మీ పుట్టిన తేదీకి, పేరు వివరాలకు పదో తరగతి సర్టిఫికెట్ చాలా ముఖ్యం. కొన్నిసార్లు ఈ సర్టిఫికెట్‌లో చిన్న చిన్న తప్పులు ముద్రితమవుతుంటాయి. అలాంటి తప్పులను ఎలా సరిదిద్దుకోవాలో, ఏం చేయాలో ఇక్కడ చాలా సులభంగా తెలుసుకుందాం.
పదో తరగతి సర్టిఫికెట్‌లో మీ పుట్టిన తేదీ (DOB) తప్పుగా ఉంటే, దాన్ని సరిదిద్దుకోవడానికి ఒక పద్ధతి ఉంటుంది. అయితే.. మీరు టెన్త్ పాసైన మూడేళ్లలోపు మాత్రమే ఈ మార్పు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
మార్పు ప్రక్రియ ఇలా ఉంటుంది..
ముందుగా, మీరు టెన్త్ చదివిన స్కూల్ రికార్డులలో (రిజిస్టర్‌లో) పుట్టిన తేదీ ఎలా ఉందో చూస్తారు. సర్టిఫికెట్‌లో ఉన్న తేదీకి, స్కూల్ రిజిస్టర్‌లో ఉన్న తేదీకి తేడా ఉంటేనే మార్పు చేస్తారు. మీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు (Head Master) సంతకం చేసి, ధ్రువీకరణ పత్రాన్ని ఇవ్వాలి. ఆ దరఖాస్తును మొదట ఎంఈఓ (MEO), ఆ తర్వాత డీఈఓ (DEO), చివరగా డీఎస్‌ఈ (DSE – డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్) కార్యాలయానికి పంపాలి. డీఎస్‌ఈ అంగీకరిస్తే.. ఎస్‌ఎస్‌సీ బోర్డు అధికారులు తేదీని మార్చి మీకు కొత్త సర్టిఫికెట్‌ను ఇస్తారు. దీనికి ఎటువంటి ఫీజూ చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రతి సంవత్సరం సుమారు 1,000 నుంచి 1,500 మంది విద్యార్థులు పుట్టిన తేదీ తప్పుగా ముద్రించబడిందని డీఎస్‌ఈ కార్యాలయానికి వస్తుంటారని అధికారులు తెలిపారు.
మీ పేరు, మీ తల్లిదండ్రుల పేర్లలో చిన్న చిన్న స్పెల్లింగ్ తప్పులు లేదా ఇతర మైనర్ పొరపాట్లు ఉంటే.. వాటిని సరిచేయడం సులభం. సాధారణ స్పెల్లింగ్ తప్పులు ఉంటే.. ఎస్‌ఎస్‌సీ బోర్డు అధికారులే నేరుగా సరిచేస్తారు. దీనికి కూడా ఫీజు ఉండదు. ఇంటి పేరు లేదా మీ పేరు, తల్లిదండ్రుల పేర్లు పూర్తిగా మారిపోతే దరఖాస్తును మళ్లీ హెచ్‌ఎం, ఎంఈఓ, డీఈఓ ద్వారా డీఎస్‌ఈకి పంపాలి. వారు పరిశీలించి బోర్డుకు పంపిస్తారు.
మీ ఒరిజినల్ టెన్త్ సర్టిఫికెట్ పోగొట్టుకుంటే లేదా దొరకకపోతే.. డూప్లికేట్ సర్టిఫికెట్ పొందడానికి ఏం చేయాలటే.. ముందుగా సర్టిఫికెట్ పోయినట్లుగా మీ సేవ కేంద్రం ద్వారా స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. పోలీసులు ఇచ్చే ధ్రువపత్రాన్ని తీసుకోవాలి. ‘గవర్నమెంట్ ఆఫ్ ట్రెజరీ’ పేరుతో బ్యాంకులో రూ. 250 మొత్తాన్ని చలానా రూపంలో కట్టాలి. సర్టిఫికెట్ పోయింది, ఎక్కడా దొరకలేదు, ఒకవేళ దొరికినా దాన్ని బోర్డుకు అప్పగిస్తాను అని హామీ ఇస్తూ.. రూ. 50 స్టాంప్ పేపర్‌పై నోటరీ అఫిడవిట్ తీసుకోవాలి. ఈ ధ్రువపత్రాలన్నిటినీ జత చేసి.. మీ స్కూల్ హెచ్‌ఎం ధ్రువీకరణతో ఎస్‌ఎస్‌సీ బోర్డుకు దరఖాస్తు చేసుకోవాలి. ఈ నియమాలన్నిటినీ సరిగ్గా పాటిస్తే.. మీ టెన్త్ సర్టిఫికెట్‌కు సంబంధించిన ఎలాంటి సమస్య అయినా పరిష్కారం అవుతుంది.
































