Polavaram Project: పోలవరం పూర్తికి ఇవే లక్ష్యాలు

పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటి ల్‌ సోమవారం ఢిల్లీలో సమీక్షించనున్నారు. ఆ శాఖ కార్యదర్శి దేబర్షి ముఖర్జీతో….


పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటి ల్‌ సోమవారం ఢిల్లీలో సమీక్షించనున్నారు. ఆ శాఖ కార్యదర్శి దేబర్షి ముఖర్జీతో పాటు కేంద్ర జల సం ఘం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), కేంద్ర ప్రభుత్వ పరిశోధనా సంస్థలు, రాష్ట్ర జల వనరుల మంత్రి నిమ్మల రామానాయుడు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌, సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, ఇంజనీర్‌-ఇన్‌-చీ్‌ఫ (ఈఎన్‌సీ) నరసింహమూర్తి తదితరులు హాజరు కానున్నారు. ప్రాజెక్టు స్థితిగతులు, పురోగతి, లోటుపాట్లను కేంద్ర మంత్రికి పీపీఏ వివరించనుంది. పోలవరం తాజా ప్రగతి, లక్ష్యాలను రాష్ట్ర ప్రభుత్వం ఆయన ముం దుంచనుంది. ఈ ఏడాది డిసెంబరు నాటికి డయా ఫ్రం వాల్‌, ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాం గ్యాప్‌-1 పనులు వచ్చే ఫిబ్రవరికి, గ్యాప్‌-2 పనులు 2027 డిసెంబరు నాటికి, కుడి కాలువ కనెక్టివిటీలను 2026 జూలై నాటికి, ఎడమ కాలువ కనెక్టివిటీలు 2027 ఫిబ్రవరి నాటికి, మిగతా ఇతర పనులన్నిటినీ వచ్చే ఏడాది డిసెంబరు నాటికి పూర్తి చేసేలా లక్ష్యాలను నిర్దేశించుకున్నట్లు నివేదించనుంది. కాగా.. ప్రతి మూడు నెలలకు పోలవరం ప్రాజెక్టు ప్రగతి వివరాలను మంత్రి నిమ్మల నేరుగా జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌కు పంపుతున్నారు. తరచూ ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రతి సమావేశంలోనూ ఆయన్ను పోలవరం ప్రాజెక్టు సందర్శనకు ఆహ్వానిస్తున్నారు. సోమవారం నాటి భేటీలోనూ రమ్మని కోరతానని నిమ్మల ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు.

సహాయ పునరావాసమే అసలు సమస్య

ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వచ్చాక పోలవరం ప్రధాన డ్యాం పనులన్నీ గాడిలో పడ్డాయి. అయితే నిర్వాసితులకు సహాయ, పునరావాసమే అసలు సమస్యగా మారిం ది. ప్రాజెక్టు తొలిదశలో 41.15 మీటర్ల కాంటూరు దాకా నిధులు ఇచ్చేందుకు కేంద్రం సంసిద్ధత వ్యక్తంచేసింది. అయితే ప్రాజెక్టులో గరిష్ఠంగా 45.72 మీటర్ల కాంటూరులో 194.6 టీఎంసీల నీటిని నిల్వచేయాలంటే భూసేకరణ, సహాయ పునరావాస కార్యకక్రమాలకు నిధుల సమస్య తలెత్తుతోంది. 2014-19 కాలంలో 45.72 మీటర్లకు సంబంధించి భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాల సమాచారం పీపీఏ వెబ్‌సైట్‌లో ఉండేది. 2019-24 మధ్యకాలంలో నాటి సీఎం వైఎస్‌ జగన్‌ దానిని 41.15 మీటర్ల కాంటూరుకే పరిమితం చేశారు. ఈ కాంటూరులో నీటిని నిల్వ చేస్తే 115 టీఎంసీల నిల్వతో పోలవరం ప్రాజెక్టు చిన్నతరహా ప్రాజెక్టుగా మిగిలిపోతుందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. 194.60 టీఎంసీల నిల్వ చేసేలా భూసేకరణ, సహాయ పునరావాసానికి నిధులు మంజూరు చేస్తామనే లిఖితపూర్వక హామీని కేంద్రం నుంచి పొందాలని ప్రభుత్వానికి సూచిస్తున్నారు.

ఆశలు వదిలేసిన పోలవరానికి మళ్లీ ఆయుష్షు

జగన్‌ పాలనలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం స్తంభించింది. కేంద్రం వద్దన్నా వినకుండా నిర్మాణ సంస్థ కాంట్రాక్టును రద్దు చేశారు. రివర్స్‌ టెండర్‌ పేరిట ఏడాదిన్నరపాటు కాలయాపన చేశారు. 2020లో గోదావరి నదికి వచ్చిన భారీ వరదకు కీలకమైన డయాఫ్రం వాల్‌ దెబ్బతింది. దీంతో వరద ప్రవాహాన్ని అడ్డగించే ప్రధాన డ్యాం ఎర్త్‌ కం రాక్‌ఫిల్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) డ్యాం నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది. ఇదే సమయంలో కాఫర్‌ డ్యాంకు సీపేజీ వచ్చింది. గైడ్‌బండ్‌ కుంగిపోయింది. ప్రాజెక్టును 2020లోనే నిర్మిస్తామంటూ అసెంబ్లీ వేదిక చెప్పిన జగన్‌.. తర్వాత మాటమార్చుకుంటూ వచ్చారు. చివరకు ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమని ఆయన మంత్రే ప్రకటించారు. ఇలా జీవం కోల్పోయి ఇక పోలవరం ప్రాజెక్టు పూర్తి కాదని ప్రజలు ఆశలు వదిలేసుకున్న సమయంలో.. గత ఏడాది చంద్రబాబు నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చి దానికి ఆయుష్షు పోసింది. కేంద్ర జలశక్తి శాఖ, కేంద్ర జల సంఘం, అంతర్జాతీయ నిపుణులు, పీపీఏ.. ఇలా పలు సంస్థల పర్యవేక్షణలో ప్రాజెక్టు పనులు చకచకా సాగుతున్నాయి. వరద వచ్చిన సమయంలోనూ డయాఫ్రం వాల్‌ సహా ఇతర పనులన్నీ నిర్దేశిత సమయంలో పూర్తిచేసేందుకు యంత్రాంగం కృషిచేస్తోంది.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.