ఏపీలో కొత్తగా మరో జాతీయ రహదారి విస్తరణ పనుల దిశగా కీలక అప్ డేట్ వచ్చింది. అనకాపల్లి నుంచి దివాన్ చెరువు వరకు నాలుగు వరుసల రహదారిని ఆరు వరుసలకు విస్తరించేందుకు డీపీఆర్ సిద్ధమైంది. ఈ మేరకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ డీపీఆర్ సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించింది. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే టెండర్ల ప్రక్రియ చేపట్టనున్నారు. రూ.3800 కోట్లతో 160 కిలోమీటర్ల మేరకు ఈ ప్రాజెక్టు చేపట్టనున్నారు. మరోవైపు విస్తరణలో భాగంగా పాత వంతెనల రిపేర్లు, కొత్త వంతెనలు, కల్వర్టులు, ఇతర నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఆంధ్రప్రదేశ్‌లో అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో వేగం పెరిగింది. పలు జాతీయ రహదారుల ప్రాజెక్టులు, రైల్వే ప్రాజెక్టుల నిర్మాణం దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఏపీలో మరో ఆరు వరుసల జాతీయ రహదారి నిర్మాణం దిశగా కీలక అప్‌డేట్ వచ్చింది. రాజమండ్రి సమీపంలోని దివాన్ చెరువు వద్ద నుంచి అనకాపల్లి వరకూ చేపట్టనున్న రహదారి ప్రాజెక్టుకు సంబంధించి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) సమగ్ర ప్రాజెక్టు నివేదికను సమర్పించింది. మొత్తం 160 కి.మీ.ల మేరకు ఈ రహదారి ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఈ డీపీఆర్‌ను ప్రభుత్వం ఆమోదించిన తర్వాత టెండర్ల ప్రక్రియను మొదలుపెట్టనున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా అనకాపల్లి జిల్లాలో నాలుగుచోట్ల నదులపై నాలుగు వంతెనలు, మూడు ఫ్లైఓవర్లు, మూడు రైలు-కమ్-రోడ్డు వంతెనలను నిర్మించాల్సి ఉంటుందని అధికారులు చెప్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూ.10,200 కోట్లతో కేంద్ర ప్రభుత్వం ఆప్సన్-4 (టీఓటీ) కింద జాతీయ రహదారుల అభివృద్ధి పనులు చేపట్టనుంది. అందులో భాగంగా అనకాపల్లి నుంచి రాజమండ్రి వరకూ16వ నంబరు జాతీయ రహదారి విస్తరణ పనులు చేపట్టనున్నారు. 160 కిలోమీటర్ల మేరకు నాలుగు వరుసలుగా ఉన్న ఈ రహదారిని.. ఆరు వరుసలుగా విస్తరించాలని నిర్ణయించారు. ఇందుకోసం రూ.3,800 కోట్లు అవసరం అవుతాయని ప్రాథమికంగా అంచనా వేశారు. ఆ మేరకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఇంజనీర్లు డీపీఆర్‌ను సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించారు.
అనకాపల్లిలోని డైట్ కళాశాల నుంచి ఈ ప్రాజెక్టు ప్రారంభం కానుంది. అక్కడి నుంచి నాలుగు వరుసలుగా ఉన్న అనకాపల్లి-అన్నవరం-దివాన్‌చెరువు మార్గాన్ని ఆరు వరుసలుగా విస్తరించనున్నారు. అనకాపల్లి జిల్లాలో 68,645 కిలోమీటర్లు, కాకినాడ జిల్లాలో 81 కిలోమీటర్లు మేరకు ఈ ప్రాజెక్టు డీపీఆర్ తయారు చేశారు.ఈ ప్రాజెక్టులో భాగంగా నాలుగుచోట్ల భారీ వంతెనలు, అనకాపల్లి పూడిమడక జంక్షన్, తాళ్లపాలెం జంక్షన్, రేగుపాలెం జంక్షన్ వద్ద ఫ్లై ఓవర్లు, బయ్యవరం, రేగుపాలెం, పాయకరావుపేట వద్ద రైల్-కమ్-రోడ్డు వంతెనలు నిర్మించనున్నారు.
17 చిన్న వంతెనలు, 86 శ్లాబ్ కల్వర్టులు, 76 పైపులైన్ కల్వర్టులు, 18 బాక్స్ కల్వర్టులు, 36 రిటైనింగ్ వాల్స్ నిర్మించాల్సి ఉంటుంది. అలాగే 47చోట్ల పాత బాక్స్ కల్వర్టులను పునర్నిర్మంచడంతో పాటుగా , 22చోట్ల పైపులైన్ కల్వర్టులు మళ్లీ నిర్మించాల్సి ఉంటుంది. అలాగే , 67 చోట్ల రోడ్డు ఫార్మేషన్ పనులు చేపట్టాలని డీపీఆర్‌లో పేర్కొన్నారు. ఈ రహదారి విస్తరణ పనులు పూర్తి అయితే అనకాపల్లి జిల్లా మరింత అభివృద్ధి చెందుతుందని స్థానికులు భావిస్తున్నారు.
































