పత్రాలు ఇవ్వండి.. డబ్బులు తీసుకెళ్లండి.. కేంద్ర సంస్థల్లో మూలుగుతున్న 1.84లక్షల కోట్లు

కటా రెండా, పదులా వేలా, లక్షలా.. కాదు కాదు కోట్లు. అది కూడా లక్షల కోట్లు. బ్యాంకుల్లోనూ, ఫైనాన్షియల్ సంస్థల్లో మూలుగుతోంది. అక్షరాల 1.84లక్షల కోట్లు.


ఇది ఎవరి సొమ్మో కాదు. మన భారతీయుల కష్టం.. అంత సొమ్మ మన బ్యాంకుల్లోనే ఉంది. పలు నియంత్రణ సంస్థల్లోనే మూలుగుతోంది. కేంద్రం కూడా మీసొమ్ము, మీ హక్కు అంటోంది. కాకుంటే డబ్బు దస్కం దగ్గర పత్రం కూడా ముఖ్యమే కదా, సొమ్ము తమదేనని నిర్ధారించే పత్రం ఉంటే చాలు, మీకు ఎంత రావాలో లెక్కలు చూసి, వడ్డీతో సహా చెల్లిస్తుంది.
ఇన్ని లక్షల కోట్ల నిధులు ఆర్ధిక సంస్థల్లో ఉండడానికి కారణం, ఖాతాదారులు క్లైయిమ్ చేసుకోకపోవడమే. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. ఖాతాదారు మరణించి ఉండడం, వారసులకు సరైన సమాచారం లేకపోవడం, చిరునామాలు మారడం, పత్రాలు దొరకకపోవడం. దీంతో చాలామంది తమ తాత,ముత్తాలు కూడబెట్టిన డబ్బు గురించి తెలియక అలాగే వదిలేయడం సహజంగా జరుగుతూ వస్తోంది. ఈకారణాలతో మన పెద్దలు కష్టపడి జమ చేసిన డబ్బు సంవత్సరాల తరబడి రికార్డుల్లోనే ఉండిపోతోంది. బ్యాంక్ డిపాజిట్లు, పెన్షన్ బకాయిలు, బీమా క్లెయిమ్‌లు, ఇలా అన్నీ పోగుబడి, లక్షల కుటుంబాలకు సంబంధించిన సొమ్ము అలా మూలనపడిపోయింది.

ఇలా నిలిచిన సొమ్ములో ఎక్కువ భాగం బీమారంగంలోనే ఉందంటున్నారు నిపుణులు. పాలసీదారులు చెల్లించిన ప్రీమియం గురించి కుటుంబాలకు చేరకపోవడం అనేక సందర్భాల్లో జరుగుతోంది. పాలసీ వివరాలు ఇంటి సభ్యులకు తెలియకపోవడం వల్ల బీమా కంపెనీల ఖాతాల్లో కోట్ల రూపాయలు ఖాళీగానే మిగిలిపోతున్నాయి. అదే విధంగా డివిడెండ్‌లు, షేర్ లాభాలు కూడా ఇన్వెస్టర్లకు తెలియని పరిస్థితి. అలాగే బ్యాంకులు, పోస్టాఫీసులు మాత్రమే కాకుండా ప్రావిడెంట్ ఫండ్‌లు, మ్యూచువల్ ఫండ్ యూనిట్లు కూడా దశాబ్దాల నుంచి క్లెయిమ్ చేసుకోని డబ్బు కోట్లలో ఉంది.

ఆర్థిక శాఖ అంచనా ప్రకారం సుమారు రూ.1,84,000 కోట్ల వరకు ఇప్పటికీ ఎవరూ క్లెయిమ్ చేయలేదు. ఇది సాధారణ కుటుంబాల భవిష్యత్తు భద్రతకు కీలకమైన డబ్బు. ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలను ప్రారంభించింది. డిజిటల్ టూల్స్ ద్వారా పత్రాలు సమర్పించే ప్రక్రియను సులభతరం చేసింది. మీ సొమ్ము మీ హక్కు అన్న ప్రోగ్రామ్‌ను కండక్ట్ చేసింది. బ్యాంకులు కూడా ఇందులో భాగస్వామ్యం చేసింది.

అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్ల కోసమే, రిజర్వ్‌ బ్యాంక్‌ ఉద్గమ్‌ పోర్టల్‌ను తీసుకువచ్చింది. పోర్టల్‌ ద్వారా పౌరులు నగదును క్లెయిమ్‌ చేసుకునేలా అవగాహన కల్పించాల్సిన బాధ్యత బ్యాంకు అధికారులకు కేంద్రం అప్పచెప్పింది. అవసరమైతే బ్యాంకులు గ్రామాల్లో స్టాల్స్‌ ఏర్పాటు చేయాలని నిర్మలా సీతారామన్‌ సూచించారు. మరెందుకాలస్యం, మీ సొమ్ముకు సంబంధించిన పత్రాలను వెతకండి, వెతికితే దొరకందంటూ ఏదీలేదు..

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.