లీటర్‌ పెట్రోల్‌కు 56 కి.మీ మైలేజ్ ఇచ్చే TVS కొత్త బైక్.. రోజు ప్రయాణాలు చేసే వారికి పర్ఫెక్ట్ రైడర్

దేశీయ టూ-వీలర్ రంగంలో అగ్రగామి సంస్థగా పేరుపొందిన టీవీఎస్ మోటార్ (Tvs Motor) కంపెనీ మరోసారి తన కొత్త ఆవిష్కరణతో బైక్ ప్రేమికులను ఆకట్టుకుంది.


ఈసారి కంపెనీ తన అత్యంత ప్రజాదరణ పొందిన TVS Raider మోడల్‌ను కొత్త రూపంలో, మరింత భద్రతతో, ఆధునిక ఫీచర్లతో అందించింది. తాజాగా కంపెనీ భారత మార్కెట్లోకి TVS Raider Dual Disc Brake (టీవీఎస్ రైడర్ డ్యూయల్ డిస్క్ బ్రేక్) వేరియంట్‌ను విడుదల చేసింది. ఈ కొత్త వెర్షన్ డిజైన్ పరంగా, పనితీరు పరంగా, సేఫ్టీ పరంగా ఒక అడుగు ముందుకేసినట్లుగా చెప్పుకోవచ్చు. యువతను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ మోడల్ రైడింగ్ అనుభవాన్ని మరింత ఉత్సాహభరితంగా మార్చే విధంగా టీవీఎస్ ఇంజినీర్లు పలు మార్పులు చేశారు.

ముందూ, వెనుకా డ్యూయల్ డిస్క్ బ్రేక్ వ్యవస్థ ఉండటం వలన రోడ్డుపై భద్రతా ప్రమాణాలు గణనీయంగా పెరిగాయి. వేగంగా నడుస్తున్న సమయంలో కూడా స్థిరంగా బ్రేక్ చేయగల ఈ సిస్టమ్ రైడర్‌కు నమ్మకం, నియంత్రణ రెండింటినీ సమానంగా అందిస్తుంది. ఈ కొత్త Raider బైక్ స్పోర్టీ కమ్యూటర్ సెగ్మెంట్‌లో విప్లవాత్మకమైన రూపాన్ని సొంతం చేసుకోనుంది. పండుగల టైంలో ఈ బైక్ మెరుగైన అమ్మకాలను నమోదు చేసే అవకాశం ఉంది.

కొత్త Raider రెండు వేరియంట్లలో SXC DD (డ్యూయల్ డిస్క్), TFT DD (డ్యూయల్ డిస్క్)లలో అందుబాటులో ఉంది. వీటి ధరలు వరుసగా రూ.93,800, రూ.95,600 (ఎక్స్‌షోరూమ్)గా నిర్ణయించబడ్డాయి. ఈ ధర పరిధి చూసినప్పుడు, ఇది అన్ని వర్గాల వినియోగదారులకు సులభంగా అందుబాటులో ఉండేలా రూపొందించబడిందని స్పష్టమవుతుంది. ధర పరంగా అందుబాటులో ఉండి, ఫీచర్ల పరంగా మాత్రం ప్రీమియం ఫీలింగ్ ఇచ్చే బైక్‌గా ఇది నిలుస్తుంది.

టీవీఎస్ రైడర్ డ్యూయల్ డిస్క్ బ్రేక్ వేరియంట్ కేవలం స్పోర్టీ లుక్‌తోనే కాకుండా, అత్యాధునిక సాంకేతికత, శక్తివంతమైన ఇంజిన్ పనితీరుతో కూడా ఆకట్టుకుంటోంది. ముందుగా దాని డిజైన్ గురించి చెప్పాలంటే సొగసైన, అగ్రెసివ్ స్టైల్‌ను ప్రదర్శిస్తుంది. ముందుభాగంలో LED హెడ్‌ల్యాంప్‌లు, ఇంటిగ్రేటెడ్ LED DRLలు బైక్‌కు ఒక ఆధునిక, శార్ప్ లుక్‌ను ఇస్తాయి.

బలమైన ట్యాంక్ ష్రౌడ్స్, స్పోర్టీ గ్రాఫిక్స్, సొగసైన టెయిల్ డిజైన్ ఇవన్నీ కలిపి రైడర్‌ను తన క్లాస్‌లోనే అత్యంత స్టైలిష్ బైక్‌గా నిలబెడుతున్నాయి. ఇంజిన్ విభాగంలో చూస్తే, ఈ బైక్‌లో 124.8 సీసీ సింగిల్-సిలిండర్ ఎయిర్-కూల్డ్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 7,500 ఆర్‌పిఎమ్ వద్ద 11.2 బిహెచ్‌పీ పవర్, 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 11.75 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌ను 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేశారు.

ఇది గేర్ మార్పులను మృదువుగా, రైడింగ్ అనుభవాన్ని సజావుగా చేస్తుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఇది నిజంగా ఆశ్చర్యపరుస్తుంది. ఈ బైక్ 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 6.3 సెకన్లలో చేరుకోగలదు. గరిష్టంగా గంటకు 99 కిలోమీటర్ల వేగం అందించగల ఈ బైక్ స్పీడ్, కంట్రోల్ రెండింటినీ సమన్వయపరుస్తుంది. ఇక మైలేజ్ విషయానికి వస్తే ఈ బైక్ ఒక లీటర్ పెట్రోల్‌తో 56.7 కిలోమీటర్లు ప్రయాణించగలదు.

ఇది రోజువారీ ప్రయాణాలకు చాలా ఆర్థికంగా ఉండేలా రూపొందించబడింది. అంతేకాకుండా, ఇందులో ఉన్న గ్లైడ్ త్రూ టెక్నాలజీ (GTT) ట్రాఫిక్ పరిస్థితుల్లో బైక్‌ను సాఫీగా కదిలేలా చేయడమే కాకుండా ఇంధన సామర్థ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. దీనికి ముందు, వెనుక డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. దీనికి సింగిల్ ఛానల్ (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్) ఉంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.