చింత గింజలు తింటే ఎన్ని లాభాలో తెలిస్తే.. అస్సలు వదిలిపెట్టరు

చింతపండును మనం రకరకాల వంటల్లో రెగ్యులర్ గా వాడుతూనే ఉంటాం. కానీ చింత గింజలను మాత్రం అంతగా తినం. కానీ చింత గింజల్లో ఉన్నఔషధగుణాలు తెలిస్తే.. ఒక్క గింజ కూడా పడేయకుండా తింటారు. మరి ఈ గింజలను తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందామా..

చింత గింజలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

చింతపండులో ఎన్ని ఔషధ గుణాలు ఉంటాయో.. చింత గింజల్లోనూ అదే స్థాయిలో ఉంటాయి. కానీ చాలామంది వీటి గురించి తెలియక పడేస్తుంటారు. లేదా కేజీల చొప్పున మార్కెట్లో అమ్మేస్తుంటారు. అసలు చింత గింజలు తినడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే.. ఒక్క గింజ కూడా పడేయరు.


చింత గింజలు ప్రోటీన్లు, ఫైబర్, కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్ల వంటి అనేక పోషకాలను కలిగి ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని ఇవ్వడంతో పాటు.. రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతాయి. అంతేకాదు చింత గింజలు అనేక ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. మరి ఈ గింజలను ఎలా తినాలి? ఎవరు తినాలి? ఎవరు తినకూడదో.. ఇక్కడ తెలుసుకుందాం.

మెరుగైన జీర్ణవ్యవస్థ

చింత గింజల్లో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. వీటిని తినడం ద్వారా అజీర్ణం, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాదు ఈ గింజల పొడి.. శరీరంలో వాపును తగ్గించే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. కీళ్ల వాపు, నొప్పి ఉన్నవారికి ఇది మంచి ఔషధంలా పనిచేస్తుంది.

గుండె ఆరోగ్యానికి..

చింత గింజల్లో ఉండే పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు రక్తనాళాల్లో ఒత్తిడిని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి. అంతేకాదు చింత గింజల్లో ఉండే విటమిన్ C, ఫ్లేవనాయిడ్లు శరీరాన్ని వైరస్‌లు, బ్యాక్టీరియా నుంచి కాపాడుతాయి. జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

చర్మ ఆరోగ్యానికి..

చింత గింజల్లో ఉండే హైల్ రోనిక్ యాసిడ్ చర్మానికి అవసరమైన తేమను అందిస్తుంది. చింత గింజల పొడిని పేస్ట్‌లా తయారు చేసి ముఖానికి అప్లై చేస్తే మొటిమలు తగ్గుతాయి. చర్మం మృదువుగా మారుతుంది. పిగ్మెంటేషన్ కూడా తగ్గుతుంది. చింత గింజల్లో ఉన్న యాంటీఆక్సిడెంట్లు చర్మంపై ముడతలు, వృద్ధాప్య లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి.

ఎలా వాడాలి?

చింత గింజలను ఎండబెట్టి, వేయించి పొడి చేసుకోవాలి. ఈ పొడిని రోజుకు 1/2 టీస్పూన్‌ మోతాదులో వేడి నీళ్లలో కలిపి తాగవచ్చు. లేదా తేనెతో కలిపి తీసుకోవచ్చు. అంతేకాదు ఈ పొడిని తులసి లేదా నీళ్లతో కలిపి ముఖానికి మాస్క్‌లా కూడా వేసుకోవచ్చు.

ఎవరు తినకూడదు?

చింత గింజలను అధిక మోతాదులో తీసుకుంటే అజీర్ణం లేదా గ్యాస్ సమస్యలు రావచ్చు. డయాబెటిస్ మందులు వాడుతున్న వారు ఈ గింజల పొడిని తీసుకునే ముందు డాక్టర్ సలహా తీసుకోవాలి. గర్భిణీలు లేదా పిల్లలు కూడా ఆరోగ్య నిపుణుల సలహా తీసుకున్న తర్వాత తినడం ఉత్తమం.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.