ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల ఆర్థిక స్వావలంబనకు ఏపీ ప్రభుత్వం తన వంతుగా కృషి చేస్తుంది. ముఖ్యంగా ఏపీలోని డ్వాక్రా మహిళల ఆర్థిక సాధికారిత లక్ష్యంగా వినూత్న పథకాలను అమలు చేస్తుంది.
కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో, డ్వాక్రా మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడానికి ఏపీ ప్రభుత్వం రాయితీలపై రుణాలను అందిస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్వాక్రా మహిళలు వివిధ జీవనోపాధి యూనిట్లను ఏర్పాటు చేసుకోవడం కోసం లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతుంది.
స్వయం సహాయక సంఘాల సభ్యులతో గ్రామసభలు
వెలుగు, పశు సంవర్ధక శాఖల ఆధ్వర్యంలో లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతుంది. వీరికి బ్యాంకు లింకేజీ తో పి ఎం ఈ జి పి, పీ ఎం ఎఫ్ ఎం ఈ, శ్రీనిధి వంటి రుణాలను అందించడానికి ప్రణాళికలు రూపొందించారు. ప్రస్తుతం స్వయం సహాయక సంఘాల సభ్యులతో గ్రామాలలో గ్రామసభలు నిర్వహిస్తున్నారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు కోళ్లు వంటి యూనిట్లను ఏర్పాటు చేయదలచిన లబ్ధిదారులను గుర్తిస్తున్నారు.
జీవనోపాధి యూనిట్లపై లభించే రుణాలపై రాయితీలు
వీరికి ఆయా యూనిట్లను ఏర్పాటు చేసుకోవడానికి రుణాలు మంజూరు చేసేలా అధికారులు చొరవ చూపుతున్నారు. డ్వాక్రా మహిళలకు జీవనోపాధి యూనిట్ల పై లభించే రుణాలపై గణనీయమైన రాయితీలు ఉంటాయి. ఒక లక్ష రూపాయలు విలువైన యూనిట్ ఏర్పాటు చేస్తే అందులో మహిళలు 35 వేల రూపాయల రాయితీని పొందుతారు. మిగిలిన 65 వేల రూపాయలను మాత్రమే వీరు ఋణం చెల్లించవలసి ఉంటుంది.
ఈ యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వ చొరవ, మార్కెటింగ్ లోనూ సాయం
ఒకవేళ రెండు లక్షల రూపాయల రుణం తీసుకుంటే 75వేల రాయితీ లభిస్తుంది. మహిళలు ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు, కోళ్లకు సంబంధించిన షెడ్డులు మాత్రమే కాకుండా బేకరీలు, పేపర్ ప్లేట్లు తయారీ యూనిట్లు, వ్యవసాయ పరికరాలు వంటి వాటికి కూడా రుణాలను తీసుకొని రాయితీలను పొందవచ్చు. ఈ రాయితీలు కల్పిస్తూ డ్వాక్రా మహిళలకు జీవనోపాధి యూనిట్లను ఏర్పాటు చేయడమే కాకుండా, వారి ఉత్పత్తుల మార్కెటింగ్ విషయంలోనూ ప్రభుత్వం సహకారం అందిస్తుంది.
మహిళలకు గోల్డెన్ ఛాన్స్.. మిస్ చేసుకోవచ్చు
డ్వాక్రా మహిళలను ఆర్థికంగా పురోగతి వైపు నడిపించే లక్ష్యంతో ప్రభుత్వం అందిస్తున్న ఈ సువర్ణావకాశం, మహిళలు సద్వినియోగం చేసుకొని ఆర్థిక పురోగతి వైపు అడుగులు వేస్తే రాష్ట్ర ప్రగతి కూడా సాధ్యమవుతుందని ప్రభుత్వ భావన. మరి ఇంకెందుకు ఆలస్యం జీవనోపాధి యూనిట్ల ఏర్పాటు పైన ఫోకస్ చేసి ప్రభుత్వ సహకారంతో ఏపీలో మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించండి.
































