పోషకాల గనులు.. మల్బరీ పండ్లు

ఎక్కువమంది అంతగా ఆసక్తి చూపని పండ్లలో మల్బరీ ఒకటి. ఎరుపు, నలుపు రంగులతో ఉండే ఈ పండ్లు తీపి, పులుపు కలిసిన రుచితో ఉంటాయి. ఇవి పోషకాల గనులని.. మార్కెట్లో కనిపిస్తే వదలొద్దని సూచిస్తున్నారు నిపుణులు. వీటిలో ఫ్లేవనాయిడ్స్, ఆంథోసయనిన్స్‌ వంటి యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయని ఉద్యాన శాస్త్రవేత్త పిడిగం సైదయ్య తెలిపారు. ‘‘ఈ పండ్లలో  ఉండే రెస్వరెట్రాల్‌ రసాయనం తదితరాలు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటాయి. ఈ పండ్లను తరచూ తింటుంటే కీళ్లు, కండరాల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆర్థరైటిస్‌ ఉన్నవారికి మేలు జరుగుతుంది. వీటిలో డీఎన్‌జే సమ్మేళనం ఉంటుంది. డయాబెటిస్‌ ఉన్నవారికి ఎంతో మేలు చేస్తాయి. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. వీటిలో ఉండే పొటాషియం రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది. దీంతో బీపీ నియంత్రణలో ఉంటుంది. ఈ పండ్లలో విటమిన్‌-సి అధికంగా ఉండడంతో శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఈ పండ్లలో కె, ఇ విటమిన్లు, ఫైబర్‌ అధికంగా ఉంటాయి. యాంటీ క్యాన్సర్‌ గుణాలున్నాయి. మూత్రపిండాల వ్యాధి, అధిక బరువు సమస్యలను, రక్తహీనతను తగ్గిస్తాయి’’ అని వివరించారు సైదయ్య.


అన్ని కాలాల్లో పండే ఈ పండ్లు నగరాలు, పట్టణాల్లోని సూపర్‌ మార్కెట్లు, మాల్స్‌లో లభిస్తున్నాయి. ఇ-కామర్స్‌ సంస్థలూ సరఫరా చేస్తున్నాయి.

ఎక్కువగా పట్టు పురుగుల ఆహారం కోసమే రైతులు మల్బరీ సాగు చేపడుతుంటారు. అయితే వీటి పండ్లు పోషకాల గనులని తెలిసి.. వినియోగం పెరుగుతుండడంతో.. రైతులు ఈ దిశగా సాగు చేయడంపై దృష్టి సారించారు. ప్రస్తుతం తెలంగాణలో దాదాపు 800 ఎకరాల్లో ఈ పంటను సాగు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమబెంగాల్, హిమాచల్‌ప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లో మల్బరీ తోటలు సాగవుతున్నాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.