రేపే లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ. 15 వేల చొప్పున నగదు జమ – మీ స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

ఏపీ సర్కార్ ప్రకటించిన ‘వాహనమిత్ర స్కీమ్’ (ఆటో డ్రైవర్ సేవలో) నిధుల విడుదలకు రంగం సిద్ధమైంది. రేపు (అక్టోబర్ 4) లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ. 15 వేలను జమ చేయనున్నారు. ఇందుకు ప్రభుత్వం ఏర్పాట్లను పూర్తి చేసింది. స్టేటస్ కూడా సులభంగానే చెక్ చేసుకోవచ్చు.

ఆటో, క్యాబ్ డ్రైవర్ల కోసం ఏపీ ప్రభుత్వం వాహనమిత్ర స్కీమ్(ఆటో డ్రైవర్ సేవలో)ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగియటంతో పాటు అర్హుల గుర్తింపు ప్రక్రియ కూడా పూర్తి అయింది. అయితే వీరందరికీ రేపు(అక్టోబర్ 4) డబ్బులను అందజేయనున్నారు.


ఈ స్కీమ్ కింద అర్హత ఉన్న డైవర్ల బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా డబ్బులను జమ చేస్తారు. ఈ స్కీమ్ ను రేపు సాయంత్రం 4 గంటలకు సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తో పాటు కూటమి సర్కార్ లోని కీలక నేతలంతా పాల్గొంటారు. ఇందుకోసం ఏర్పాటన్నీ పూర్తయ్యాయి.

నిజానికి దసరా రోజు అంటే అక్టోబర్ 2వ తేదీన డబ్బులను జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఈ తేదీని ప్రభుత్వం మార్చింది. ఇందులో భాగంగా రేపు డబ్బులను జమ చేయనున్నారు. సొంత ఆటో రిక్షా, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఈ స్కీమ్ వర్తిస్తుంది.

ఈ స్కీమ్ కింద ఏడాదికి రూ.15,000 ఆర్థిక సహాయం చేయనుంది. ఇందుకోసం 2,90,234 మందిని అర్హులుగా గుర్తించారు. ఏవైనా కారణాల వల్లనైనా ఎవరైనా లబ్దిదారుల జాబితాలో పేరు లేకపోతే… వారి సమస్యలను పరిష్కరించి వారినీ లబ్దిదారుల జాబితాలో చేరుస్తామని కూడా ఇటీవలే సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ స్కీమ్ కోసం ఏడాదికి రూ. 435 కోట్ల ఖర్చు చేయనున్నారు.

స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు…

  • ఈ స్కీమ్ కు దరఖాస్తు చేసుకున్న వాళ్లు స్టేటస్ తెలుసుకోవచ్చు. ముందుగా https://gsws-nbm.ap.gov.in/NBM/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోం పేజీలో స్కీమ్ ఆప్షన్(ఫైనాన్షియల్ అసిస్టెంట్ టు ఆటో అండ్ మ్యాక్స్ క్యాబ్ ఓనర్స్) ఎంచుకోవాలి.
  • స్కీమ్ ఆప్షన్ ను ఎంచుకున్న తర్వాత 2025- 26 సంవత్సరాన్ని ఎంపిక చేసుకోవాలి.
  • ఆపై దరఖాస్తుదారుడి ఆధార్ నెంబర్ ను ఎంట్రీ చేయాలి.
  • క్యాప్చాను ఎంట్రీ చేసి గెట్ ఓటీపీపై క్లిక్ చేయాలి,
  • ముందుగా మీకు బేసిక్ డేటేయిల్స్ కనిపిస్తాయి. ఇందులో దరఖాస్తుదారుడి వివరాలుంటాయి. ఆ తర్వాత… అప్లికేషన్ వివరాలుంటాయి. ఇందులో దరఖాస్తు తేదీ, స్టేటస్, రిమార్క్ అనే ఆప్షన్స్ ఉంటాయి. రిమార్క్ దగ్గర ఏమైనా వివరాలుంటే మీ దరఖాస్తులో ఇబ్బందులు ఉన్నట్లు.. అలా లేకపోతే మీ ఖాతాలో ఈ స్కీమ్ కింద డబ్బులు జమవుతాయి.
  • డబ్బుల జమ అయిన తేదీ, బ్యాంక్ వివరాలు కూడా డిస్ ప్లే అవుతాయి.

అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి పథకం అందేలా చేయాలని అధికారులకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. అర్హత ఉండి కూడా జాబితాలో పేరు లేకుంటే… వారి సమస్యను పరిష్కరించిన వెంటనే లబ్ధిదారుల జాబితాలో చేర్చేందుకు ఏర్పాట్లు చేశారు. దీని కోసం ప్రత్యేకంగా ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రభుత్వం ఓ వ్యవస్థను ఏర్పాటు చేసింది. వాట్సాప్ ద్వారా ఒక ప్రత్యేక గ్రీవెన్స్ హ్యాండ్లింగ్ సిస్టమ్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. లబ్ధిదారులు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్‌లో చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.