విదేశాల్లో ఉన్నతవిద్యకు పావలా వడ్డీకే రుణం

విదేశాల్లో ఉన్నత విద్య చదవాలనుకునే విద్యార్థులకు ముఖ్యమంత్రి చంద్రబాబు వరం ప్రకటించారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే ప్రతి విద్యార్థికీ పావలా వడ్డీకే బ్యాంకు రుణాలు ఇచ్చేలా కొత్త పథకాన్ని రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి పరిమితీ లేకుండా, అన్ని వర్గాలకు చెందిన ఎంతమంది విద్యార్థులైనా చదువుకునే వీలుండాలని సూచించారు. దేశంలో ఐఐటీ, ఐఐఎం, నిట్‌ వంటి సంస్థల్లో ఉన్నతవిద్య చదివేవారికీ ఈ పథకాన్ని వర్తింపజేయాలని స్పష్టం చేశారు. 4% వడ్డీకే బ్యాంకురుణాలు ఇవ్వడంతోపాటు, దానికి ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుందని తెలిపారు. ఈ రుణాన్ని 14 ఏళ్లలో తిరిగి చెల్లించే వెసులుబాటు ఇస్తామని వెల్లడించారు. బీసీ విద్యార్థులకు జేఈఈ, నీట్‌లో శిక్షణ కోసం రాష్ట్రంలోని రెండు ప్రాంతాల్లో శిక్షణ కేంద్రాలను ఏర్పాటుచేయాలని అధికారులను ఆదేశించారు. సచివాలయంలో సోమవారం ఆయన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, దివ్యాంగ సంక్షేమశాఖలపై సమీక్షించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న వసతిగృహాలన్నింటినీ రెసిడెన్షియల్‌ పాఠశాలలుగా మార్చేందుకు అధ్యయనం చేయాలని, దీనిపై సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ‘దీనివల్ల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ  వసతిగృహాల్లో మౌలిక వసతులు, సౌకర్యాల కల్పనతో పాటు ఏడాదిలోగా మరమ్మతులు పూర్తిచేయాలి. గురుకులాల్లో పరిశుభ్రమైన పరిస్థితులు ఉండేలా చూడాలి. విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యమివ్వాలి. ప్రతి పేద విద్యార్థికీ నాణ్యమైన విద్య అందించాలనేది నా సంకల్పం. అధికారులు ఇందుకోసం కృషిచేయాలి’ అని స్పష్టం చేశారు.


  • నసనకోట, ఆత్మకూరు బీసీ బాలికల పాఠశాలలను రూ.2.65 కోట్లతో జూనియర్‌ కళాశాలగా ఉన్నతీకరించేందుకు అనుమతి.
  • తల్లికి వందనం పథకం నుంచి పాఠశాల నిర్వహణ నిధి, మరుగుదొడ్ల నిర్వహణ నిధికి నిధుల కేటాయింపు.
  • అన్ని రెసిడెన్షియల్‌ పాఠశాలలు, వసతిగృహాల్లో సౌరవిద్యుత్తు ఉత్పత్తికి చర్యలు.

అన్ని వర్గాలకూ సమన్యాయం జరిగేలా సంక్షేమ ఫలాలు

స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లకు న్యాయపరమైన ఆటంకాలేవీ తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. వెనుకబడిన వర్గాలను ఉన్నతస్థానానికి తీసుకెళ్లాలని, ప్రభుత్వం ఈ వర్గాలపై పెద్దఎత్తున ఖర్చుపెడుతున్నా ఫలితాలు ఆశించిన స్థాయిలో రావట్లేదని పేర్కొన్నారు. ఆదరణ-3 కింద ఇచ్చే పరికరాలు ఆధునికంగా, ఆయా కులవృత్తులకు ఉపయోగకరంగా ఉండాలని స్పష్టంచేశారు. అన్ని వర్గాలకూ సమన్యాయం చేసేలా, సంక్షేమ ఫలాలు అందరికీ దక్కేలా అధికార యంత్రాంగం చూడాలని, సంతృప్తిపరచాలని సీఎం సూచించారు.

  • ఇమామ్‌లు, మౌజమ్‌లకు బకాయిలు వెంటనే విడుదల చేయాలని స్పష్టీకరణ.
  • హజ్‌ యాత్రకు దరఖాస్తు గడువు పెంచేందుకు అవకాశం కల్పించాలని ఆదేశం.
  • రజకులకు గ్యాస్‌తో పనిచేసే ఇస్త్రీపెట్టెలు, రాయితీ సిలిండర్లు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలి. వెనుకబడిన వర్గాల ఆదాయార్జనకు కొత్త మార్గాలను అన్వేషించాలని సూచన.
  • మత్స్యకారులు సీవీడ్‌ లాంటి కొత్త ప్రత్యామ్నాయాలను ఎంచుకునేలా   ప్రోత్సహించాలి.
  • పురోగతిలో ఉన్న నెల్లూరు, ఏలూరు, కర్నూలు బీసీ భవనాల నిర్మాణం పూర్తిచేయాలి.
  • 64 కుల కార్పొరేషన్లలో అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాల్ని అధ్యయనం చేసేందుకు వర్క్‌షాప్‌ నిర్వహించాలి.
  • సమీక్ష సందర్భంగా గత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద చెల్లించాల్సిన రూ.1,700 కోట్లు చెల్లించకపోవడంతో విద్యార్థులే రూ.900 కోట్లు చెల్లించారని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఇంకా యాజమాన్యాలకు సుమారు రూ.800 కోట్లు చెల్లించాల్సి ఉందని వివరించారు.
  • బీసీ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో చదివి, ట్రిపుల్‌ ఐటీకి ఎంపికైన విద్యార్థులను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు.
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.