బుర్ఖా, నిఖాబ్‌పై ఇటలీ బ్యాన్.. మెలోని సంచలనం

 ఇటలీ ప్రధాని జార్జియా మెలోని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆమె ప్రభుత్వం దేశవ్యాప్తంగా బుర్ఖా, నిఖాబ్‌లను నిషేధించే బిల్లును తీసుకువచ్చింది.


ప్రధాని మెలోని నేతృత్వంలోని ఇటలీ పాలక పార్టీ బుధవారం దేశ పార్లమెంటులో ముస్లిం మహిళలు దేశవ్యాప్తంగా అన్ని బహిరంగ ప్రదేశాల్లో తమ ముఖాలను, శరీరాలను కప్పి ఉంచే బుర్ఖాలు, నిఖాబ్‌లను ధరించడాన్ని నిషేధించే బిల్లును ప్రవేశపెట్టింది.

ఇటలీలో అధికార పార్టీ బ్రదర్స్ ఆఫ్ ఇటలీ, ఇస్లామిక్ వేర్పాటువాదాన్ని ఎదుర్కొనేందుకు ఈ బిల్లును తీసుకువచ్చినట్లు చెప్పింది. మెలోని ప్రభుత్వంలోని ముగ్గురు ఎంపీలు ఈ బిల్లును ప్రవేశపెట్టారు. దేశవ్యాప్తంగా అన్ని బహిరంగ ప్రదేశాలు, పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, దుకాణాలు, కార్యాలయాలలో ముఖం కప్పి ఉంచే దుస్తులను నిషేధించాలని పిలుపునిచ్చింది.

ఈ బిల్లును రూపొందించిన వారిలో ఒకరిగా భావిస్తున్న ఎంపీ ఆండ్రియా డెల్మాస్ట్రో బుధవారం సోషల్ మీడియా వేదికగా ఈ బిల్లు గురించి సమాచారాన్ని షేర్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. “మత స్వేచ్ఛ పవిత్రమైనది, కానీ దానిని బహిరంగంగా, మన రాజ్యాంగం, ఇటలీ సూత్రాల పట్ల పూర్తి గౌరవంతో ఉపయోగించుకోవాలి” అని అన్నారు. ఇస్లామిక్ ఫండమెంటలిజం వ్యాప్తి స్పష్టంగా ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని బలోపేతం చేయడానికి ఉపయోగపడుతోందని, ఈ బిల్లు మత తీవ్రవాదం, మతం ఆధారంగా ద్వేషాన్ని ఎదుర్కోవాల్సిన అవసరాన్ని ఈ బిల్లు పేర్కొంది.

ఎవరైన ఉల్లంఘనలకు పాల్పడితే 300-3000 యూరోలను జరిమానాగా విధిస్తారు. మన భారతీయ కరెన్సీలో రూ. 30,959 – రూ. 3,09,588. మతపరమైన ఒత్తిడితో బలవంతపు వివాహాలకు శిక్షలను మరింత కఠినం చేయాలని బిల్లు ప్రతిపాదిస్తోంది. ఈ బిల్లు ఇటాలియన్ మసీదుల నిధులను నియంత్రించాలని కూడా ప్రతిపాదించింది. దేశ ప్రాథమిక స్వేచ్చ, భద్రతకు విరుద్ధ భావజాలనున ప్రచారం చేసే వ్యక్తలను, సంస్థల నుంచి విరాళాలు స్వీకరించినట్లు తేలితే అన్ని ముస్లిం సంస్థలపై భారీ జరిమానా విధించబడుతుంది.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.