కూటమి సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా డీఎస్సీ నియామక ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే. ఇందులో ఎంపికై కొత్త టీచర్లందరూ అక్టోబర్ 14వ తేదీ నుంచి ఆయా జిల్లాల్లోని బడులకు విధుల్లో చేరనున్నారు.
ఇక డీఎస్సీలో ఉద్యోగం పొందలేని వారు నిరాశ చెందకుండా మళ్లీ ప్రిపరేషన్ సాగించాలని, వచ్చే ఏడాది జనవరిలో కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తామని ఇప్పటికే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటన వెలువరించారు. అంతకంటే ముందు నవంబర్‌లో మరోమారు టెట్ నిర్వహించేందుకు సర్కార్ సిద్ధమవుతోంది. ఈ క్రమంలో నవంబరు చివరివారంలో టెట్, 2026 జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు మంత్రి లోకేశ్ ప్రకటించారు.
ఇక వచ్చే ఏడాది మార్చిలోనే డీఎస్సీతోపాటు స్పెషల్ డీఎస్సీ పరీక్షలు కూడా నిర్వహించనున్నట్లు సమాచారం. స్పెషల్ డీఎస్సీలో మొత్తం 2,260 పోస్టులకు ఇప్పటికే ఆర్థికశాఖ నుంచి అనుమతి లభించింది. దీంతో టెట్, డీఎస్సీలకు అభ్యర్థులంతా సన్నద్ధం కావాలని అధికారులు సూచిస్తున్నారు. అలాగే వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి కొత్త టీచర్లు విధుల్లో చేరేలా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
అక్టోబర్ 24 నుంచి తెలంగాణ పాఠశాలల్లో ఎస్‌ఏ 1 పరీక్షలు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు అక్టోబరు 24 నుంచి సమ్మేటివ్ అసెస్‌మెంట్ (ఎస్‌ఏ-1) పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలు అక్టోబర్ 31వ తేదీ వరకు జరగనున్నట్లు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్ నికోలస్ పరీక్షల టైం టేబుల్‌ను జారీ చేశారు. ఇక ఫలితాలను నవంబరు 3 నాటికి ప్రకటించనున్నట్లు తెలిపారు. ఇక నవంబరు 15న తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించాలని ఆయన డీఈఓలను ఆదేశించారు.
































