భారతీయ IT ఉద్యోగులకి పెద్ద షాక్… అమెరికాలో కొత్త H-1B ఉద్యోగులను ఇక తీసుకోము అంటున్న TCS

మెరికాలో H-1B వీసా మీద ఉద్యోగులను ఎక్కువగా నియమించుకునే కంపెనీ ఏదంటే అది టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS). కానీ ఇప్పుడు TCS ఒక కీలక నిర్ణయం తీసుకుంది.


ఇకపై అమెరికాలో కొత్త H-1B వీసా హోల్డర్లను నియమించబోమని కంపెనీ CEO కే. కృతివాసన్ స్పష్టంగా తెలిపారు.

ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన, “ఇప్పటికే అమెరికాలో మా వద్ద H-1B మీద చాలామంది ఉన్నారు. కాబట్టి ప్రస్తుతం కొత్త నియామకాల గురించి ఎలాంటి ప్లాన్ లేదు. బదులుగా స్థానిక మానవ వనరులను పెంపొందించడం పైనే దృష్టి పెడుతున్నాం,” అని చెప్పారు.

TCS అమెరికాలో H-1B వీసా హైరింగ్స్‌లో నిజంగా టాప్‌లో ఉంది. 2009 నుంచి 2025 వరకు మొత్తం “98,259 మంది” H-1B వీసా హోల్డర్లను కంపెనీ హైర్ చేసింది. 2025లోనే ఒక్క ఏడాదిలో 5,505 మందిని తీసుకుని, మైక్రోసాఫ్ట్, మెటా, ఆపిల్, గూగుల్ వంటి టెక్ దిగ్గజాలను కూడా వెనక్కి నెట్టేసింది. కృతివాసన్ మాట్లాడుతూ, “మా అసలు ప్లాన్ ఏంటంటే ఉద్యోగులను H-1B మీద పంపి, కొంతకాలం తర్వాత వారిని తిరిగి తీసుకురావడం లేదా స్థానికులతో రోటేట్ చేయడం. ఎవరి వీసా రిన్యూ చేయాలి, ఎవరిని తిరిగి తీసుకురావాలి అన్నది అవసరాన్ని బట్టి నిర్ణయిస్తాం,” అన్నారు.

అతను మరో ముఖ్యమైన విషయం కూడా చెప్పారు. లాటిన్ అమెరికా, మిడిల్ ఈస్ట్, ఆసియా-పసిఫిక్ ప్రాంతాల్లో TCS ఇప్పటికే ఎక్కువగా స్థానిక ఉద్యోగులతోనే పని చేస్తోందని. ప్రస్తుతం AI ప్రాజెక్టులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, కేవలం టెక్నికల్ స్కిల్స్ కాకుండా, క్లయింట్లతో దగ్గరగా కలిసి పనిచేసే సామర్థ్యం ఉన్న స్థానిక సిబ్బంది అవసరం పెరిగిందని తెలిపారు. “మేము అమెరికా, యూరప్ ప్రాంతాల్లో స్థానిక వర్క్‌ఫోర్స్‌ను మరింతగా విస్తరించడానికి ప్రయత్నిస్తున్నాం,” అని కృతివాసన్ చెప్పారు. ఇండస్ట్రీలో చాలామంది నిపుణులు చెబుతున్నదాని ప్రకారం, TCS ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత, ఇతర పెద్ద కంపెనీలు కూడా H-1B నియామకాలను తగ్గించే దిశగా వెళ్లే అవకాశం ఉంది.

హైదరాబాద్‌లోని కన్సల్టెన్సీ మేనేజర్ ఎం. దినేష్ మాట్లాడుతూ, “TCS CEO చెప్పిన తర్వాత, అమెజాన్, కాగ్నిజెంట్, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు కూడా ఇలాంటి నిర్ణయాల వైపు వెళ్తాయేమో అనిపిస్తోంది. ఇవన్నీ భారతదేశంలో బ్రాంచ్‌లు కలిగిన కంపెనీలు కాబట్టి, అమెరికాలో ఎవరు అవసరం అయితే కొత్త H-1B వీసా కోసం $1,00,000 ఖర్చు చేయడం కంటే, “L-1 వీసా” ద్వారా తమ సిబ్బందినే అక్కడికి పంపే అవకాశం ఎక్కువ, అన్నారు.

ఈ నిర్ణయం మొదటగా, అమెరికాలో పని చేయాలనుకునే భారతీయ ఐటీ ప్రొఫెషనల్స్‌కి ఒక పెద్ద మార్పు. ఇప్పటివరకు చాలా మంది H-1B వీసా ద్వారా అమెరికాలో ఉద్యోగాలు పొందుతున్నారు. కానీ TCS కొత్తగా H-1B హైరింగ్ ఆపేసిన తర్వాత, ఆ అవకాశాలు గణనీయంగా తగ్గవచ్చు. అదే సమయంలో, అమెరికాలో ఉన్న లోకల్ టాలెంట్‌కి కొత్త అవకాశాలు పెరుగుతాయి.ఈ నిర్ణయం ఇతర భారతీయ ఐటీ కంపెనీలైన ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సీఎల్ వంటి సంస్థలకు కూడా ఒక సూచికగా మారే అవకాశం ఉంది. అదనంగా, L-1 వీసా డిమాండ్ పెరగడం వల్ల కంపెనీల ఆన్ సైట్ వర్క్ మోడల్ కూడా మారుతుంది. ఉద్యోగులను దీర్ఘకాలం అమెరికాకు పంపించడం కంటే, తాత్కాలికంగా లేదా షార్ట్ టర్మ్ రొటేషన్స్ రూపంలో పంపే విధానం పెరగవచ్చు. దీని వల్ల మొత్తం ఐటీ వర్క్ మోడల్‌లో ఒక కొత్త దిశ కనిపిస్తుంది.

మొత్తంగా చూస్తే, TCS ఈ నిర్ణయం వలన అమెరికాలో IT ఉద్యోగాల నియామక విధానం మారే సూచనలు కనిపిస్తున్నాయి. H-1B మీద ఆధారపడటం తగ్గి, లోకల్ హైరింగ్ & L-1 వీసా మార్గం ప్రధానంగా మారే అవకాశం ఉంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.