ఇవాళ్టి నుంచి కొత్త టీచర్లకు శిక్షణ – పోస్టింగ్ కోసం వెబ్ ఆప్షన్లు ఎప్పుడంటే..?

మెగా డీఎస్సీ-2025లో ఎంపికైన కొత్త ఉపాధ్యాయులకు ఇవాళ్టి నుంచి శిక్షణ మొదలవుతుంది. శిక్షణ సమయంలో తప్పనిసరిగా డ్రెస్ కోడ్ పాటించాలని విద్యాశాఖ స్పష్టం చేసింది.

మెగా డీఎస్సీలో ఎంపికయిన ఉపాధ్యాయులకు ఇవాళ్టి నుంచి ట్రైనింగ్ ప్రారంభం కానుంది. వారం రోజులపాటు కొత్త టీచర్ల శిక్షణ తీసుకుంటారు. అక్టోబర్ 10వ తేదీతో ఈ ట్రైనింగ్ ముగుస్తుంది.


ఇక శిక్షణ తీసుకునే టీచర్లకు పోస్టింగ్‌లు ఇచ్చేందుకు ఈనెల 9, 10 తేదీల్లో వెబ్ కౌన్సెలింగ్ ఉంటుంది. ఇందులో భాగంగా… పని చేయాల్సిన పాఠశాలను కేటాయిస్తారు. ఇక అకడమిక్ కేలండర్, హ్యాండ్‌బుక్ తదితర మెటీరియల్ అందిస్తారు. మరో విడతగా ఏప్రిల్ 25 నుంచి మే 5 వరకు శిక్షణ తరగతులు ఉంటాయి.

అక్టోబర్ 13 నుంచి విధులకు….

అక్టోబర్ 13వ తేదీ నుంచి కొత్త టీచర్లు విధులకు హాజరు అవుతారు. ఇంకోవైపు మెగా డీఎస్సీ తుది జాబితాలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే.. అక్టోబర్ 25 వరకు తెలపవచ్చు. దీనికోసం జిల్లా స్థాయి పోస్టులకు ఆర్జేడీ, ఇద్దరు డీఈవోలతో జోనల్ కమిటీ, రాష్ట్రస్థాయి పోస్టులకు ముగ్గురు రాష్ట్రస్థాయి అధికారులతో కమిటీలను నియమించారు. ఒకవేళ జోనల్ స్థాయి కమిటీ నిర్ణయంపై సంతృప్తి చెందకుంటే.. రాష్ట్రస్థాయి కమిటీకి వెళ్లవచ్చు.

రాష్ట్రస్థాయి కమిటీ నిర్ణయంపై సంతృప్తి చెందకపోతే.. తుది అప్పీలేట్ అథారిటీ అంటే పాఠశాల విద్య డైరెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కమిటీలు 15 రోజుల్లో ఫిర్యాదులను పరిష్కారిస్తాయని కృష్ణా రెడ్డి చెప్పారు. తుది అప్లీలేట్ అథారిటీ ఫిర్యాదులను 30 రోజుల్లో పరిష్కరిస్తుందన్నారు.

మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఏప్రిల్ 20, 2025న జారీ అయింది. మే 15 వరకు దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 3,36,300 మంది అభ్యర్థులు 5,77,675 దరఖాస్తులను సమర్పించారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష జూన్ 6 నుండి జూలై 2 వరకు ప్రతిరోజూ రెండు షిఫ్టులలో నిర్వహించారు. ప్రిలిమినరీ కీని జూలై 5న, ఫైనల్ కీని ఆగస్టు 1న విడుదల చేశారు. తుది ఎంపిక జాబితాను పాఠశాల విద్యాశాఖ ఇటీవలే విడుదల చేసింది.

16347 పోస్టులకు.. 15941 పోస్టులు మాత్రమే భర్తీ అయ్యాయి. 406 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే ఇక ప్రతి ఏటా డీఎస్సీ ఉంటుందని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఇటీవలే ప్రకటించారు. త్వరలోనే మరో టెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.