ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నారా? ఇది మర్చిపోకండి.. మీకు బాగా ఉపయోగపడుతుంది

భారతీయ రైల్వే ఇంత గొప్పగా, ఇంత పెద్ద నెట్‌వర్క్‌తో సాగుతోందంటే.. దానికి కారణం రైల్వే కాదు.. ప్రయాణికులే. వారి వల్లే రైల్వే ఇంత సక్సెస్ అవుతోంది. ట్రైన్ టికెట్‌ని బుక్ చేసుకున్నా, లేదంటే రైల్వేస్టేషన్ దగ్గర కొనుక్కున్నా.. ప్రయాణికులు ఒకటి మర్చిపోకుండా ఉంచుకోవాలి. అదేంటో తెలుసుకుందాం.


మీరు విక్రమ్, శంకర్‌ల అపరిచితుడు సినిమా చూసే ఉంటారు. అందులో హీరో.. రైళ్లలో అపరిశుభ్రత, ఆహార కల్తీ ఇలా కొన్ని అంశాలను ప్రశ్నిస్తాడు. తద్వారా రైల్వే శాఖకు ఆ సినిమా ఓ గుణపాఠం లాగా మారిందనుకోవచ్చు. ఎందుకంటే.. రైళ్లలో అలాంటి చాలా సమస్యల్ని మనం తరచూ చూస్తూనే ఉంటాం. కానీ మనకు ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే.. సర్దుకుపోవడం. ఇది భారతీయుల బ్లడ్‌లోనే ఉంది. రాజీ పడిపోవడం, పోనీలే అని వదిలేయడం మనకు చిన్నప్పటి నుంచి అలవాటైపోతూ ఉంటుంది. కానీ రైల్వే శాఖ.. రాజీ పడవద్దు అంటోంది. తమను ప్రశ్నించమని స్వయంగా అడుగుతోంది.

మనం రైలు ఎక్కినప్పుడే కాదు.. రైల్వేస్టేషన్‌లో అడుగు పెట్టినప్పటి నుంచే ఎన్నో సమస్యలు కనిపిస్తాయి. వాటిపై అప్పుడే గట్టిగా నిలదియ్యాలి అనిపిస్తుంది. కానీ.. రైలొచ్చేస్తుంది కదా అని రాజీపడతాం. కానీ కేంద్రంలో ఇప్పుడున్న రైల్వే శాఖ.. ప్రయాణికులు ఫీడ్‌బ్యాక్ ఇచ్చేదాకా వదలట్లేదు. మన దగ్గర నుంచి చాలా మార్గాల్లో ఫీడ్‌బ్యాక్ తీసుకుంటోంది. మొన్నటిదాకా యాప్స్ ద్వారా తీసుకునేది. ఇప్పుడు యాప్స్‌తోపాటూ.. ఏకంగా రైల్లోనే ఓ ఫారం ఇచ్చి.. దాన్ని నింపమని కోరుతోంది. అలా ఫారం ఇస్తే మనం కచ్చితంగా నింపుతాం. లోపాల్ని కచ్చితంగా చెబుతాం.

ఈ మధ్య ఓ ప్రయాణికుడు ఎర్నాకుళం నుంచి చెన్నైకి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రైస్ 3టైర్ ఏసీలో ప్రయాణించాడు. అతనికి జలుబు ఉండటంతో.. ఏసీ కోచ్ నుంచి బయటకు వచ్చి.. డోర్ దగ్గర నిలబడ్డాడు. ఇంతలో.. కొంతమంది అతని దగ్గరకు వచ్చి.. ఫీడ్ బ్యాక్ బుక్ ఇచ్చి, అందులో ఒక ఫారం నింపమన్నారు. వాళ్లు రైల్లో క్లీనింగ్ సిబ్బంది. సరే అని అతను.. ఒక ఫారం నింపాడు. అందులో ఉన్న ప్రశ్నలకు సింపుల్‌గా టిక్స్ పెట్టాడు. అతను రైళ్లలో పెద్దగా ప్రయాణించే రకం కాదు. అది అతనికి కొత్తగా అనిపించింది. మరోవైపు ఆనందం కూడా కలిగించింది. మన రైళ్లలో ఇంత మార్పు వచ్చిందా? అని ఆశ్చర్యపోయాడు.

ఇటీవల మరో ప్రయాణికుడు OBHS కోచ్ మిత్ర సర్వీసెస్ ఫీడ్‌బ్యాక్ ఫారం నింపాల్సి వచ్చింది. OBHS అంటే ఆన్ బోర్డ్ హౌస్‌కీపింగ్ సర్వీసెస్ అని అర్థం. అంటే రైల్లో కోచ్‌లను శుభ్రపరచడం, నీటి సమస్యలు లేకుండా చెయ్యడం, లైటింగ్ సరిగా ఉండేలా చూడటం, బెడ్‌రోల్, పెస్ట్ కంట్రోల్ వంటి సమస్యల్ని పరిష్కరించడానికి అందించే సేవ. ఇది రాజ్‌ధాని, శతాబ్ది వంటి 1000కి పైగా ట్రైన్‌లలో అందుబాటులో ఉంది. ప్రయాణికుల ఫీడ్‌బ్యాక్‌ని బట్టీ.. రైల్వే శాఖ OBHS కాంట్రాక్టర్లకు మనీ చెల్లింపులు చేస్తాయి. అంటే.. ఫీడ్‌బ్యాక్ బాగుంటే.. ఎక్కువ మనీ, బాగోకపోతే, తక్కువ మనీ ఇస్తాయి.

మీకు ఎప్పుడైనా OBHS ఫీడ్‌బ్యాక్ ఫారం వస్తే… అందులో మొదటి ప్రశ్నగా టాయిలెట్స్, వాష్ బేసిన్ బాగా క్లీన్ చేశారా అని అడుగుతారు. దానికి 4 ఆన్సర్లు ఉంటాయి. 1.ఎక్సలెంట్, 2.గుడ్, 3.యావరేజ్, 4.పూర్.. మనకు కరెక్ట్ అనిపించిన బాక్సులో రైట్ టిక్ పెట్టాలి. రెండో ప్రశ్న చూస్తే.. ప్రయాణికుల కంపార్ట్‌మెంట్‌ని పూర్తిగా క్లీన్ చేశారా అని అడుగుతారు. మూడో ప్రశ్న చూస్తే.. క్లీనింగ్ సిబ్బంది, సూపర్‌వైజర్ వంటి వారు మీతో సరిగ్గానే ప్రవర్తించారా? అని అడుగుతారు. ఈ ఫీడ్‌బ్యాక్ మనం ఇవ్వడం వల్ల.. రైల్వే సేవలు మరింత మెరుగుపరిచేందుకు వీలవుతుంది. మనం యాప్‌లలో కూడా ఇవ్వొచ్చు.

మనం గూగుల్ ఆండ్రాయిడ్ ప్లే స్టోర్‌లో కోచ్ మిత్ర (Coach Mitra) యాప్‌ని మన మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసుకొని.. ఫీడ్‌బ్యాక్ ఇవ్వొచ్చు. ఇన్‌స్టాల్ చేశాక ట్రైన్ నంబర్, PNR, మొబైల్ నంబర్ ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వాలి. తర్వాత యాప్‌లో “Clean My Coach” లేదా “Service Request” ఆప్షన్ క్లిక్ చేయాలి. శుభ్రత, నీరు వంటి సమస్య వివరాలు ఎంటర్ చేసి, సబ్‌మిట్ చేస్తే చాలు. ఆ తర్వాత మీ కంప్లైంట్ పరిష్కారానికి సంబంధించి ట్రాకింగ్ ID వస్తుంది. ఇది 1700లకు పైగా ట్రైన్‌లకు ఫీడ్‌బ్యాక్ ఇచ్చేందుకు ఉపయోగపడుతుంది. ఇందులో మనం సమస్య చెబితే, వెంటనే సాల్వ్ చేస్తారు. ఇలా 90 శాతం కంప్లైంట్లను స్పాట్‌లో సాల్వ్ చేస్తున్నారు.

మనం SMS ద్వారా కూడా కంప్లైంట్ ఇవ్వొచ్చు. క్లీనింగ్ కోసం 58888 నంబర్‌కి SMS పంపాలి. అందుకు ఫార్మాట్ చూస్తే.. COACH <ట్రైన్ నంబర్> <కోచ్ నంబర్> వేస్తే సరిపోతుంది. అలాగే జనరల్ రిక్వెస్ట్ పంపాలంటే.. 92000 03232 నంబర్‌కి SMS పంపవచ్చు. అందుకు ఫార్మాట్ చూస్తే.. HELP <ట్రైన్ నంబర్> <కోచ్ నంబర్> <సమస్య> చెప్పాలి. అరగంటలో సమస్యను సాల్వ్ చేస్తారు. అప్పుడు మీరు, మీతోపాటూ.. ఇతర ప్రయాణికులకు కూడా మేలు చేసినట్లు అవుతుంది. మరో నంబర్ కూడా ఉంది. అది 9717630982. దీనికి SMS పంపాలంటే ఫార్మాట్ చూస్తే.. COMPLAINT <వివరాలు> ఇవ్వాలి. లేదా 139కి కాల్ చేసి చెప్పొచ్చు. ట్విట్టర్/Xలో అయితే.. @RailMinIndia లేదా @IRCTCofficial‌కి మెసేజ్ పంపొచ్చు.

మరో రకంగా కూడా ఫీడ్‌బ్యాక్ ఇవ్వొచ్చు. Rail Madad పోర్టల్ లేదా యాప్ ద్వారా కూడా సాధ్యమే. ఇది కూడా గూగుల్ ప్లే స్టోర్‌లో ఉంటుంది. అలాగే ఇది UMANG యాప్‌లో కూడా అందుబాటులో ఉంది. ప్రయాణికుల సంతృప్తిని పెంచడానికీ, కంప్లైంట్లను త్వరగా పరిష్కరించడానికీ ఈ అవకాశం కల్పించారు. ఇందులో కూడా మీరు కంప్లైంట్ చెయ్యవచ్చు, సూచనలు ఇవ్వొచ్చు. ఆన్‌లైన్ ఫారంలో ప్రయాణికుడి పేరు, మొబైల్ నంబర్, ఈమెయిల్, ఘటన తేదీ, ట్రెయిన్ నంబర్, స్టేషన్ పేరు, స్టాఫ్ పేరు (అవసరమైతే) ఇవ్వొచ్చు. మన దగ్గర ప్రూఫ్ ఉంటే.. ఆ ఫొటోలు లేదా వీడియోల వంటివి కూడా అటాచ్ చేయవచ్చు. రిజిస్టర్ చేసిన తర్వాత, రెఫరెన్స్ నంబర్ (లేదా ట్రాకింగ్ ID) ద్వారా స్టేటస్ తెలుసుకోవచ్చు. ఇలా మన రైల్వేని మనం మరింత చక్కగా మార్చుకోవచ్చు.

 

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.