంది. దీనివల్ల ఒత్తిడి హార్మోన్‌ కార్టిసాల్‌ విడుదలై.. ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టరాన్‌ హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుందంటున్నారు నిపుణులు. ఫలితంగా వివిధ సమస్యలు తలెత్తుతాయట.

⚛ మొబైల్‌ ఫోన్ల నుంచి వచ్చే నీలి కాంతి ఇటు పిల్లల పైనా, అటు పెద్దల పైనా ప్రతికూల ప్రభావం చూపుతుందంటున్నారు నిపుణులు.

⚛ రోజంతా ఆఫీస్‌ పనులతో హడావిడే సరిపోతుంది! ఇక ఆఫీస్‌ నుంచి ఇంటికొచ్చే సరికే అలసిపోతుంటాం.. మరోవైపు పిల్లల బాధ్యతలు, ఇంటి పనులూ చేసుకోక తప్పదు. ఇలాంటప్పుడు భాగస్వామితో, కుటుంబ సభ్యులతో కాస్త సమయం గడపడానికి ఉదయమే సరైన సమయం అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఆ సమయంలోనే మనసు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి! అయితే ఆ సమయాన్ని కూడా ఫోన్‌ చూడ్డానికి వినియోగిస్తుంటారు చాలామంది. ఈ అలవాటు అనుబంధాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందంటున్నారు నిపుణులు.

ఫోన్‌కు బదులు ఇవి!

ఉదయాన్నే ఫోన్‌ చెక్‌ చేస్తూ లేని సమస్యల్ని కొని తెచ్చుకునే కంటే దీనికి దూరంగా ఉండడమే మేలంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో లేవగానే మొబైల్‌ నుంచి దృష్టిని మళ్లించాలంటే ఈ సింపుల్‌ చిట్కాలు పనికొస్తాయంటున్నారు.

⚛ చాలామంది అలారం కోసం మొబైల్‌ను పక్కనే పెట్టుకుంటారు. ఉదయాన్నే అలారం ఆఫ్‌ చేస్తూ స్క్రోలింగ్‌ మొదలుపెట్టేస్తుంటారు. అందుకే దీనికి బదులు గడియారంలోనే అలారం సెట్‌ చేసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు.

⚛ ఫోన్‌ను పక్కన పెట్టి.. వ్యాయామం, ధ్యానం, నడక, ఇంటి పనులపై దృష్టి పెడితే సరి! వీటితో శారీరకంగా ఆరోగ్యం.. మానసికంగా ప్రశాంతత.. రెండూ చేకూరతాయి.

⚛ ఉదయాన్నే ఫోన్ పైకి దృష్టి మళ్లకుండా ఉండాలంటే.. కాసేపు నోటిఫికేషన్లు రాకుండా ఆఫ్‌ చేసుకొని పెట్టుకోవడం మంచిది. అత్యవసరమైతే మధ్యమధ్యలో చెక్‌ చేసుకొని.. వెంటనే ఆఫ్‌ చేసేయడం మంచిది.

⚛ చాలామంది మహిళలు తమ అభిరుచులపై దృష్టి పెట్టే సమయమే లేదంటారు. నిద్ర లేవగానే ఓ అరగంట సమయం దీనికి కేటాయించుకోవచ్చు. తద్వారా ఈ సమయంలో ఫోన్‌ ఉపయోగం కూడా తగ్గుతుంది.

⚛ ఉదయాన్నే ఫోన్‌ ఉపయోగాన్ని ఒక్కసారిగా తగ్గించడానికి ఇబ్బంది పడుతుంటారు కొందరు. దీంతో ఒత్తిడిగా ఫీలవుతుంటారు. ఇలా జరగకుండా.. మొదట ఓ వారం పాటు ఓ పావు గంట ఫోన్‌ చూడకుండా ఉండేలా ప్లాన్‌ చేసుకోవాలి. ఆ తర్వాత క్రమంగా సమయాన్ని పెంచుకుంటూ పోవాలి. దీనివల్లా మేలు జరుగుతుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.