భారతదేశం అంతటా నేషనల్ హైవేస్, ఎక్స్ప్రెస్వేస్లలో సుమారు 1,150 టోల్ ప్లాజాల వద్ద NHAI కొత్తగా ‘FASTag Annual Pass’ సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది.
ఈ సౌకర్యం ప్రారంభమైన వెంటనే 1.4 లక్షల వినియోగదారులు దాన్ని కొనుగోలు చేసి రికార్డు సృష్టించారు. అయితే మరోవైపు నాన్-FASTag వాహనాలకు నవంబర్ నెల నుంచి 1.25 రెట్లు టోల్ ఫీజు విధించబోతున్నట్లు అధికారులు ప్రకటించారు.
ఇప్పటికే నాన్-FASTag వాహనాల యజమానులు, ముఖ్యంగా UPI లేదా ఇతర డిజిటల్ పేమెంట్ల ద్వారా టోల్ చెల్లించేవారు కాస్త ఇబ్బందిలో ఉండేవారు. ఇప్పటి వరకు క్యాష్ ద్వారా టోల్ చెల్లిస్తే రెండు రెట్లు ఫీజు విధించబడుతుంది. అయితే నవంబర్ 15, 2025 నుండి కొత్త విధానం ప్రకారం.. డిజిటల్ పేమెంట్లను ఉపయోగించే నాన్-FASTag వాహనాలు అసలు టోల్ ధర కంటే 1.25 రెట్లు మాత్రమే చెల్లించవలసి ఉంటుంది. ఇది ఆర్థిక ఒత్తిడిని తగ్గించి, డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తుంది.
ఉదాహరణకు ఒక వాహనం FASTag ద్వారా 100 రూపాయల టోల్ చెల్లించాల్సి ఉంటే.. క్యాష్ ద్వారా చెల్లిస్తే 200 రూపాయలు, అదే UPI ద్వారా చెల్లిస్తే 125 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. ఈ మార్పు ప్రధానంగా ఫీజు వసూలు విధానాన్ని మరింత క్రమపద్ధతిగా మార్చడం, టోల్ సేకరణలో పారదర్శకత పెంచడం, అలాగే నేషనల్ హైవే వినియోగదారుల కోసం సౌకర్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా తీసుకవచ్చారు. ఈ మార్పు నవంబర్ 15, 2025 నుండి అధికారికంగా అమలు కాబోతుంది.
































