మనదేశంలో ప్రకృతి ప్రసాదించిన ఆహారం ద్వారా ఆరోగ్యకరమైన జీవితాన్ని అనుభవిస్తాం. అలాగే అనారోగ్యానికి గురైనప్పుడు ప్రకృతి నుంచి వచ్చిన మూలికలను ఔషదాలుగా మార్చి స్వస్థత పొందుతాం. ఇటీవల కాలంలో మెడిసిన్స్ వాడుతున్నాం కానీ.. పూర్వకాలంలో అనారోగ్యానికి గురైనప్పుడు ఆయుర్వేదం ద్వారానే ఆరోగ్యాన్ని బాగు చేసుకునేవాళ్లం. కాలం మారుతున్నా కొద్దీ విదేశీ విధానాన్ని అవలంబిస్తూ మన ఇమ్యూనిటీని/రోగనిరోధక శక్తిని తగ్గించుకుంటూ వస్తున్నాం. అయితే ప్రకృతి ప్రసాదించిన చెట్లనుండి వచ్చిన పండ్లు, ఆకుల ద్వారా ఆరోగ్యాన్ని స్వస్థత చేసుకోవచ్చు. మచ్చుతునకగా జామపండు, జమ ఆకుల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
పేదవాడి యాపిల్‌గా పిలువబడే జామపండులో ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉంటాయి. విటమిన్ సి అత్యధికంగా కలిగిన ఈ పండు, తక్షణ శక్తిని ఇస్తుంది. జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. అలసటను తొలగించి శక్తివంతంగా చేస్తుంది. రోజుకు కనీసం ఒక్క జామపండు అయినా తిండే ఎలాంటి రోగాలు మన దరి చేరవని పెద్దలు చెబుతుండేవారు. మలబద్ధకం సమస్యతో బాధపడుతున్న వారు రోజుకు ఒక జామపండు తీసుకుంటే సమస్యను అధిగమించవచ్చు. ఇందులో ఉండే ఫైబర్ కడుపులోని పేగులను శుభ్రం చేయడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఎర్ర జామకాయలు జలుబు, ఫ్లూ వంటివి రాకుండా చేస్తాయి. అధిక రక్తపోటును నియంత్రించే కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఐరన్ లోపాన్ని తగ్గిస్తుంది. ఎర్ర జామపండును తీసుకోవడం ద్వారా శరీరంలో ఐరన్ స్థాయి పెరుగుతుంది. జామపండును రోజూ తింటే శరీరంలో ఐరన్ లోపాన్ని అధిగమించి ఆరోగ్యంగా ఉండవచ్చు.
జామ ఆకుల టీ..
జామ పండుతోనే కాకుండా జామ ఆకులతో కూడా అత్యంత ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. జామ ఆకుల కాషాయం ఆరోగ్యాన్ని కాపాడుతుంది. షుగర్ ఉన్నవాళ్లు జామాకుల కాషాయం తీసుకుంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉండే అవకాశం ఉంది. జామాకులలో ఉండే ఫైబర్, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు కడుపులో గ్యాస్, ఆమ్లత్వం, మలబద్ధకం సమస్యను తొలగించి ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఆహరం జీర్ణం కావాలంటే ఉదయం ఖాళీ కడుపుతో ఈ ఆకులను నమలడం వల్ల లేదా జామ ఆకుల టీని తాగాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఇన్సులిన్ సెన్సిటివిటీని జామాకులు మెరుగుపరుస్తాయి. రోజు తాగడం ద్వారా మెటబాలిజం మెరుగుపడుతుంది. బరువును నియంత్రించడంలో సహాయపడతాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని బలోపేతం చేస్తాయి. జామ ఆకులు తినడం వల్ల లేదా జామకుల టీని తాగడం వలన జలుబు, దగ్గు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. జామాకులను ఉదయం పూట నమలడం వల్ల చిగుళ్ల వాపు, పంటి నొప్పి తగ్గించుకోవచ్చు. నోటిలో ఉండే బ్యాక్టీరియాను జామాకుల్లోని ఔషధ గుణాలు నిర్మూలిస్తాయి. జామ ఆకులను నీటిలో మరిగించి, వడకట్టి గోరువెచ్చగా త్రాగాలి. లేదా తాజా జామ ఆకులను నీటిలో మరిగించి తేనె లేదా నిమ్మరసం కలిపి తాగాలి. ఎండిన ఆకులను పొడిగా చేసి గోరువెచ్చని నీటితో తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.
































