జీవక్రియలకు నిర్మాణాత్మక ఆధారాలు

మానవ శరీరానికి కావాల్సిన సూక్ష్మపోషకాల్లో ఖనిజ లవణాలు ముఖ్యమైనవి. ఇవి ఎలాంటి శక్తిని ఉత్పత్తి చేయనప్పటికీ, శరీర నిర్మాణంలో భాగమై భౌతిక, మానసిక విధులన్నీ సాఫీగా సాగిపోడానికి సాయపడతాయి. ఎముకలు, దంతాలు, మృదు కణజాలాల నిర్మాణంలో, కండరాల పనితీరు, హార్మోన్ల ఉత్పత్తి మొదలైన జీవక్రియల నియంత్రణలో కీలకంగా వ్యవహరిస్తాయి. ఎంజైమ్‌లు ఉత్తేజితం కావడానికి తోడ్పడుతూ శరీర రసాయన సమతౌల్యతలో ప్రధాన పాత్ర పోషించే వివిధ రకాల ఖనిజ లవణాల గురించి పోటీ పరీక్షార్థులు సమగ్రంగా తెలుసుకోవాలి. ఒక్కో మూలకం ఉపయోగాలు, అవి లభించే ఆహార పదార్థాలు, లోపం వల్ల కలిగే వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలి.


ఖనిజ లవణాలు

మానవ శరీరంలో నిర్మాణాత్మకంగా, క్రియాత్మకంగా అనేక ఖనిజ లవణాలు, మూలకాలు ఉంటాయి. అవి శరీర భాగాల్లో అంతర్నిర్మాణంగా ఉంటాయి. శరీర నిర్మాణానికి ఉపయోగపడే విధానం ఆధారంగా వాటిని మూడు రకాలుగా విభజించవచ్చు.
1) మేజర్‌/ముఖ్య మూలకాలు: వీటిని ‘నిర్మాణాత్మక మూలకాలు’ అంటారు. శరీరంలోని వివిధ అణువులు, కణాల్లోని రసాయనాల్లో భాగంగా ఉంటాయి. ఉదా: కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్‌.
2) మైనర్‌ మూలకాలు: ఇవి ఎముకలు, అమైనో ఆమ్లాలు, శరీర ద్రవాలు, ప్రొటీన్లలో భాగంగా ఉంటాయి. వీటికి ఉదాహరణ కాల్షియం, సోడియం, పొటాషియం, మెగ్నీషియం, ఇనుము, సల్ఫర్, ఫాస్ఫరస్, కోర్లిన్, అయోడిన్‌.
3) ట్రేస్‌ మూలకాలు: ఇవి శరీరానికి తక్కువగా అవసరమవుతాయి. కోబాల్ట్, రాగి, జింక్, సెలీనియం, మాంగనీస్, మాలిబ్డినమ్, క్రోమియం, ఫ్లోరిన్‌.

మూలకాలను నేరుగా కాకుండా ఖనిజ లవణాల రూపంలో ఆహారం ద్వారా తీసుకుంటారు. రోజుకు అవసరమయ్యే పరిమాణం ఆధారంగా మూలకాలను రెండు రకాలుగా విభజించారు.

1) స్థూల మూలకాలు: ఇవి శరీరానికి రోజూ ఒక గ్రాము వరకు అవసరమవుతాయి. కాల్షియం, మెగ్నీషియం, సోడియం, ఫాస్ఫరస్, పొటాషియం, క్లోరిన్‌.
2) సూక్ష్మ మూలకాలు: ఇవి రోజూ ఒక గ్రాము కంటే తక్కువ కావాల్సి ఉంటుంది. రాగి, కోబాల్ట్, జింక్, క్రోమియం, మాంగనీస్, మాలిబ్డినమ్, సెలీనియం, అయోడిన్‌.

  • ఖనిజ లవణాల ఉపయోగాలు: శరీర నిర్మాణానికి, వృద్ధికి అవసరం.
  • హార్మోన్ల ఉత్పత్తి, ఎంజైముల ఉత్తేజానికి ఉపయోగపడతాయి.
  • గాయాలు మానడానికి, వ్యాధి నిరోధక శక్తికి కావాలి.
  • ద్రవాభిసరణ క్రమత, నీటి సమతౌల్యతకు వీటి ఆవశ్యకత ఉంటుంది.
  • కణం లోపల ఉండే కణద్రవ్యంలో; కణం బయట ఉండే ద్రవమైన రక్తంలో ఉన్న ఖనిజ లవణాలు, మూలకాలు వివిధ జీవక్రియలను నిర్వహిస్తాయి.

ఇనుము: హిమోగ్లోబిన్‌ ఏర్పడటానికి ఇనుము అవసరం. కణంలో శ్వాసక్రియ జరగడానికి అవసరమయ్యే ఎలక్ట్రాన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ చైన్‌ రసాయనాల్లో ఈ మూలకం భాగం. దీని లోపంతో రక్తహీనత కలుగుతుంది. ఇలాంటి రక్తహీనతను ‘పోషకాహార రక్తహీనత’ అంటారు.

లభించే పదార్థాలు: కాలేయం, ఆకుకూరలు, యాపిల్, ఎండిన పండ్లు, మునగ లాంటి వాటిలో ఇనుము ఎక్కువగా ఉంటుంది. ఇనుము లోపాన్ని నివారించడానికి భారత ప్రభుత్వం ‘ఐరన్‌ ప్లస్‌ ఇనీషియేటివ్, ఎనీమియా ముక్త్‌ భారత్, నేషనల్‌ మిషన్‌ ఆన్‌ న్యూట్రిషన్‌’ లాంటి కార్యక్రమాలను నిర్వహిస్తోంది. చిన్నపిల్లలు, గర్భిణుల్లో ఇనుము లోపాన్ని నివారించడానికి ప్రభుత్వం బలవర్ధక ఆహారాన్ని, ఇనుముతో ఫోర్టిఫికేషన్‌ చేసిన బియ్యాన్ని సరఫరా చేస్తుంది.

క్లోరిన్‌: ఇది శరీరంలో ప్లాస్మా, ఇతర కణబాహ్య ద్రవాల్లో ఉండే ముఖ్యమైన ఆనయాన్‌. ద్రవాభిసరణ, ఆమ్ల-క్షార క్రమతలకు ఇది అవసరం. జీర్ణాశయంలో స్రవించే హైడ్రోక్లోరిక్‌ ఆమ్లం ఏర్పడటానికి క్లోరిన్‌ అవసరం. కన్నీళ్లు, లాలాజలం, చెమట లాంటి వాటిలో ఈ మూలకం ఉంటుంది. దీని లోపం వల్ల కలిగే స్థితిని ‘హైపో క్లోరిమియా’, ఎక్కువైతే ‘హైపర్‌ క్లోరిమియా’ అంటారు.
లభించే పదార్థాలు: పండ్లు, కూరగాయలు,  సాధారణ ఉప్పు.

సోడియం: రక్తంలోని ప్లాస్మాలో ఉండే ముఖ్యమైన కాటయాన్‌. అయాన్లు, నీటిక్రమతకు సోడియం అవసరం. నాడీ ప్రచోదనాల ప్రసారానికి ఉపయోగపడుతుంది. కాలేయం ఉత్పత్తి చేసే పైత్యరసంలోని పైత్యరస లవణాలైన సోడియం గ్లైకోకోలేట్, సోడియం టారోకోలేట్‌ ఏర్పడటానికి సోడి యం అవసరం. ఇది శరీరంలో ఎక్కువైతే కలిగే స్థితిని ‘హైపర్‌ నేట్రిమియా’, తక్కువైతే ‘హైపో నేట్రిమియా’ అంటారు. దీనివల్ల రక్తపోటు, రక్తనాళాల సంబంధ వ్యాధులు, స్ట్రోక్‌ లాంటివి కలుగుతాయి.

లభించే పదార్థాలు: పండ్లు, కూరగాయలు, ఉప్పు.

పొటాషియం: కణం లోపల ఉండే కణద్రవ్యంలోని ముఖ్యమైన కాటయాన్‌. ద్రవాభిసరణ క్రమతకు, నాడీప్రచోదనాల ప్రసారానికి ఇది అవసరం. పొటాషియం తక్కువైతే కండరాలు సరిగా పని చేయకపోవడం, గుండె తక్కువగా కొట్టుకోవడం లాంటివి జరుగుతాయి. ఈ లవణం లోపం వల్ల కలిగే స్థితిని ‘హైపో కాలిమియా’, ఎక్కువైతే ‘హైపర్‌ కాలిమియా’ అంటారు. ఈ స్థితిలో మూత్రపిండాల పనితీరు దెబ్బతింటుంది.

లభించే పదార్థాలు: అరటిపండ్లు, కూరగాయలు, పండ్లు, గింజల్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది.

కాల్షియం: ఎముకలు, దంతాల్లో ఉంటుంది. రక్తం గడ్డ కట్టడానికి, కండర సంకోచానికి, నాడీ ప్రచోదనాల ప్రసారానికి ఇది అవసరం. దీని లోపం వల్ల ఎముకలు గుల్లబారి, పెళుసుగా మారి త్వరగా విరిగిపోతాయి. ఈ స్థితినే ‘ఆస్టియో పోరోసిస్‌’గా పిలుస్తారు. యుక్త వయసులో కాల్షియం సరిగా అందకపోతే పెరుగుదలలో లోపం, ఎముకలు, దంతాలు సరిగా ఉండవు. శరీరంలో కాల్షియం ఎక్కువైతే కలిగే స్థితిని ‘హైపర్‌ కాల్సిమియా’, తక్కువైతే ‘హైపో కాల్సిమియా’ అంటారు. శరీరంలో కాల్షియం శోషణ జరగాలంటే ఆహారంలో ఎక్కువ ప్రొటీన్‌ ఉండాలి. ఆహారంలో అధిక మొత్తంలో కార్బోహైడ్రేట్‌లు ఉంటే తక్కువ కాల్షియం శోషణ జరుగుతుంది.

లభించే పదార్థాలు: పాలు, పాల ఉత్పత్తులు, ధాన్యాలు (ఎక్కువగా రాగుల నుంచి), సీతాఫలం నుంచి ఎక్కువ కాల్షియం లభిస్తుంది.

జింక్‌: ఇది శరీరంలో కార్బన్‌ డై ఆక్సైడ్‌ రవాణాకు, విటమిన్‌-ఏ జీవక్రియకు అవసరం. ఎంజైముల్లో  కో-ఫ్యాక్టర్‌గా ఉంటూ, వాటి ఉత్తేజానికి ఉపయోగపడుతుంది. కంటిచూపు బాగా ఉండటానికి, గాయాలు మానడానికి, వ్యాధినిరోధక శక్తి పెరగడానికి జింక్‌ అవసరం. దీని లోపం వల్ల శ్వాసక్రియ నెమ్మదించడం, శుక్రకణాల సంఖ్య తగ్గడం, జననాంగాల అభివృద్ధి సరిగా జరగకపోవడం మొదలైన ఇబ్బందులు తలెత్తుతాయి. వాణిజ్యపరంగా ఇన్సులిన్‌ తయారీకి జింక్‌ అవసరం. విరేచనాల (డయేరియా)ను నియంత్రించడానికి ఈ మూలకాన్ని వాడతారు. దీనినే ‘జింక్‌ థెరపీ’ అంటారు.

లభించే పదార్థాలు: కూరగాయలు, బీట్‌రూట్, గుడ్డు.

మాంగనీస్‌: ప్రత్యుత్పత్తి, జ్ఞాపకశక్తి, ఎంజైమ్‌ల ఉత్తేజానికి ఇది అవసరం. దీని లోపం వల్ల వంధ్యత్వం, ప్రత్యుత్పత్తి సమస్యలు కలుగుతాయి.

లభించే పదార్థాలు: కాలేయం, మాంసం, వేరుశనగ.

కోబాల్ట్‌: విటమిన్‌ – బి12లో భాగంగా ఉంటుంది.

ఫ్లోరిన్‌: ఎముకల్లో కొద్ది మొత్తంలో ఉంటుంది. దంతాలు ఏర్పడటానికి అవసరం. దంతాలపై ఎనామిల్‌ తయారీకి ఉపయోగపడి, దంతక్షయాన్ని నివారిస్తుంది. సాధారణంగా దీనిలోపం రాదు. ఒకవేళ లోపం ఉంటే దంతక్షయం జరుగుతుంది. కూరగాయలు, తాగే నీటి నుంచి ఫ్లోరిన్‌ లభిస్తుంది. తాగే నీటిలో ఈ మూలకం 1.5 పీపీఎం (పార్ట్స్‌ పర్‌ మిలియన్‌) కంటే ఎక్కువైతే ఫ్లోరోసిస్‌ వ్యాధి వస్తుంది. అధిక ఫ్లోరిన్‌ ఉన్న భూగర్భ జలాలను తాగేవారిలో ఫ్లోరోసిస్‌ కనిపిస్తుంది.అనేక ప్రాంతాల్లో నీటిలో అధిక ఫ్లోరిన్‌ ఉండటాన్ని సహజ కాలుష్యంగా భావించవచ్చు. శరీరంలో ప్రభావితమయ్యే భాగం ఆధారంగా ఫ్లోరోసిస్‌ను 1) దంత ఫ్లోరోసిస్‌ 2) ఎముకల ఫ్లోరోసిస్‌ 3) నాడీ సంబంధ ఫ్లోరోసిస్‌ అని మూడు రకాలుగా విభజించవచ్చు. ప్రజలకు ఫ్లోరిన్‌ రహిత, సురక్షిత తాగునీటిని అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ తాగునీటి పథకాలను అమలు చేస్తున్నాయి.
అయోడిన్‌: థైరాయిడ్‌ గ్రంథి పనితీరుకు అవసరం. దీని లోపంతో సరళ గాయిటర్‌ వ్యాధి వస్తుంది. గర్భిణుల్లో గర్భస్రావం, చిన్నారుల్లో మానసిక సమస్యలు ఏర్పడతాయి.

లభించే పదార్థాలు: సముద్ర ఉత్పత్తులు, కూరగాయలు, అయోడైజ్డ్‌ ఉప్పు.

ఫాస్ఫరస్‌: కేంద్రక ఆమ్లాలైన డీఎన్‌ఏ, ఆర్‌ఎన్‌ఏల్లో ఫాస్ఫారిక్‌ ఆమ్లం రూపంలో ఫాస్ఫరస్‌ ఉంటుంది. ఎముకలు, దంతాలు ఏర్పడటానికి ఇది అవసరం. ఆమ్ల, క్షార క్రమతకు ఉపయోగపడుతుంది. ఏటీపీ (అడినోసైన్‌ ట్రైఫాస్ఫేట్‌)లో భాగంగా ఉంటుంది.

లభించే పదార్థాలు: పాలు, ధాన్యాలు, చేపలు, గుడ్డు.

మెగ్నీషియం: ఎంజైమ్‌ల ఉత్తేజానికి, నాడుల నుంచి విద్యుత్తు ప్రచోదనాల ప్రసారానికి అవసరం. ఎముకల్లో ఇతర మూలకాలతో కలిసి ఉంటుంది. దీనిలోపం వల్ల హృదయ, రక్తనాళ సమస్యలు, కండరాలు పట్టివేయడం లాంటివి సంభవిస్తాయి.

లభించే పదార్థాలు: ఆకుకూరలు, ధాన్యాలు.

క్రోమియం: కార్బోహైడ్రేట్, ప్రొటీన్, లిపిడ్‌ జీవక్రియలకు ఉపయోగపడుతుంది. ఇన్సులిన్‌ పనితీరును మెరుగుపరుస్తుంది.

రాగి: ఎంజైమ్‌ల ఉత్తేజానికి, మెలనిన్, హిమోగ్లోబిన్, ఎర్రరక్త కణాల తయారీకి; ఇనుము శోషణకు ఇది అవసరం. రాగి లోపం వల్ల ఎనీమియా కలుగుతుంది. దీనినే మైక్రోసైటిక్, నార్మోక్రోమిక్‌ ఎనీమియా అంటారు. రాగి యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది.

లభించే పదార్థాలు: పొద్దుతిరుగుడు, వేరుశనగ, కాలేయం, జీడిపప్పు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.