భారీ వర్షాలు, వరదల ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలు అతలాకుతలమవుతున్నాయి. ఇప్పటివరకు నలుగురు మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షించాలని సీఎం చంద్రబాబు అధికారులు ఆదేశించారు.
ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చాలా చోట్ల వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. వంశధారతో పాటు గొట్టా బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. భారీ వర్షాలు, వరదల దాటికి ఇప్పటి వరకు నలుగురు చనిపోయినట్లు అధికారులు తెలిపారు.
ఉత్తరాంధ్రలోని వర్షాలు, వరద పరిస్థితులపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ తదితర జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ప్రస్తుతం జిల్లాల్లో ఉన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
భారీగా వరద….
గొట్టా బ్యారేజ్ క్యాచ్ మెంట్లో 33 టీఎంసీలు, తోటపల్లి పరిధిలో 11 టీఎంసీలు మేర వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. గొట్టా బ్యారేజికి 1.89 లక్షల క్యూసెక్కులు, తోటపల్లికి 44 వేల క్యూసెక్కుల వరద వస్తోందని వివరించారు. ఒడిస్సాల్లోని ప్రాంతాల్లో పడిన భారీ వర్షాల కారణంగా వంశధారకు 1.05 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోందని వివరించారు.
భారీ వర్షాలు, ప్రమాదాల కారణంగా నలుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. విశాఖ నగరం కంచరపాలెం లో ఒకరు, శ్రీకాకుళం జిల్లా మందసలో ఇద్దరు, పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో ఒకరు మృతి చెందారని సీఎం చంద్రబాబుకు వివరించారు. బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
భారీ వర్షాల కారణంగా కొన్ని చోట్ల చెట్లు కూలాయని….ఇప్పటికే 90 శాతం కూలిన చెట్లను తొలగించామని అధికారులు పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో దాదాపు 90 శాతం మేర విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినట్టు ఈపీడీసీఎల్ అధికారులు తెలిపారు. ఇవాళ సాయంత్రం లోగా అన్ని ప్రాంతాల్లోనూ విద్యుత్ పునరుద్ధరించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. విద్యుత్ సరఫరా పునరుద్దరణలో ఎక్కడా జాప్యం లేకుండా చూడాలన్నారు.
టోల్ ఫ్రీ నెంబర్లు…
భారీ వర్షాలతో నాగావళి, వంశధార నదుల ఉప్పొంగిన నేపధ్యంలో శ్రీకాకుళం, మన్యం, విజయనగరం కలెక్టర్లు, ఎస్పీలతో హోం మంత్రి అనిత సమీక్షించారు. జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్ 24/7 అలెర్ట్ గా ఉండాలని ఆదేశించారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చూడాలన్నారు.
వరద సహయక చర్యలకు NDRF, SDRF, పోలిస్, ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించాలని ఆదేశించారు. వంశధార, నాగావళి నది లోతట్టు ప్రాంత ప్రజలకు ఎప్పటికప్పుడు హెచ్చరిక సందేశాలను పంపాలని సూచించారు విపత్తుల సమాచారం, సహయం కోసం టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 18004250101 సంప్రదించాలన్నారు.
































