మనలో చాలా మంది ఏదో ఒక సమయంలో రుణాలు తీసుకున్నవాళ్లమే. తీసుకున్న రుణాలపై సాధారణంగా కొద్ది శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే, కొన్ని వడ్డీ లేని రుణాలు కూడా ఉన్నాయి. ఈ వడ్డీ లేని రుణాలు కొన్ని నిబంధనలతో కూడి ఉన్నప్పటికీ, జాగ్రత్తగా ఉపయోగించినప్పుడు వాటి ద్వారా గణనీయమైన ఆర్థిక సహాయాన్ని పొందొచ్చు. వడ్డీ లేకుండా రుణం పొందే అవకాశం కొంత అవాస్తవంగా అనిపించవచ్చు. అయినప్పటికీ, ఇలాంటివి అందుబాటులో ఉన్న ప్రత్యేక పరిస్థితులు ఈనాడు ఉన్నాయి. ఈ రుణాలు నిర్దిష్ట ప్రయోజనాల కోసం లేదా కొంత మంది కోసం ఉద్దేశించబడినవి. ఇటువంటి రుణాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
క్రెడిట్ కార్డులపై
ప్రస్తుతం భారత్‌లో క్రెడిట్ కార్డులు వినియోగించే వారి సంఖ్య కోట్లలో ఉంది. ఈ కార్డులను వినియోగించేవారు తమ దగ్గర నగదు లేకుండానే కార్డు పరిమితి మేరకు అనేక సేవలతో పాటు వస్తువులను కూడా కొనుగోలు చేయొచ్చు. దీనికి అప్పటికప్పుడు నగదు చెల్లించనక్కర్లేదు. కాబట్టి, ఇది కూడా ఒక వడ్డీ లేని రుణమే. దీనిపై గరిష్ఠంగా 50 రోజుల వరకు గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఈ గ్రేస్ పీరియడ్ తరువాత కూడా చెల్లించకపోతే జరిమానాలు భారీగా ఉంటాయి. గడువు తేది లోపులో చెల్లిస్తే జీరో వడ్డినే అని చెప్పొచ్చు.
నో-కాస్ట్ ఈఎంఐ
రిటైల్ రంగంలో వడ్డీ లేని రుణాలు ప్రసిద్ధి చెందాయి. అనేక కంపెనీలు, బ్యాంకులు..ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్ లేదా ఇతర ఉపకరణాలపై నో-కాస్ట్ EMIలను అందిస్తున్నాయి. అదనంగా వడ్డీ చెల్లించకుండా మొత్తం ఖర్చును సమాన నెలవారీ వాయిదా(EMI)లుగా విభజించడానికి ఈ పథకాలు మిమ్మల్ని అనుమతిస్తాయి. ఉదాహరణకు, రూ.60,000 ఖరీదు చేసే స్మార్ట్‌ఫోన్/లాప్‌టాప్ వంటి వాటిని 8 నెలల్లో నెలకు రూ.7,500 చెల్లించడం ద్వారా కొనుగోలు చేయవచ్చు. వాయిదాలు వడ్డీ లేకుండా ఉన్నప్పటికీ, కొన్ని ఆఫర్‌లలో ప్రాసెసింగ్ రుసుము ఉండవచ్చు. అయితే, మీరు నిజంగా సున్నా-వడ్డీ ఒప్పందాన్ని పొందుతున్నారని నిర్ధారించుకోవడానికి ఇలాంటి చోట దాచిన ఛార్జీలను తనిఖీ చేయడం చాలా ముఖ్యం.
ముఖ్యంగా, పండుగ అమ్మకాల సమయంలో..ప్రధాన రిటైల్, ఇ-కామర్స్ ప్లాట్‌ఫాంలలో నో-కాస్ట్ EMIలు విస్తృతంగా అందుబాటులో ఉన్నాయి. చాలా మంది రిటైలర్లు..ఎలక్ట్రానిక్స్, ఉపకరణాలు, ఫర్నిచర్ అమ్మే రిటైలర్లు ప్రమోషనల్ డీల్‌గా వడ్డీ లేని వాయిదాలను అందిస్తారు. ఈ రుణాలు సాధారణంగా స్వల్పకాలిక కాలవ్యవధి(6-24 నెలలు) కలిగి ఉంటాయి. ఇవి NBFCలు లేదా బ్యాంకులతో భాగస్వామ్య ఒప్పందాల ద్వారా అందుబాటులో ఉంటాయి. కొన్ని క్రెడిట్ కార్డు కంపెనీలు ఇలాంటి నో-కాస్ట్ ఈఎంఐలపై అదనపు ఆఫర్లు కూడా అందిస్తాయి.
రైతులకు రుణాలు
రైతులు కొన్ని ప్రభుత్వ పథకాల కింద వడ్డీ లేని రుణాలను పొందవచ్చు. ఇవి వ్యవసాయం, సంబంధిత కార్యకలాపాల ఉపయోగానికి రూపొందించబడినవి. రైతులు..విత్తనాలు, ఎరువులు లేదా పరికరాలను కొనుగోలు చేయడానికి నిధులను ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వడ్డీ లేకుండా రుణాలను అందిస్తున్నాయి. అయితే, ఇటువంటి రుణాలను గడువులోపు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. చెల్లించకపోతే తగిన జరిమానా తప్పదు. ఈ రుణాల ఉద్దేశం రైతులపై ఆర్థిక భారాన్ని తగ్గించడం, వ్యవసాయ ఉత్పాదకతను ప్రోత్సహించడం. అయితే, రైతులు ఈ పథకాల కింద అర్హత ప్రమాణాలు, EMI చెల్లించే పరిస్థితులను తనిఖీ చేయాలి.
కంపెనీ ద్వారా
కొన్ని కంపెనీలు ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను కాపాడడానికి వడ్డీ లేని రుణాలను అందిస్తుంటాయి. ఈ రుణాలు ఉద్యోగుల గృహనిర్మాణం, విద్య లేదా అత్యవసర పరిస్థితులు వంటి వ్యక్తిగత ఖర్చులను నిర్వహించడంలో సహాయపడతాయి. ఈ రుణంపై అసలు మొత్తాన్ని నేరుగా ఉద్యోగి జీతం నుంచి నిర్ణీత వ్యవధిలో సంస్థ ఉపసంహరించుకుంటుంది. ఇటువంటి రుణాలపై వడ్డీ ఉండకపోయినా, అవి నిర్దిష్ట మొత్తాలు లేదా ప్రయోజనాలకే పరిమితం కావచ్చు.
ఎన్‌జీఓల ద్వారా
కొన్ని మైక్రోఫైనాన్స్ సంస్థలు, NGOలు సామాజిక అభివృద్ధి కార్యక్రమాల కోసం వడ్డీ లేని రుణాలను అందిస్తాయి. ఇవి వెనుకబడిన సంఘాలు, చిన్న వ్యవస్థాపకులు లేదా మహిళలను లక్ష్యంగా చేసుకుని ఉంటాయి. ఉదాహరణకు, కొన్ని NGOలు విద్య లేదా చిన్న వ్యాపారాలు చేసేవారికి, వీధి వ్యాపారాలు చేసేవారికి సున్నా లేదా కనీస వడ్డీ రేటుకు కూడా రుణాలు ఇస్తుంటాయి.
విద్య
ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వ లేదా ప్రైవేట్ కార్యక్రమాల ద్వారా విద్యా రుణాలు పొందే అవకాశం ఉంటుంది. కోర్సు కాలవ్యవధిలో చెల్లింపు నిబంధనలపై సడలింపు ఉంటుంది. ఈ రుణాన్ని గ్రాడ్యుయేషన్ తర్వాత సకాలంలో తిరిగి చెల్లించాలి. చిన్న స్థాయిలో వ్యాపారాలు ప్రారంభించేవారికే కాకుండా, విద్య కోసం భారత ప్రభుత్వం వివిధ రకాల వడ్డీ లేని రుణాలను అందిస్తుంటుంది.
































