Visakhapatnam: విశాఖకు రైడెన్‌

విశాఖ నగరానికి మరో ప్రతిష్ఠాత్మక ఐటీ సంస్థ రాబోతోంది. గూగుల్‌ అనుబంధ సంస్థ రైడెన్‌ ఇన్ఫోటెక్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.87,250 కోట్ల (10 బిలియన్‌ డాలర్లు) పెట్టుబడులతో 1,000 మెగావాట్ల ఏఐ పవర్‌ డేటా సెంటర్‌ ఏర్పాటు చేసేందుకు ఆసక్తి వ్యక్తం చేసింది. రెండున్నరేళ్లలో మొదటి దశ యూనిట్‌ను పూర్తి చేయనున్నట్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలను అందించింది. దీనిపై ఉన్నతస్థాయి అధికారుల బృందం చర్చిస్తున్నట్లు సమాచారం. ఆ సంస్థకు చెల్లించే ప్రోత్సాహకాలు, ఇతర అంశాలపై స్పష్టత రావాల్సి ఉందని తెలిసింది. గూగుల్‌ సంస్థ రూ.52 వేల కోట్ల పెట్టుబడులతో ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్‌ను విశాఖలో ఏర్పాటు చేయబోతోంది. సిఫీ సంస్థ రూ.16 వేల కోట్ల పెట్టుబడులతో డేటా సెంటర్‌ కాంప్లెక్స్‌ను విశాఖలో నెలకొల్పేందుకు ప్రభుత్వం ఇప్పటికే అనుమతించింది.


మూడు చోట్ల.. 480 ఎకరాలు!

  • ఉమ్మడి విశాఖ జిల్లాలో మూడు ప్రాంతాల్లో డేటా సెంటర్ల ఏర్పాటుకు రైడెన్‌ సంస్థ ప్రతిపాదించింది. అడవివరంలో 120, తర్లువాడలో 200, రాంబిల్లి అచ్యుతాపురం క్లస్టర్‌లో 160 ఎకరాల చొప్పున కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరింది. అనుమతులు వచ్చిన వెంటనే నిర్మాణాలు ప్రారంభించి, రెండున్నరేళ్లలో మొదటి దశ పనులు పూర్తి చేయనున్నట్లు పేర్కొంది. అన్ని అనుమతులు లభిస్తే, వచ్చే ఏడాది మార్చిలో నిర్మాణాలు చేపట్టి, 2028 జులై నాటికి కార్యకలాపాలు ప్రారంభించాలన్నది లక్ష్యంగా ప్రస్తావించింది.
  • ప్రతిపాదిత మూడు డేటా సెంటర్లకు కలిపి సుమారు 2,100 మెగావాట్ల విద్యుత్‌ అవసరం కానుంది. దీన్ని విద్యుత్‌ సంస్థల నుంచే తీసుకోనున్నట్లు రైడెన్‌ తెలిపింది. అడవివరంలో 465, తర్లువాడలో 929, రాంబిల్లి డేటా సెంటర్‌కు 697 మెగావాట్ల చొప్పున విద్యుత్‌ అవసరమని పేర్కొంది.
  • సింగపూర్‌కు చెందిన రైడెన్‌ ఏపీఏసీ ఇన్వెస్ట్‌మెంట్‌ హోల్డింగ్‌ కంపెనీ.. ‘రైడెన్‌ ఇన్ఫోటెక్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌’లో మెజారిటీ వాటాదారుగా ఉంది. అమెరికాకు చెందిన గూగుల్‌ ఎల్‌ఎల్‌సీకి అనుబంధ సంస్థగా రైడెన్‌ ఏపీఏసీ ఈ డేటా సెంటర్‌ పెట్టుబడులకు నిధులు సమకూర్చనుంది. నాస్‌డాక్‌ స్టాక్‌ మార్కెట్‌లో పబ్లిక్‌ లిమిటెడ్‌ కంపెనీల జాబితాలోనూ నమోదైనట్లు రైడెన్‌ సంస్థ ప్రభుత్వానికి తెలిపింది.
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.