వైద్య చరిత్రలో సంచలన రికార్డు.. ఒకేఒక రక్త పరీక్షతో 10 ఏళ్లకు ముందే ఒంట్లో క్యాన్సర్‌ గుర్తింపు

చాప కింద నీరులా ఏ మాత్రం లక్షణాలు కనిపించకుండా ప్రాణాలు హరించే మహమ్మారి క్యాన్సర్‌. అయితే దీనిని పదేళ్ల ముందే కనిపెట్టే కొత్తరకం బ్లడ్‌ టెస్ట్‌ను సైంటిస్టులు కనుగొన్నారు.


ముఖ్యంగా తల, మెడ క్యాన్సర్‌లను గుర్తించడంలో ఈ కొత్త రక్త పరీక్ష ఉపయోగపడుతుందని వీరు చెబుతున్నారు. ఈ మేరకు హార్వర్డ్-అనుబంధ మాస్ జనరల్ బ్రిఘం పరిశోధకులు చేపట్టిన అధ్యయనాన్ని జర్నల్ ఆఫ్ ది నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్‌లో తాజాగా ప్రచురించారు. క్యాన్సర్‌లను ముందుగానే కనిపెట్టడం ద్వారా త్వరతిగతిన చికిత్స అందించి, ప్రాణాలను కాపాడవచ్చని ఇందులో పేర్కొన్నారు. అమెరికాలో వచ్చే తల, మెడ క్యాన్సర్లలో 70 శాతం హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV) కారణమని వెల్లడించారు. ఈ వైరస్ వల్ల కలిగే అత్యంత సాధారణ క్యాన్సర్ ఇదేనని వీరి అధ్యయనంలో తేలింది. అయితే ఇప్పటికే వరకు HPV-సంబంధిత తల, మెడ క్యాన్సర్లకు గుర్తించే స్క్రీనింగ్ పరీక్ష అందుబాటులో లేదు.

ఈ సమస్యను పరిష్కరించడానికి HPV-DeepSeek అనే కొత్త లిక్విడ్‌ బయాప్సీ టెస్ట్‌ను సైంటిస్ట్‌లు అభివృద్ధి చేశారు. ఇది ఒంట్లో క్యాన్సర్ లక్షణాలు అభివృద్ధి చెందకముందే HPV- సంబంధిత తల, మెడ క్యాన్సర్‌లను ముందుగానే గుర్తిస్తుంది. క్యాన్సర్ నిర్ధారణకు 10 ఏళ్ల ముందే ముందే ఏ మాత్రం లక్షణాలు కనిపించని వ్యక్తులలో HPV- సంబంధిత క్యాన్సర్‌లను ఈ టెస్ట్‌ ఖచ్చితంగా గుర్తించగలదని వీరి అధ్యయనం మొదటిసారిగా వెల్లడించిందని హార్వర్డ్ మెడికల్ స్కూల్‌లో ఓటోలారిన్జాలజీ సర్జన్‌ డేనియల్ ఎల్ ఫాడెన్ తెలిపారు. క్యాన్సర్ లక్షణాలతో రోగులు తమ క్లినిక్‌లకు వచ్చే సమయానికి వారికి జీవితాంతం కొనసాగే ముఖ్యమైన దుష్ప్రభావాలను కలిగించే చికిత్సలు అవసరమవుతాయి. HPV-DeepSeek వంటి సాధనాలు ఈ క్యాన్సర్‌లను వాటి ప్రారంభ దశల్లోనే గుర్తించగలవు. ఇది రోగి జీవన నాణ్యతను మెరుగుపరుస్తుందని తాము ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.

వీరి పరిశోధనకు సుమారు 56 నమూనాలను పరీక్షించారు. 28 సంవత్సరాల తరువాత క్యాన్సర్ వచ్చిన వ్యక్తుల నుంచి, అలాగే 28 ఆరోగ్యకరమైన వ్యక్తుల నుంచి ఈ నమూనాలు సేకరించారు. క్యాన్సర్ వచ్చిన రోగుల నుంచి సేకరించిన 28 రక్త నమూనాలలో 22 మందిలో HPV కణితి DNA ను ఈ టెస్ట్‌ గుర్తించింది. అలాగే రోగికి నిర్ధారణ సమయానికి దగ్గరగా సేకరించిన నమూనాలకు రక్త నమూనాలలో HPV DNAను గుర్తించే పరీక్ష సామర్థ్యం ఎక్కువగా ఉంది. రోగ నిర్ధారణకు 7.8 సంవత్సరాల ముందు తీసుకున్న రక్త నమూనాలో తొలి సానుకూల ఫలితం వీరి పరిశోధనల్లో వెల్లడైంది. పరీక్ష సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి పరిశోధకులు మెషిన్ లెర్నింగ్‌ మోడన్‌ను ఉపయోగించారు. ఇది 28 క్యాన్సర్ కేసుల్లో 27 కేసులను ఖచ్చితంగా గుర్తించగలిగింది. వీటిలో రోగ నిర్ధారణకు పదేళ్లకు ముందు సేకరించిన నమూనాలు కూడా ఉన్నాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.