ఉమ్మడి చిత్తూరు జిల్లా తిరుపతిలోని మోహన్‌బాబు యూనివర్సిటీ(ఎంబీయూ) మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. నిబంధనలను తుంగలో తొక్కి విద్యార్థుల నుంచి అదనపు ఫీజులు వసూలు చేయడంతో ఈ దుస్థితి ఏర్పడింది.
ఉమ్మడి చిత్తూరు జిల్లా తిరుపతిలోని మోహన్‌బాబు యూనివర్సిటీ(ఎంబీయూ) మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. నిబంధనలను తుంగలో తొక్కి విద్యార్థుల నుంచి అదనపు ఫీజులు వసూలు చేయడంతో ఈ దుస్థితి ఏర్పడింది. వాస్తవానికి ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులు కాకుండా యూనివర్సిటీ విద్యార్థుల నుంచి ఏకంగా రూ.26 కోట్లు అదనంగా వసూలు చేసింది. దీంతో సదరు విశ్వవిద్యాలయం గుర్తింపును రద్దు చేయాలని ఏపీ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ సిఫారసు చేసింది. ఈ మేరకు మంగళవారం సంచలన ఉత్తర్వులు జారీచేసింది. గుర్తింపు రద్దు కోసం యూజీసీ, ఏఐసీటీఈ, ఇతర సంస్థలను కోరాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. అలాగే యూనివర్సిటీ గుర్తింపును తక్షణం ఉపసంహరించుకోవాలని కీలక ప్రతిపాదన చేసింది. దీంతో భవిష్యత్తులో యూనివర్సిటీ ఉంటుందా? ఉండదా? అనే సందేహాలు తెరమీదికొచ్చాయి. ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై దాని భవితవ్యం ఆధారపడింది.
గతేడాది ఫిర్యాదు
ఎంబీయూలో అదనపు ఫీజులు వసూలు చేస్తున్నారంటూ ఏపీ పేరెంట్స్ అసోసియేషన్ 2024, అక్టోబరులోనే ఉన్నత విద్యా కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు కంటే ఎక్కువ తీసుకుంటున్నారని, చివరకు డేస్కాలర్స్ (రోజూ ఇంటి నుంచి కాలేజీకి వచ్చే విద్యార్థులు) నుంచి కూడా మెస్ చార్జీలు కట్టించుకుంటున్నారని ఫిర్యాదులో పేర్కొంది. కమిషన్‌తో పాటు విద్యాశాఖ మంత్రి లోకేశ్‌కు కూడా ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో స్పందించిన ముఖ్యమంత్రి కార్యాలయం.. ఈ వ్యవహారంపై విచారణ చేయాలని ఉన్నత విద్యాశాఖను కోరింది. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యా కమిషన్‌లోని ముగ్గురు సభ్యుల కమిటీ గతేడాది డిసెంబరు నుంచి పలు దఫాలుగా యూనివర్సిటీలో ఆకస్మిక తనిఖీలు చేపట్టి కమిషన్‌కు సవివర నివేదిక సమర్పించింది.
వారికి ఇష్టమై కట్టారు: వితండవాదం!
విద్యార్థుల నుంచి అదనపు ఫీజులను వసూలు చేసిన ఎంబీయూ.. దీనిని సమర్థించేందుకు వితండ వాదం చేసింది. విద్యార్థులు స్వచ్ఛందంగా అధిక ఫీజులు చెల్లించారని పేర్కొంది. ఇక, యూనివర్సిటీ వసూళ్ల పర్వం ఆధారంగా ఈ ఏడాది జనవరిలోనే ఉన్నత విద్యా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఉల్లంఘనలకు పాల్పడినందుకు రూ.15 లక్షలు జరిమానా ఎందుకు విధించకూడదో చెప్పాలని నోటీసుల్లో ఆదేశించింది. అనంతరం పలుమార్లు యూనివర్సిటీ ప్రతినిధులు కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. వర్సిటీ అధికారులు ఇచ్చిన వివరణ పరస్పర విరుద్ధంగా ఉన్నట్లు కమిషన్ భావించింది. అదనంగా వసూలు చేసిన రూ.26.17 కోట్లను విద్యార్థులకు తిరిగి చెల్లించాలని కమిషన్ గతంలోనే ఆదేశించినా యూనివర్సిటీ పట్టించుకోలేదు.
ఐటీ శాఖకు చెప్పండి!
ఈ నేపథ్యంలో యూనివర్సిటీ వసూలుచేసిన మొత్తం అదనపు ఫీజులు వెనక్కి ఇవ్వడంతో పాటు రూ.15 లక్షలు జరిమానా చెల్లించాలని ఉన్నత విద్య కమిషన్ కొద్దిరోజుల కిందట ఉత్తర్వులు జారీ చేసింది. 15 రోజుల్లోనే విద్యార్థులకు రూ.26.17 కోట్లు తిరిగి ఇవ్వాలని స్పష్టం చేసింది. అలాగే ఒరిజినల్ సర్టిఫికెట్లు వెంటనే విద్యార్థులు, ఫ్యాకల్టీకి తిరిగి ఇచ్చేయాలని ఆదేశించింది. కోర్సులకు అనుమతులు ఇచ్చే యూజీసీ, ఏఐసీటీఈ, పీసీఐ, ఐసీఏఆర్, ఎన్‌సీఏహెచ్‌పీలు మోహన్‌బాబు యూనివర్సిటీకి గుర్తింపు లేనట్లుగా భావించాలని, అలాగే ఏపీ ప్రభుత్వం కూడా యూనివర్సిటీ గుర్తింపును ఉపసంహరించుకోవాలని సిఫారసు చేసింది. ప్రస్తుతం వర్సిటీలో చదువుతున్న విద్యార్థుల కోసం సమీపంలోని శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీకి తాత్కాలిక బాధ్యతలు అప్పగించాలని సూచించింది. ఎంబీ యూ, శ్రీ విద్యానికేతన్ ట్రస్టు అక్రమాలపై ఐటీ శాఖకు సమాచారం ఇవ్వాలని సూచించింది. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం కూడా విచారణ చేసి అక్రమాల నిగ్గు తేల్చాలని సిఫారసు చేసింది.
పరువు పోతోంది: ఎంబీయూ
కమిషన్ ఉత్తర్వులపై ఎంబీయూ హైకోర్టును ఆశ్రయించింది. కాగా, ఈలోపే కమిషన్ విధించిన రూ.15 లక్షల జరిమానా చెల్లించింది. విద్యార్థులకు రూ.26కోట్లు తిరిగి చెల్లించడం, వర్సిటీ గుర్తింపు ఉపసంహరణ అంశాలపై న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీనిపై విచారణ కొనసాగుతోంది. అయితే, కమిషన్ ఆర్డర్ కాపీ అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయడంపై యూనివర్సిటీ ఆందోళన వ్యక్తం చేసింది. తమ పరువుకు నష్టం వాటిల్లుతోందని దానిని తొలగించాలని కమిషన్‌ను కోరింది. కమిషన్ అంగీకరించకపోవడంతో ఎంబీయూ కోర్టును ఆశ్రయించింది.
కమిటీ గుర్తించిన ఉల్లంఘనలు
- ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కంటే ఎంబీయూ ఎక్కువగా వసూలు చేస్తోంది. ఆడిట్ నివేదికలలోనూ ఇది రుజువైంది.
- విద్యార్థులు, ఫ్యాకల్టీకి ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధిస్తున్నారు. ఇది యూజీసీ నిబంధనలకు విరుద్ధం.
- విద్యార్థుల హాజరు నమోదులోనూ ఉల్లంఘనలు ఉన్నాయి.
- విద్యార్థులు తరగతులకు హాజరైనా కానట్లు చూపించి, వారి నుంచి రూ.7,500 చొప్పున అదనంగా వసూలు చేశారు.
- ఉన్నత విద్య కమిషన్‌కు సరైన సమాచారం ఇవ్వడం లేదు.
- వసూలు చేసిన ఫీజుల సమాచారం కమిషన్‌కు వెల్లడించలేదు.
ఇదీ.. అదనపు గిల్లుడు
- బీటెక్ విద్యార్థుల నుంచి రూ.5 వేల-రూ.45,500.
- డిగ్రీ, ఎమ్మెస్సీ, ఎంబీఏ, ఎంఏ విద్యార్థుల నుంచి రూ.18 వేల-రూ.25 వేలు.
- బీఫార్మసీ, ఫార్మా-డీ విద్యార్థుల నుంచి రూ.25 వేల-రూ.40 వేలు.
- బీఎస్సీ ఆనర్స్(అగ్రికల్చర్) విద్యార్థుల నుంచి రూ.22 వేల-రూ.33వేలు.
- పారామెడికల్, హెల్త్ కేర్ సైన్సెస్ విద్యార్థుల నుంచి రూ.40 వేల-రూ.45వేలు



































