మధ్యప్రదేశ్లో టమోటా వైరస్ (Tamato virus) కలకలం రేపుతోంది. చిన్నపిల్లల్లో ఈ వైరస్ వేగంగా వ్యాపిస్తుండటంతో తల్లి దండ్రులు ఆందోళన చెందుతున్నారు.
మధ్యప్రదేశ్ (madhyapradesh) రాజధాని భోపాల్లో చిన్న పిల్లల్లో ఒకరి నుండి మరొకరికి ఈ వైరస్ సోకినట్టు ఆరోగ్య నిపుణులు గుర్తించారు. ముఖ్యంగా 6 నుండి 13 ఏళ్ల చిన్నారులకు వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. టమోటా వైరస్ బారిన పడ్డవారికి పాదాలు, అరికాళ్లు, మెడ కింద, చేతులపై, నోటిలో ఎర్రటి దద్దుర్లు వస్తున్నాయి. తరవాత అవి బొబ్బలుగా మారుతున్నాయి.
వైరస్ సోకిన చిన్నారుల్లో దురద, మంట, నొప్పిగా అనిపించడంతో పాటు గొంతు నొప్పి, జ్వరం లాంటి లక్షణాలు సైతం కనిపిస్తున్నాయి. పిల్లల్లో వేగంగా వ్యాప్తించెందుతుండటంతో వైరస్ బారినపడ్డ చిన్నారులను ఇంటివద్దనే ఉంచాలని స్కూల్ యాజమాన్యాలు తల్లిదండ్రులను కోరుతున్నాయి. ఇదిలా ఉంటే టమోటా వైరస్ ను హ్యాండ్, ఫూట్, మౌత్ డిసీజ్ అంటారు. ఎచినోకాకస్, కాక్స్ సాకీ వైరస్ వల్ల ఇది వ్యాప్తి చెందుతుంది. ఆరు నెలల నుండి 12ఏళ్ల వయసు ఉన్న చిన్నారుల్లో టమోటా వైరస్ ఎక్కువగా వ్యాపిస్తుందని వైద్యులు చెబుతున్నారు.
ఇది సాధారణ అనారోగ్య సమస్యనే అని పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు. వారం నుండి పది రోజుల్లో దానికదే తగ్గిపోతుందని చెప్పారు. టమోటా వైరస్ దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు తుంపర్ల ద్వారా, మలవిసర్జన తరవాత చేతులు సరిగా శుభ్రం చేసుకోకపోయినా వ్యాపించే అవకాశం ఉందని తెలిపారు. జన్యుపరమైన లోపాలతో బాధపడే పిల్లలు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్న పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.
































