విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. ఉచితంగా ట్యాబ్‌లు ఇస్తున్న ప్రభుత్వం

విద్యార్థులకు ఉచిత ట్యాబ్‌లు అందించి, వారిలో సాంకేతిక నైపుణ్యాలు, డిజిటల్ అభ్యాసం పెంపొందించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.


ప్రభుత్వం విద్యారంగంలో మరో కీలక ముందడుగు వేసింది. టెక్నాలజీ ఆధారిత బోధనను మరింత విస్తరించేందుకు, ప్రభుత్వం ఇన్ఫోసిస్ సంస్థతో కలిసి ‘ఇన్ఫోసిస్ స్ప్రింగ్‌బోర్డ్’ (Infosys Springboard) కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రభుత్వ పాఠశాలల్లో 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఉచిత ట్యాబ్‌లు అందించి, వారిలో సాంకేతిక నైపుణ్యాలు, డిజిటల్ అభ్యాసం పెంపొందించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.

మంగళగిరి నుంచి ప్రారంభంఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి నియోజకవర్గంలో ఈ ప్రాజెక్ట్‌ను ప్రాయోగికంగా ప్రారంభించారు. ఈ నియోజకవర్గానికి మంత్రి నారా లోకేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రారంభ దశలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ (CSR) కింద ఇన్ఫోసిస్ సంస్థ 38 ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు మొత్తం 30 చొప్పున ట్యాబ్‌లను అందించింది. వీటితో విద్యార్థులు డిజిటల్ పద్ధతిలో పాఠాలు నేర్చుకునే అవకాశం పొందుతున్నారు.

ఉపాధ్యాయులకు డిజిటల్ శిక్షణవిద్యార్థులకు బోధించే ఉపాధ్యాయులకు కూడా డిజిటల్ బోధన పద్ధతులపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ప్రతి విద్యార్థి రోజుకు కనీసం ఒక గంట ట్యాబ్ వాడాలనే ప్రణాళిక సిద్ధమైంది. ప్రతి పాఠశాలలో కనీసం నాలుగు గంటలు ట్యాబ్‌లను వినియోగించేలా కార్యక్రమం రూపొందించారు. ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే, రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు కూడా విస్తరించనున్నట్లు ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది.

పాఠ్యాంశం, కంటెంట్‌ డిజైన్రాష్ట్ర ఎస్సీఈఆర్టీ (SCERT), సమగ్ర శిక్ష సంస్థలు కలిసి ఈ ట్యాబ్‌లలో ఉండే కంటెంట్‌ను రూపొందించాయి. గణితం, సైన్స్, ఆంగ్లం, జీవన నైపుణ్యాలు వంటి అంశాలను సులభంగా నేర్చుకునేలా వీడియో పాఠాలు, ప్రశ్నల రూపంలో రూపొందించారు. విద్యార్థులు పాఠం పూర్తయ్యాక ప్రశ్నలకు సమాధానం ఇవ్వగానే ఫలితం వెంటనే కనిపించే విధంగా సిస్టమ్‌ ఏర్పాటు చేశారు. ఇది విద్యార్థుల అభ్యాసాన్ని కొలిచే ఆధునిక పద్ధతిగా భావిస్తున్నారు.

ఇన్ఫోసిస్ పర్యవేక్షణ, అప్రెంటిస్‌షిప్ అవకాశాలుఇన్ఫోసిస్ సంస్థ ప్రత్యేక డిజిటల్ ప్లాట్‌ఫాం ద్వారా ఈ ట్యాబ్‌ల వినియోగాన్ని నిరంతరం పర్యవేక్షిస్తుంది. ప్రతి నెలా ట్యాబ్‌ల వినియోగంపై నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తుంది. విద్యార్థులు మరియు పాఠశాలలు చూపించే ప్రతిభ ఆధారంగా ఇన్ఫోసిస్ నుంచి ప్రశంసా పత్రాలు, ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారు. అంతేకాకుండా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సంస్థలో అప్రెంటిస్‌షిప్ అవకాశాలు కల్పించే అవకాశముందని అధికారులు తెలిపారు.

ఆధునిక విద్య వైపు అడుగులుడిజిటల్ ట్యాబ్‌ల వినియోగం ద్వారా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఆధునిక సాంకేతికతతో కూడిన విద్యను అనుభవించగలరని సమగ్ర శిక్షా అభియాన్ ఎస్పీడీ బి. శ్రీనివాసరావు తెలిపారు. గతంలో కూడా విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేసినప్పటికీ, అప్పట్లో ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేసింది. అయితే ఈసారి ప్రభుత్వం, ఇన్ఫోసిస్ సంస్థ భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం ప్రత్యేకతగా నిలిచింది.

ఈ కార్యక్రమం విజయవంతమైతే ఆంధ్రప్రదేశ్‌లో డిజిటల్ విద్యా విప్లవానికి దారితీస్తుందనే ఆశలు వ్యక్తమవుతున్నాయి. పాఠశాలల స్థాయిలోనే టెక్నాలజీ బోధనను ప్రవేశపెట్టడం ద్వారా భవిష్యత్‌లో విద్యార్థులు గ్లోబల్‌ టెక్‌ ప్రపంచానికి మరింత సన్నద్ధమవుతారని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.