ఎవరికి ఎంత పెంపు ఉంటుంది? డీఏ గురించి టాప్‌ 10 హైలెట్స్‌ ఇవే!

ద్రవ్యోల్బణం.. పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు, పింఛన్‌దారుల పింఛన్‌ పెంచాల్సి ఉంది. దానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరువు భత్యం (డియర్‌నెస్‌ అలవెన్స్‌) ప్రకటిస్తారు.


ఈ కరువు భత్యాన్ని (డీఏ) ఏడాదికి రెండు సార్లు ప్రకటిస్తారు. తాజాగా కేంద్ర మంత్రిమండలి ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు భారీ శుభవార్త ప్రకటించిన విషయం తెలిసిందే. అక్టోబర్‌ 1వ తేదీన మూడు శాతం డీఏ పెంపునకు ఆమోదం తెలుపుతూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. కొత్తగా డీఏ పెరుగుదలపై టాప్‌ 10 ముఖ్యాంశాలు తెలుసుకుందాం.

1. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏను పారిశ్రామిక కార్మికుల తాజా వినియోగదారుల ధరల సూచిక (సీపీఐ-ఐడబ్ల్యూ) ఆధారంగా లెక్కిస్తారు. కార్మిక మంత్రిత్వ శాఖలోని ఒక విభాగం, లేబర్ బ్యూరో, ప్రతి నెలా సీపీఐ-ఐడబ్ల్యూ డేటాను అందిస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల డియర్‌నెస్ అలవెన్స్‌ను లెక్కించడానికి ఒక నిర్దిష్ట సూత్రం ఉంది. 7వ వేతన సంఘం ప్రకారం కనీస ప్రాథమిక జీతం రూ.18,000 ఉన్న ఉద్యోగి నెలవారి ఆదాయానికి 3 శాతం పెరుగుదల దాదాపు రూ.540 పెంచుతుంది. అంటే వారి మొత్తం జీతం రూ.28,440కి పెరుగుతది. ఇక పింఛన్‌దారులకు రూ.9 వేలు కనీస పెన్షన్‌కు అదనంగా రూ.270 అందిస్తుంది. దీంతో వారి పెన్షన్ రూ.14,220కి చేరుకుంటుంది.

2. డీఏ అంటే కరువు భత్యం (డియర్‌నెస్ అలవెన్స్) కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్‌దారులకు ధరల పెరుగుదల ప్రభావం ఎదుర్కోవడంలో సహాయపడేందుకు చెల్లిస్తారు. ద్రవ్యోల్బణంతో ధరలు పెరుగుతుండడంతో జీవన వ్యయం అధికమవుతుంది. దీన్ని తగ్గించడానికి రెండుసార్లు డీఏ పెంపు ఉంటుంది. డీఏ పెరిగితే ఉద్యోగులకు ప్రతి నెలా జీతం పెరుగుతుంది.

3. కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్‌నెస్ అలవెన్స్, డియర్‌నెస్ రిలీఫ్ 3 శాతం పెంపుకు ఆమోదం తెలిపింది. తాజా పెంపుతో డీఏ 55 శాతం నుంచి 58 శాతానికి పెరుగుతుంది.

4. జీతంలో ఎంత పెరుగుదల
ఉద్యోగి కనీస జీతం రూ.50,000 ఉంటే 55 శాతంతో డీఏ రూ.27,500 ఉంటుంది. తాజాగా 3 శాతం డీఏ పెంపుతో 58 శాతానికి చేరుతుంది. రూ.50,000 జీతంపై 58 శాతం డీఏ రూ.29,000 అవుతుంది. కొత్త డీఏ పెంపుతో ఉద్యోగికి ప్రతి నెలా రూ.1,500 పెరుగుదల ఉంటుంది.

5. డీఏ పెంపుతో హెచ్‌ఆర్‌ఏ, టీఏ వంటి ఇతర అలవెన్సులు పెరుగుదల ఉండవు. పెన్షనర్లకు డీఆర్‌ కూడా ఇదే శాతంలో పెంపు ఉంటుంది.

6. దసరా,దీపావళి సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం డియర్‌నెస్ అలవెన్స్, రిటైరైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ రిలీఫ్‌ను ప్రకటించింది. పెంచిన డీఏ జూలై 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుంది.

7, ఈ ఏడాదిలో మొదటిసారి మార్చి నెలలో డీఏను రెండు శాతం పెంచారు. దీంతో కనీస వేతనం 53 శాతం నుంచి 55 శాతానికి చేరుకున్నాయి. తాజాగా రెండోసారి జూలైకి సంబంధించిన డీఏను ఆలస్యంగా అక్టోబర్‌లో ప్రకటించింది.

8. కరువు భత్యం, డియర్‌నెస్‌ రిలీఫ్‌ పెంపుతో 1.2 కోట్ల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు భారీ ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది. తాజా డీఏ, డీఆర్‌ పెంపుతో కేంద్ర బడ్జెట్‌పై మొత్తం రూ.10,084 కోట్ల భారం పడనుంది.

9. తాజాగా పెంచిన డీఏ పెంపు ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 1 జూలై 2025 నుంచి అమల్లోకి రానుంది. డీఏ పెంపు ప్రకటన అక్టోబర్‌లో వచ్చింది. వాస్తవంగా జూలైలో ప్రకటించాల్సిన డీఏ ఆలస్యంగా ప్రకటించడంతో జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల బకాయిలు ఏరియర్స్ రూపంలో చెల్లిస్తారు.

10. పెంచిన డీఏ 3 శాతం కలిపి అక్టోబర్ జీతంలో ఉద్యోగులకు, పింఛన్‌రూపంలో పింఛన్‌దారులకు అందనుంది. పెరిగిన డీఏ 3శాతంతో పాటు మూడు నెలలు జూలై, ఆగస్టు, సెప్టెంబర్ డీఏ బకాయిలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులు పొందనున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.