త్రీడీ ప్రింటింగ్‌ ఇళ్లు చల్లగా ఉంటాయ్‌..

‘‘ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద గ్రామీణ ప్రాంతాల్లో లబ్ధిదారులకు నాణ్యమైన ఇళ్ల నిర్మాణానికి ఆకృతులు రూపొందించాలంటూ కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ సూచించింది. కేంద్ర మంత్రి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ సూచనల మేరకు దేశంలోనే తొలిసారి త్రీడీ ప్రింటింగ్‌ టెక్నాలజీతో ఇళ్లను నిర్మించాం. ఇటీవల ఉత్తరాఖండ్‌లోని రూర్కీలో ఇలా 130 ఇళ్లను కట్టాం. ఇతర ఇళ్లతో పోలిస్తే ఇది చల్లగా ఉంటుంది. వివిధ రాష్ట్రాల సంస్కృతులు.. సంప్రదాయాలకు అనుగుణంగా ఆకృతులు రూపొందిస్తున్నాం’’ అని రూర్కీలోని కేంద్రీయ భవన నిర్మాణ పరిశోధన సంస్థ (సీబీఐఆర్‌) సంచాలకుడు డాక్టర్‌ ప్రదీప్‌ కె.రామన్‌ చెర్ల అన్నారు. హైదరాబాద్‌కు వచ్చిన ఆయన గ్రామీణ ప్రాంతాల్లో తొలిసారిగా నిర్మాణమవుతున్న త్రీడీ ప్రింటింగ్‌ ఇళ్లపై ‘ఈనాడు’తో మాట్లాడారు.


త్రీడీ ప్రింటింగ్‌ ఇళ్ల రూపకల్పన ప్రాజెక్ట్‌ మీకు ఎలా వచ్చింది?

కేంద్రీయ భవన నిర్మాణ పరిశోధన సంస్థ కొన్నేళ్లుగా కొత్త తరహాలో గృహాల నిర్మాణానికి డిజైన్లు రూపొందిస్తోంది. ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన కింద ‘పెహల్‌’ అనే ప్రాజెక్ట్‌కు 250 ఇళ్ల డిజైన్లు ఇచ్చాం. కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో వాటిని నిర్మిద్దామంటూ కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ సహాయమంత్రి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ సూచించారు. త్రీడీ ప్రింటింగ్‌ టెక్నాలజీతో ఇళ్లు నిర్మిద్దామని మేం ప్రతిపాదించాం.

ఇంటి నిర్మాణంలో సిమెంట్, ఇనుము, ఉక్కు ఎంత మోతాదులో ఉంటాయి?

ఇంటి నిర్మాణంలో ఎక్కడా చిన్న ముక్క కంకర కూడా వినియోగించం. స్లాబ్‌కు మాత్రమే ఇనుము, ఉక్కు వాడతాం. ఫ్లైయాష్‌ ఇటుకలతో గోడలను నిర్మిస్తాం. సాధారణ ఇంటితో పోలిస్తే సగం సిమెంట్‌ మాత్రమే పడుతుంది. ఫ్లైయాష్‌ ఇటుకలకు బూడిద లభించని ప్రాంతాల్లో చెరకు పిప్పిని వాడవచ్చు.

పైన మరో అంతస్తు నిర్మించుకోవచ్చా?

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించే ఈ ఇంటిపై పై అంతస్తు వేసుకోవచ్చు. ఒకేసారి మూడు అంతస్తులు కట్టుకోవచ్చు. ఎలాంటి పిల్లర్లు అవసరం లేదు. 600 చదరపు అడుగుల వరకు కట్టుకోవచ్చు.

పర్యావరణపరంగా ఎలాంటి ప్రయోజనాలున్నాయి?

మిగతా ఇళ్లతో పోల్చుకుంటే త్రీడీ ఇళ్ల ద్వారా చాలా తక్కువ బొగ్గుపులుసు వాయువు వెలువడుతుంది. ఇతర ఇళ్లతో పోల్చితే ఇంటి ఉష్ణోగ్రత పది డిగ్రీలు తక్కువగా ఉంటుంది. అంటే ఎండాకాలంలోనూ ఇల్లు చల్లగా ఉంటుంది. రెండు ప్రింటింగ్‌ యంత్రాలతో 300 ఇళ్లను సులభంగా కట్టేందుకు వీలుంటుంది.

ఇంటి నిర్మాణం ఎలా సాగుతుంది?

ఇంజినీర్లు ఇంటిని విభజిస్తారు. భూమి బేస్‌మెంట్‌ స్థాయి నుంచి పది అడుగుల ఎత్తుగా నిర్ణయిస్తే… మూడు అడుగుల ఎత్తు చొప్పున మూడు, ఒక అడుగు బ్లాకులను రూపొందిస్తారు. ఈ బ్లాకులను రూపొందించడానికి ఐదారు రోజులు పడుతుంది.

  • బ్లాక్‌లను ప్రింట్‌ చేసే యంత్రం భారీగా ఉంటుంది. దానిని ఇళ్లను నిర్మించే స్థలానికి సమీపంలో ఏర్పాటు చేస్తారు. యంత్రంలో సిమెంట్, ఫ్లైయాష్, తక్కువ మోతాదులో ఇసుకను వేస్తారు. ప్రింట్‌ అని మీట నొక్కగానే బ్లాక్‌లు బయటకు వస్తాయి
  • ఆ బ్లాక్‌లను ట్రిప్పర్లు, డీసీఎం వంటి వాహనాల్లో ఇళ్ల నిర్మాణ స్థలాల వద్దకు తీసుకెళ్లి బేస్‌మెంట్‌పై అమర్చుతారు. బేస్‌మెంట్‌కు గట్టిగా అతుక్కునేందుకు ‘మర్‌ఫర్‌’ అన్న పదార్థాన్ని వినియోగిస్తారు. మొదటి బ్లాక్‌ గట్టిగా ఉందని నిర్ధారించుకున్నాక దానిపై మరో బ్లాక్‌ను అమర్చుతారు.
  • మూడు అడుగుల ఎత్తున్న మూడు బ్లాక్‌లు అమర్చాక చివర్లో స్లాబ్‌ను వేయడంతో త్రీడీ ప్రింటింగ్‌ ఇల్లు పూర్తవుతుంది.

ఒక యూనిట్‌కు ఎంత ఖర్చవుతుంది?

ఈ ఇళ్ల నిర్మాణంపై రెండేళ్ల నుంచి పరిశోధనలు చేస్తున్నాం. రూ.1.75 లక్షల నుంచి రూ.2 లక్షల్లో 300 చదరపు అడుగుల్లో నిర్మాణం పూర్తవుతుంది. ఇందులో సింగిల్‌ బెడ్‌రూం, కిచెన్, హాల్, శౌచాలయం ఉంటాయి. 45 రోజుల్లో ఇంటి నిర్మాణం పూర్తవుతుంది. పెంకుటిల్లు, స్లాబ్‌- ఈ రెండు పద్ధతుల్లో గృహాలను డిజైన్‌ చేశాం.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.