జనవరి 1 నాటికి చెత్త రహితంగా ఏపీ

వచ్చే జనవరి 1 నాటికి ఏపీని చెత్త రహిత (జీరో వేస్ట్‌) రాష్ట్రంలా తీర్చిదిద్దడమే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌ పేరుతో సైనికులు ఉగ్రవాదులను ఏరి పారేసినట్లుగా .. చెత్తను తొలగించి సమాజాన్ని రక్షించే బాధ్యత పారిశుద్ధ్య కార్మికులు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సోమవారం నిర్వహించిన స్వచ్ఛాంధ్ర అవార్డుల ప్రదానోత్సంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. ‘మహాత్ముడు స్వచ్ఛతను దైవత్వంతో పోల్చారు. మన ఇళ్లు, మన ఊరు, మన వీధులను నిరంతరం శుభ్రంగా ఉంచుతున్న పారిశుద్ధ్య కార్మికులకు వందనం. ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పని చేస్తున్న వారు కూడా వీరులే. వారు లేకపోతే స్వచ్ఛ ఉద్యమమే లేదు. వాళ్లు దేవుడితో సమానం. కార్మికులందరికీ శిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తున్నా’ అని సీఎం అన్నారు.


పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత కావాలి

‘నేను చాలా పనులు చేశాను. నాకు ఆనందం కలిగించేవి మాత్రం పరిశుభ్రత, పచ్చదనమే. నేను సీఎం అయ్యాక 1998లో పచ్చదనం-పరిశుభ్రత కార్యక్రమాన్ని ప్రారంభించా. దేశంలో ఏ రాష్ట్రంలోనూ అప్పట్లో ఈ కార్యక్రమం ప్రారంభించలేదు. సింగపూర్‌ వెళ్లి అక్కడ వ్యర్థాలు ఏం చేస్తున్నారో తెలుసుకునేందుకు ఒక రాత్రంతా అధ్యయనం చేసి హైదరాబాద్‌లో మొదటిసారి నైట్‌ శానిటేషన్‌ ప్రారంభించా. చెత్త కాలువల్లో వేయకుండా మెస్‌లు కూడా పెట్టించా. ఆ తరువాతే హైదరాబాద్‌ అత్యంత పరిశుభ్రమైన నగరంగా గుర్తింపు పొందింది. పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత కావాలి.స్వచ్ఛ అవార్డులు ప్రతి ఏటా అందజేయనున్నాం. గత పాలకులు చెత్త పన్ను వేస్తే ..మేము చెత్త నుంచి సంపద సృష్టిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 85 లక్షల మెట్రిక్‌ పన్నుల వ్యర్థాలను 15 నెలల్లో రికార్డు స్థాయిలో తొలగించాం. ఈ విషయంలో పురపాలకశాఖ మంత్రి నారాయణ, ఆశాఖ అధికారులను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. అదనంగా గుర్తించిన మరో 30 లక్షల మెట్రిక్‌ టన్నుల వ్యర్థాలు కూడా డిసెంబరు నెలాఖరుకి తొలగించాలి’ అని సీఎం అన్నారు.

సర్క్యులర్‌ ఎకానమీతో కొత్త విప్లవం

‘అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఇందులో భాగంగానే ప్రారంభించిన సర్క్యులర్‌ ఎకానమీ కొత్త విప్లవం కానుంది. సర్క్యులర్‌ పార్కులు కూడా ఏర్పాటు చేస్తున్నాం. దీని ద్వారా ఘన వ్యర్థాలు, పాడైన ప్లాస్టిక్‌ వస్తువులు, ఈ-వ్యర్థాలకు శాశ్వత పరిష్కారం లభించనుంది. డబ్బులు, పదవులు, విలాసాలు కాదు…మంచి ఆరోగ్యం కావాలి. స్వాతంత్య్రం కంటే స్వచ్ఛత ముఖ్యమన్న మహాత్మాగాంధీ మాటలు ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలి’ అని సీఎం చంద్రబాబు అన్నారు.

పారిశుద్ధ్య కార్మికులకు ప్రమాద బీమా రూ.కోటి

‘పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. యాక్సిస్‌ బ్యాంకు ద్వారా రూ.కోటి ప్రమాద బీమా కల్పించాం. ప్రమాదవశాత్తు వైకల్యానికి గురైతే అలాంటి వారికి బృంద ప్రమాద బీమా అమలు చేస్తున్నాం. అర్హులందరికీ సంక్షేమం అందేలా చర్యలు తీసుకుంటున్నాం’ అని సీఎం వివరించారు. ‘గుంతలు లేని విజయవాడను చూస్తుంటే ఆనందంగా ఉంది. రాష్ట్రంలో 13,500 గ్రామాలను డిసెంబరు నాటికి ఓడీఎఫ్‌-ప్లస్‌గా ప్రకటించేలా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ బాధ్యత తీసుకోవాలి’ అని చంద్రబాబు అన్నారు. సమావేశంలో పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్‌కుమార్, స్వచ్ఛాంధ్ర సంస్థ ఛైర్మన్‌ పట్టాభిరామ్‌ మాట్లాడారు. సమాచార, పౌరసంబంధాలశాఖ మంత్రి కె.పార్థసారధి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్‌ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.