ఇలా రోజుకొకటి క్రియేట్ చేస్తున్నావ్..చరిత్ర సృష్టించిన వైభవ్

 ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత అండర్-19 జట్టు తమ మొదటి టెస్ట్ మ్యాచ్‌లో అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఆస్ట్రేలియా అండర్-19 జట్టును ఇన్నింగ్స్, 58 పరుగుల భారీ తేడాతో ఓడించింది.


ఈ విజయంలో యువ బ్యాట్స్‌మెన్ వైభవ్ సూర్యవంశీ హీరోగా నిలిచాడు. అతను యూత్ టెస్ట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత రికార్డును మాత్రమే కాకుండా, ఏకంగా ప్రపంచ రికార్డును కూడా బద్దలు కొట్టాడు.

ఈ మ్యాచ్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన బ్యాటింగ్‌తో చరిత్ర సృష్టించాడు. అతను యూత్ టెస్ట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత రికార్డును మాత్రమే కాకుండా, ఏకంగా ప్రపంచ రికార్డును కూడా బద్దలు కొట్టడం విశేషం. బ్రిస్బేన్‎లో జరిగిన ఈ మొదటి మల్టీ డే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా అండర్-19 జట్టు మొదట బ్యాటింగ్ చేసి తొలి ఇన్నింగ్స్‌లో 243 పరుగులు చేసింది.

దీనికి సమాధానంగా మ్యాచ్ రెండో రోజున భారత అండర్-19 జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో ధాటిగా ఆడి ఏకంగా 428 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. ఈ భారీ స్కోరులో వైభవ్ సూర్యవంశీ, వేదాంత్ త్రివేది కీలక పాత్ర పోషించారు. వీరిద్దరూ అద్భుతమైన సెంచరీలు సాధించారు. వేదాంత్ త్రివేది 192 బంతుల్లో 140 పరుగులు చేసి ఒక టిపికల్ టెస్ట్ మ్యాచ్ ఇన్నింగ్స్ ఆడితే, వైభవ్ సూర్యవంశీ తనదైన దూకుడైన శైలిలో సెంచరీ సాధించాడు.

ఆస్ట్రేలియా అండర్-19తో జరిగిన తొలి ఇన్నింగ్స్‌లో వైభవ్ సూర్యవంశీ కేవలం 86 బంతుల్లోనే 113 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 8 సిక్సర్లు, 9 ఫోర్లు ఉన్నాయి. అతను తన సెంచరీని కేవలం 78 బంతుల్లోనే పూర్తి చేశాడు. ఆస్ట్రేలియా గడ్డపై యూత్ టెస్ట్‌లో ఒక బ్యాట్స్‌మెన్ చేసిన అత్యంత వేగవంతమైన సెంచరీ ఇదే.

ఈ సెంచరీ ఇన్నింగ్స్ సందర్భంగా వైభవ్ సూర్యవంశీ అండర్-19 టెస్ట్‌లలో సిక్సర్ల ప్రపంచ రికార్డును అధిగమించాడు. గతంలో యూత్ టెస్ట్‌లో అత్యధికంగా 13 సిక్సర్లు కొట్టిన ప్రపంచ రికార్డు ఇంగ్లండ్‌కు చెందిన జార్జ్ బార్ట్‌లెట్ పేరు మీద ఉండేది. ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ మొత్తం 15 సిక్సర్లు కొట్టి ఆ రికార్డును బద్దలు కొట్టాడు. ఆస్ట్రేలియాపై చేసిన ఈ సెంచరీ ఇన్నింగ్స్‌లో, వైభవ్ సూర్యవంశీ ఒకే యూత్ టెస్ట్ ఇన్నింగ్స్‌లో అత్యధికంగా 8 సిక్సర్లు కొట్టిన భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. గతంలో ఈ భారత రికార్డు హర్వంష్ పంగాలియా పేరు మీద ఉండేది, అతను ఒకే ఇన్నింగ్స్‌లో 6 సిక్సర్లు కొట్టాడు.

తొలి ఇన్నింగ్స్‌లో భారత్ అండర్-19 జట్టు, ఆస్ట్రేలియా అండర్-19పై 185 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా అండర్-19 బ్యాటింగ్ మరింత పేలవంగా మారింది. వారు కేవలం 127 పరుగులు మాత్రమే చేయగలిగారు. దీంతో భారత్, ఆస్ట్రేలియాపై ఇన్నింగ్స్, 58 పరుగుల తేడాతో మొదటి మల్టీ డే మ్యాచ్‌లో అద్భుత విజయాన్ని సాధించింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.